- రెండేళ్ళ విరామం తర్వాత మళ్లీ వైజాగ్ వెడుతున్న పవర్ స్టార్
- ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతు
- నిర్మాణ కార్మికులకు మద్దతుగా ‘ఛలో వైజాగ్’
- వైజాగ్ లో వరుసగా వారం రోజులపాటు జనసేన కార్యక్రమాల
అశ్వనీకుమార్ ఈటూరు
విశాఖపట్టణం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019లో వైజాగ్ లోని గాజువాకలో ఓడిపోయిన తర్వాత కడచిన రెండు సంవత్సరాలలో ప్రప్రథమంగా ఇప్పుడు వైజాగ్ వెడుతున్నారు. ఈ సారి విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మికులకూ, పౌరులకూ మద్దతు ప్రకటించేందుకు వెడుతున్నారు. అదే సమయంలో నిర్మాణ కార్మికుల కష్టనష్టాలకు సానుభూతి ప్రకటిస్తూ ‘చలో వైజాగ్’ కార్యక్రమం పెట్టుకున్నారు.
జనసేన రాజకీయ వ్యవహారాల సంఘం అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్, పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ పార్టీ కార్యాలయంలో సోమవారంనాడు సమావేశమై విశాఖపట్టణం కార్యక్రమాలపైన వివరంగా చర్చించారు.
కడచిన 260 రోజులుగా విశాఖపట్టణం ఉక్కు కర్మాగారం కార్మికులు ఆందోళన చేస్తన్న విషయం విదితమే. వారు నిరసన ప్రదర్శనలు క్రమం తప్పకుండా నిత్యం చేస్తూ వస్తున్నారు. బీజేపీ, జనసేన మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ ఈ ఉద్యమాన్ని బలపర్చుతున్నాయి. దిల్లీలో నిరసనలూ, పాదయాత్రలూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. చివరిగా పవన్ కల్యాణ్ ఉద్యమాన్ని బలపరచాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 31వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు పవన్ కల్యాణ్ వైజాగ్ లో ఉక్కు కార్మికుల ఉక్కు సంకల్పానికి ప్రత్యక్షంగా మద్దతు తెలుపుతారు.
తమ నాయకుడు పవన్ కల్యాణ్ దిల్లీలో హోంమంత్రి అమిత్ షాను ఫిబ్రవరిలోనే కలుసుకొని విశాఖ ఉక్కుఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయవద్దని చెప్పారని జనసేన నాయకులు గుర్తు చేస్తున్నారు. జనసేన బీజేపీకి దూరం అవుతోందనే గుసగుసలు పార్టీ కార్యకర్తలలో వినిపిస్తున్నాయి. బీజేపీతో మైత్రికన్నా శత్రుత్వమే మంచిదని పార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. కార్మికులకూ, కర్షకులకూ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీతో పొత్తు కంటే పోరు మెరుగని వారు అంటున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పార్టీకి నష్టం అవుతుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. బీజేపీ, జనసేనల మధ్య అంతరం ఈ మధ్య బాగా పెరిగింది. బద్వేలు ఉపఎన్నికలో జనసేన పోటీ చేయకపోవడం బీజేపీకి నచ్చలేదు. చివరికి బీజేపీ పోటీలో దిగింది. బీజేపీ, జనసేన ఒకటేనంటూ రెండు పార్టీల నాయకులు ఊదర కొడుతున్నప్పటికీ కార్యకర్తల మధ్య ఐక్యత లేదన్నది స్పష్టం. విశాఖపట్టణంలో పెద్ద కార్యక్రమం పెట్టుకోవడంలో పవన్ కల్యాణ్ ఉద్దేశం బీజేపీకి దూరం కావాలనే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.