- తుపానుకు నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తా
- కృష్ణాజిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
- నివర్ తుపానుకు దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించిన పవన్
- రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ
- మాజీ ఎంపీ కేపీ రెడ్డెయ్యను కలిసిన పవన్
నివర్ తుపాను కారణంగా జరిగిన పంటనష్టాన్ని పరిశీలించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లాలో పర్యటించారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
రైతులకు ఆర్థిక సాయం అందే వరకు పోరాటం
అనంతరం కంకిపాడు, పామర్రు ప్రాంతాలలో నివర్ తుపాను తాకిడికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. నష్టపోయిన పంటలను పవన్ కు చూపిస్తూ రైతులు కంటతడి పెట్టారు. ఈ ఘటనతో చలించిన పవన్ కళ్యాణ్ పంట నష్టానికి గురైన రైతుల్లో భరోసా నింపేందుకే వచ్చానని తెలిపారు. చేతికొచ్చిన పంట చేజారిపోవడం బాధాకరమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం పెట్టే రైతన్న కన్నీరు కార్చే పరిస్థితి నెలకొందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి రైతులకు ఆర్థిక సాయం అందే వరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కష్టాలతో రాజకీయాలు చేయనన్న పవన్
ప్రకృతి వైపరీత్యాలతో రాజకీయాలు చేయనని పవన్ వ్యాఖ్యానించారు. ఓట్ల సమయంలో వచ్చి వెళ్లే వ్యక్తి ని కాదని ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు వచ్చానన్నారు జనసేనాని. సొంత భూమి ఉన్న రైతులతో పాటు, కౌలు రైతులకూ ప్రభుత్వం సాయం చేయాలని పవన్ డిమాండ్ చేశారు. రైతు కంట కన్నీళ్లు దేశానికి మంచిది కాదన్న పవన్, కర్షకుల కష్టాలు, కన్నీళ్లను కేంద్రం దృష్టి కి తీసుకెళ్ళి తగు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. తుపానుకు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.
మాజీ ఎంపీ కేపీ రెడ్డయ్యను కలిసిన పవన్
పవన్ కళ్యాణ్ అవనిగడ్డ వెళ్తూ మచిలీ పట్నం మాజీ ఎంపీ కె.పి. రెడ్డెయ్యను కలిశారు. ప్రకృతి విపత్తుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, పంట నష్టంపై ప్రభుత్వ అంచనాలు తక్కువగా ఉంటాయని రెడ్డియ్య తెలిపారు. ప్రభుత్వ అంచనాలతో రైతులను తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్ రాకతో స్తంభించిన ట్రాఫిక్
జనసేనాని రాకతో కంకిపాడులో అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఉప్పులూరు, పునాదిపాడుల మధ్య భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు పోలీసులు ఇబ్బందులు పడ్డారు.