- తెన్నేటి విశ్వనాథం ప్రదర్శించిన నాయకత్వ లక్షణాలు అవసరం
- టికాయత్, మేథాపాట్కర్ ల మద్దతు స్వీకరించాలి
- ఉద్యమాన్ని ఉధృతం చేయాలి
- ఉక్కు పరిశ్రమను ప్రభుత్వరంగంలో కొనసాగించాలి
- పవన్ చెప్పింది నిజమే, మన పోరాటం మనమే చేసుకోవాలి
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలో భాగంగా కోల్పోడానికి సిద్ధంగా ఉన్న సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ‘విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు’ రణన్నినాదంతో, అనేక త్యాగాల ఫలితంగా ఏర్పడిన సంస్థ. స్టీల్ సిటీగా విశాఖపట్నంకు పేరురావడానికి కారణభూతమైన సంస్థ. అబ్బో! పరిశ్రమ స్థాపన,ప్రయాణం పెద్ద చరిత్ర. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఉక్కు పరిశ్రమలు దేశంలోనే లేవు. విశాఖపట్నంలో స్థాపించినా, ఇది సర్వ ఆంధ్రజనులకు సంబంధించిన పరిశ్రమ. తెలుగువాడి పోరాటపటిమకు, త్యాగనిరతికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే గొప్ప సంస్థ. ఇది త్వరలో భారత ప్రభుత్వ అధీనం నుంచి ప్రైవేటు శక్తుల చేతుల్లోకి వెళ్లనుంది. ఈ అన్యాయాన్ని ఆపి, సంస్థను దక్కించుకోడానికి స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, హక్కుల వేదికలు ఏకమై పోరాటబాట పట్టాయి. నెలల తరబడి ఈ ఉద్యమం సాగుతోంది. ప్రారంభంలో బిజెపి తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపాయి. మొదట్లో జనసేన స్థానిక నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. తర్వాత జరిగిన పరిణామాల్లో, జనసేన – బిజెపి జతకట్టాయి. ఈ నేపథ్యంలో, ఈ పోరాటంలో జనసేన పాత్ర నామమాత్రమే అయిపోయింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ఎక్కువభాగం మౌనాన్నే ఆశ్రయించాల్సి వచ్చింది. నేడు ‘నేను సైతం’ అంటూ ఆయన విశాఖపట్నం వచ్చి, మొట్టమొదటిసారిగా బహిరంగ సభలో తన వాణిని వినిపించారు. నాయకుడు, కవి కార్మికుల వైపు నిలబడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం తీసుకోవడం, తదనుగుణంగా అడుగులు వేయడం మంచిదే. రైతు ఉద్యమ సంఘాల అగ్రనేత రాకేష్ టికాయిత్ ఆ మధ్య విశాఖ వచ్చి వెళ్లారు. దిల్లీలో ఉద్యమించండని సూచించారు. ఉద్యమంలో తమ భాగస్వామ్యాన్ని జతకలుపుతామని ఆయన మాట యిచ్చారు. సామాజిక ఉద్యమాల అగ్రనేత మేధాపాట్కర్ మొన్ననే విశాఖపట్నంలో పర్యటించారు. నర్మదా బచావో.. ఉద్యమం స్థాయిలో ఉద్యమాలు చేస్తేకానీ, కేంద్రం దిగిరాదని వ్యాఖ్యానించారు. ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యులను చేసి ఉక్కు ఉద్యమాన్ని ఉప్పెనలా తీర్చి, కేంద్రం మెడలు వంచాలని ఆమె పిలుపునిచ్చారు.
Also read: గ్రామాలలో ఐటీ వెలుగులు!
పవన్ ప్రతాపం వైసీపీపైనే
తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఇవన్నీ ఉద్యమానికి ఊపునిచ్చే అంశాలే. కానీ కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంలో ఏ మేరకు ప్రభావాన్ని చూపిస్తాయన్నది అనుమానమే. విశాఖ వేదికగా సాగిన పవన్ కల్యాణ్ ప్రసంగాన్ని గమనిస్తే, రాష్ట్రప్రభుత్వం, అధికార పార్టీ వై.సి.పి పైన మాత్రమే ఆయన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినట్లు కనిపిస్తోంది. ప్రైవేటీకరణకు మూలకారకమైన కేంద్ర ప్రభుత్వాన్ని,బిజెపిని ఆయన పల్లెత్తు మాట అనలేకపోయారు. బిజెపితో కలిసి ప్రయాణం చేస్తూఉండడం వల్ల, వారిని ఏమీ అనలేని పరిస్థితి ఆయనకు వచ్చింది. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించినప్పుడే తనకు బాధ కలిగిందని ఆయన అంటున్నారు. హోం మంత్రి అమిత్ షాను కలిసి ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పినట్లు పవన్ గుర్తు చేసుకుంటున్నారు. బాధ పడడం, చెవిలో చెప్పడం వల్ల సమస్యలకు పరిష్కారాలు లభించవని పవన్ కల్యాణ్ గుర్తెరగాలి. తన వెనుక ఎమ్మెల్యేలు,ఎంపీలు లేకపోవడం వల్ల చట్టసభల్లో తమ గళాన్ని విప్పలేకపోయమని ఆయన అంటున్నారు. ప్రజాబలం ఉంటేనే తనకు ఎవరైనా అప్పాయింట్ మెంట్ ఇస్తారని పవన్ చెబుతున్నారు. అది వాస్తవమే కానీ, ప్రజాబలం ఊరకే వచ్చేది వచ్చేది, రాత్రికిరాత్రి కలిసొచ్చేదీ కాదు. పోరాటపటిమతో,బలమైన వాక్కుతో, నడకతో, నడతతో, నాయకత్వం పట్ల విశ్వాసాన్ని పెంచుకుంటూ సాధించుకొనేది. బలమైన నాయకులను తయారుచేసినవాడే మహానాయకుడుగా రూపుదిద్దుకుంటాడు. అటువంటివారినే సమాజం గుర్తిస్తుంది. ఉక్కు ఉద్యమాన్ని ఊర్రూతలూగించిన తెన్నేటి విశ్వనాథం వంటివారు ఆ కోవకు చెందిన మహానాయకులు. నిజాయితీ, నిర్భీతి, నిస్వార్థంతో ప్రజల పక్షాన నిలిచిన ఏ నాయకుడికైనా, సమాజంలో ఎప్పటికీ గుర్తింపు, గౌరవం ఉంటాయి. అదే ప్రజాబలం. పెట్టుబడుల ఉపసంహరణ అనే విధానం ఎప్పటి నుంచో ఉంది. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు, ఈ విషయంలో ఆచితూచి అడుగువేశారు. నేటి దేశాధినేతలు అటువంటి విధానాలను ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడే ఆర్ధిక విధానాలలో, పారిశ్రామీకరణలో సమతుల్యతను సాధించగలుగుతాం. దానిని పీవీ ఆచరణలో చేసి చూపించారు. స్టీల్ ప్లాంట్ వేళ్లూనుకోవడంలో పీవీ పాత్రను మరువలేం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ ఆర్ధిక సంవత్సరం లాభాల్లోనే నడుస్తోందని తాజా నివేదికలు చెబుతున్నాయి. కొన్నిసార్లు నష్టాలు వచ్చినమాట నిజమే కానీ, అనేకసార్లు లాభాలు కూడా వచ్చాయి. దానిని గుర్తించాలి. సొంత గనులు లేకపోవడం కూడా నష్టాలకు ముఖ్యమైన కారణమే.
Also read: కన్నడసీమను విషాదంలో ముంచిన పునీత్
కేంద్రం తలచుకుంటే రాయితీలు ఎంతపని?
కేంద్రం తలుచుకుంటే, గనుల కేటాయింపు చిటికలో పని. అప్పులకు వడ్డీభారాన్ని తగ్గించడం క్షణంలో పని. ఉత్పత్తి సామర్ధ్యం కూడా గణనీయంగా పెరిగింది. సంస్థ బ్రాండ్ ఇమేజ్ కూడా బాగా పెరిగింది. కోట్లాది రూపాయల విలువచేసే సొంత భూములు ఉన్నాయి. నిపుణులైన ఉద్యోగులు ఉన్నారు. నష్టాలను చవిచూడకుండా, నిరంతరం లాభాలబాటలో నడిపించడానికి అనేక మార్గాలు ఉన్నాయని నిపుణులు పదే పదే సోదాహరణంగా నివేదికలు సమర్పించారు. మానవవనరులను మరింతగా సద్వినియోగం చేసుకుంటూ, నిర్వహణలో లోపాలు ఉంటే, వాటిని సరిదిద్దుకుంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. కేంద్రం నుంచి సహకారం ఎంతో స్థాయిలో అందాల్సివుంది. ప్రత్యేకహోదా ఎలాగూ అటకెక్కింది. దానిని గట్టిగా అడిగే పరిస్థితి ప్రస్తుతం ఎవ్వరికీ లేదు. వారం లోపు అఖిలపక్షాన్ని పిలవకపోతే, ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని పవన్ అంటున్నారు. మన పోరాటం మనమే చేసుకోవాలని ఆయన అంటున్నారు. మంచిదే. పోరాటం ద్వారానో, బిజెపి పెద్దలతో ఉన్న అనుబంధం ద్వారానో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరింపజేసి, విశాఖ ఉక్కును కాపాడితే అంతకంటే కావాల్సింది ఇంకేముంది? గత ఎన్నికల్లో ఆయన గాజువాకలో నిలబడి ఓడిపోయారు. ఓడినచోటే గెలిచి చూపించడం వీరుడి లక్షణం. అనుకున్నది సాధించేంత వరకూ మడమతిప్పకుండా ఉండడం నాయకుడి లక్షణం. ప్రజల పట్ల నిలబడడం ప్రజానాయకుడి లక్షణం. విశాఖ ఉక్కును కాపాడితే, ఇటు పవన్ కల్యాణ్ కు, జనసేన పార్టీకి -అటు బిజెపికి కూడా భవిష్యత్తులో మంచి జరుగుతుంది. ఆ దిశగా పవన్ కల్యాణ్ బలమైన అడుగులు వేయాలని ఆశిద్దాం. తెలుగుదేశం అధిపతి చంద్రబాబునాయుడు కూడా విశాఖ ఉక్కు ఉద్యమంలో పెద్దగా కదిలింది లేదు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి కదలాల్సిన సందర్భం. ఈ ఉద్యమంలో, జనసేన ద్వారా పవన్ కల్యాణ్ ఒక్కడే ముందుకు వెళ్తారా? మిగిలినవారిని కూడా కలుపుకుంటారా తేలాల్సివుంది.
Also read: రసకందాయంలో పంజాబ్ ఎన్నికల రంగం