- అస్థిత్వం కోసం మమత పోరాటం
- అమిత్ షాను ఢీకొట్టేందుకు పవార్ సలహాలు
- ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు వ్యూహరచన
వంగ దేశంలో దశాబ్ధాలుగా ఉన్న కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు గొట్టి అధికారాన్ని కైవసం చేసుకున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బెంగాల్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఆ ప్రయత్నంలో తొలిసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రూపంలో గట్టి ప్రత్యర్థిని ఎదుర్కొంటున్నారు. ఈ ప్రయత్నంలో తీవ్ర ఒడిదుడుకులను చవిచూస్తున్నారు. గత కొన్ని వారాలుగా తృణమూల్ కు చెందిన కొందరు ముఖ్య నేతలు బిజెపి పంచన చేరడంతో ఎన్నికల ముంగిట ఉన్న మమతకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. దీంతో అమిత్ షా ను ఎదుర్కొనేందుకు మమత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సలహాలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో బీజేపీకి అధికారం దక్కకుండా చేయడమే బద్ధశత్రువులైన పార్టీలను ఒక్కటిగా చేసి ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో పాలకకూటమిని తీర్చిదిద్దిన వాస్తుశిల్పిగా శరద్ పవార్ ఖ్యాతిగడించారు.
కోల్ కతాలో మమత ర్యాలీ
ప్రజాస్వామ్యంపై మోడీ దాడి చేస్తున్నారని దేశ ప్రజలకు చెప్పాలని తెలియజెప్పాలని మమత, పవార్ లు యోచిస్తున్నారు. ఇందుకోసం జనవరి మొదటి వారంలో కోల్ కతాలో మమతాబెనర్జీతో పవార్ సమావేశం కానున్నారు. కొందరు ప్రాంతీయ పార్టీ నేతలతో కోల్ కతాలో ర్యాలీని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి మమతా బెనర్జీ, శరద్ పవార్ లు తమ సొంత ప్రాంతీయ పార్టీలను స్థాపించడానికి ముందు ఇద్దరు నేతలూ కాంగ్రెస్ నుంచి వచ్చినవారే కావడం విశేషం. దేశంలో అత్యంత ఆకర్షణీయ మైన, ప్రజాదరణ గల రాజకీయవేత్తల్లో శరద్ పవార్ ఒకరు. తన 80వ ఏట బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో ఐక్య కూటమిని అధికారంలో కూర్చోబెట్టడంలో శరద్ పవార్ కృషి ఎనలేనిది.
తెలంగాణలో పట్టు బిగించిన బీజేపీ
తెలంగాణలో ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ పూర్తి స్థాయిలో పట్టు సాధించింది. కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు అగ్రశ్రేణి నాయకులను హైదరాబాద్ లో కవాతు చేయించడంద్వారా పార్టీ ఎవరూ ఊహించనిరీతిలో కార్పొరేటర్లను గెలిపించుకోగలిగింది. పార్లమెంటులో బీజేపీతో అంటీ ముట్టనట్లు వ్యహరించినా కీలక బిల్లులు సభ ఆమోదం పొందే సమయంలో టీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా ఓటేయడం లేదా ఓటింగ్ కు దూరంగా ఉండటం ద్వారా సహాయం చేస్తూ వస్తోంది. అయినా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, కేసీఆర్ ను చావుదెబ్బ తీసింది. ఒడిశాలోని నవీన్ పట్నాయక్, తమిళనాడులో డీఎంకే లాంటి ప్రాంతీయ పార్టీలు తమ మనుగడ కోసం కేంద్రంతో అయిష్టంగానైనా చేతులు కలపాల్సివస్తోంది.
ఇదీ చదవండి: బెంగాల్ ప్రిపోల్ సర్వేలో మమతకు ఎదురుదెబ్బ
బీజేపీ నుంచి ప్రాంతీయ పార్టీలకు ముప్పు
బీజేపీ నుంచి ప్రాంతీయ పార్టీల అస్థిత్వానికి ముప్పు పొంచి ఉందని శరద్ పవార్, మమతా బెనర్జీలు గట్టిగా విశ్వసిస్తున్నారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటి పైకి తెచ్చి జాతీయ స్తాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని మమత కృషి చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలతో కూటమి కట్టడం ఆనక పైచేయి సాధించేందుకు మిత్రపక్ష అస్థిత్వం ప్రశ్నార్ధకమయ్యేలా ప్రవర్తించడం బీజేపీ నైజమని మమత అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రధాన ఉదాహరణగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను చూపిస్తున్నారు. ఇటీవల బీహార్ ఎన్నికల్లో జేడీయు పనితీరును విశ్లేషించడమే కాకుండా అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయుకు ఉన్న ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా మిత్ర పక్షాల మనుగడను బీజేపీ ప్రశ్నిస్తుందని విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: తృణమూల్ కాంగ్రెస్ లో భారీ కుదుపు
కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో టచ్ లో ఉన్న పవార్
ఆసక్తికరమైన విషయం ఏంటంటే శరద్ పవార్, మమతా బెనర్జీలు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ లతో టచ్ లో ఉన్నారు. అదే సమయంలో గాంధీల కుటుంబానికి దూరం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. సోనియా వ్యక్తిగత సలహాదారు అహ్మద్ పటేలే అకస్మిక మరణం తర్వాత కాంగ్రెస్ కు కొత్త ట్రబుల్ షూటర్ గా అవతరించిన కమల్ నాథ్ తో శరద్ పవార్ క్రమం తప్పకుండా సమాలోచనలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది.
మమతకు పవార్ పాఠాలు
దేశంలోని ప్రాంతీయ పార్టీల పునరేకీకరణకు పవార్ కృషి చేస్తున్నారు. అమిత్ షా దూకుడుకు కళ్లెం వేసేందుకు పవార్ మమతకు సలహాలిస్తున్నారు. అమిత్ షా పర్యటనలతో ఉద్రిక్తతలు చెలరేగుతాయని గాఢంగా నమ్ముతున్నమమతా బెనర్జీ ప్రజల మూడ్ ను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పవార్ ఇచ్చిన సలహాలతో బీజేపీని నిలువరించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలుగు ప్రజలను ఆకర్షించేందుకు బెంగాల్ లో తెలుగును అధికార భాషగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు తన రక్తసంబంధీకులెవరూ పార్టీ పదవుల్లో ఉండరనీ అలాగే పార్టీ కార్యకలాపాలలో జోక్యం చేసుకోరని బహిరంగ ప్రకటను చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటనతో వారసత్వ రాజకీయాలకు తృణమూల్ కాంగ్రెస్ దూరమనే భావనను ప్రజల్లో కల్పించాలని మమత భావిస్తున్నారు. అమిత్ షా తన బెంగాల్ పర్యటనల్లో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలను పదే పదే ఎత్తి చూపుతున్నారు. ఇది ముఖ్యమంత్రి మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నీడ నుంచి పార్టీని దూరంగా ఉంచవచ్చు. దీంతో మమతపై అమిత్ షా చేస్తున్న విమర్శలకు బదులచ్చినట్లవుతుందని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది.
యూపీఏ ఛైర్ పర్సన్ గా పవార్?
మహారాష్ట్రలో బీజేపీని అధికారం నుంచి దూరం చేయడానికి బద్దశత్రువులైన ప్రతర్ధుల బృందాన్ని ఏకం చేసిన ప్రభుత్వ ఏర్పాటుకు కృషిచేయడంతో పవార్ పొలిటికల్ మైలేజీ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం యూపీఏ ఛైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ తన రాజకీయ వారసుడ్ని వెతికే పనిలో ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ రాజకీయాల పట్ల విముఖత చూపించడంతో ఆ పదవికి సరైన నాయకుడ్ని ఎంపిక చేసేందుకు తెరవెనుక భారీ కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నాయకులు పవార్ ను కాంగ్రెస్ లోకి తీసుకురావాలని సోనియాకు సలహాలిస్తున్నారు. యూపీఏ ఛైర్ పర్సన్ పదవిని పవార్ కు అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని గాంధీ కుటుంబీకులు భావిస్తున్నట్లు సమాచారం. యూపీఏ నుంచి బయటకు వెళ్లిన పార్టీలు కూడా తిరిగిరాగలవని యోచిస్తున్నారు. అలా కాకుండా ప్రాంతీయ పార్టీలు చెల్లచెదురుగా ఉంటే బీజేపీ ప్రాభవాన్ని అడ్డుకోలేమని అదే సమయంలో ప్రాంతీయ పార్టీల మనుగడ కూడా ప్రశ్నాకర్థమయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: ఆరు నెలల ముందే బెంగాల్ దంగల్ షురూ