- దివీస్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటన
- ప్రజసమస్యలపై స్థానికులకు పవన్ మద్దతు
ఆంధ్రప్రదేశ్ లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రజాసమస్యలపై గళం వినిపించనున్నారు. ఇటీవల కృష్ణాజిల్లాలో పర్యటించి రైతులను పరామర్శించిన పవన్ కల్యాణ్ ఇపుడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తుని నియోజకవర్గంలోని తొండంగిలో ఏర్పాటుకానున్న దివీస్ ఫార్మా సంస్థ ప్రభావిత ప్రాంతాలలో ఈ నెల 9న పర్యటించనున్నారు. దివీస్ ఫార్మా తమ జీవితాలపై దుష్ప్రభావం చూపుతుందంటూ ఆందోళన చేపడుతున్న స్థానికులకు పవన్ మద్దతు పలకనున్నారు.
టీడీపీ, వైసీపీల మధ్య ఆరోపణల పర్వం
దివీస్ లేబరేటరీస్ వ్యవహారం వివాదస్పదంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా తొండంగి సమీపంలోని దివీస్ సంస్థ ఏర్పాటు చేయబోతున్న కొత్త యూనిట్ పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికారంలో ఉన్నపుడు అనుమతులచ్చిన టీడీపీ ఇపుడు వ్యతిరేకిస్తోంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నపుడు తీవ్రంగా వ్యతిరేకించిన వైసీపీ అధికారంలో కి వచ్చాక ఆచితూచి వ్యవహరిస్తోంది. ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తే సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. భూగర్భజలాలు కలుషితమై వ్యవసాయం జనజీవనానికి ఇబ్బందులెదురవుతాయని ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: నివర్ తుపాను బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్
దివీస్ ప్రతినిధులతో మంత్రి చర్చలు
అయితే దివీస్ పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి దివీస్ ప్రతినిధులతో చర్చించారు. పరిశ్రమపై ప్రజల్లో నెలకొన్న అభ్యంతరాలు, సందేహాల నివృత్తి జరిగేవరకు ఒక్క ఇటుక కూడా కదపకూడదని మంత్రి చెప్పారు. దీంతో అన్ని సమస్యలు పరిష్కరించాకే నిర్మాణం విషయంలో ముందుకెళతామని దివీస్ ప్రతినిధులు ప్రభుత్వానికి హామీ ఇవ్వడంతో ఆందోళనకు తాత్కాలికంగా తెరపడింది.
పవన్ టూర్ విశేషాలు
9 వ తేదీ మధ్యాహ్నం తుని చేరుకుని అక్కడి నుంచి దానవాయిపేట, కొత్తపాక పరిసర ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పరిశ్రమను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న స్థానికులను, ఇటీవల పోలీసుల లాఠీచార్జిలో గాయపడినవారిని పవన్ పరమర్శించనున్నారు. అనంతరం 2 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.
ఇదీ చదవండి:తిరుపతిలో పోటీకి జనసేన సై?