వోలేటి దివాకర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా బీజేపీకి మరింత దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ దూరం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ వ్యవహార శైలి ఈ వాదనలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. స్వాతంత్ర్య అమృత మహోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జాతీయ జెండాను దేశ వ్యాప్తంగా ప్రజలంతా తమ సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ పిక్ గా, డిపిలుగా పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దీనితో పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు జాతీయ జెండాను సెల్ ఫోన్లు, ట్విట్టర్ ఖాతాల్లో పెట్టుకున్నారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం మోడీ పిలుపును పట్టించుకోలేదు. ఇప్పటికీ ఆయన ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్ లో ఆయన బొమ్మనే కొనసాగిస్తున్నారు. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈమధ్య కాలంలో జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యక్రమాలు కూడా జరిగిన దాఖలాలు కనిపించడం లేదు. భీమవరంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా పవన్ దూరంగా ఉండటం గమనార్హం. ఇలాంటి పరిణామాలు పవన్ బీజేపీకి దూరంగా జరుగుతున్నారన్న సంకేతాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
Also read: రూ .2 వేల కోట్లు గోదావరి పాలు …. ఎవరు బాధ్యులు?
టీడీపీతోనే పవన్ పయనం?
జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయ విన్యాసాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి పవన్, బీజేపీ మధ్య పొత్తు విచ్ఛిన్నం అవుతుందని, జనసేన, టీడీపీ పొత్తు దాదాపు ఖరారు అయిపోయిందని, సీట్ల సర్దుబాటు తేలాల్సిఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీకి 125, జనసేనకు 50 సీట్లు కేటాయించేలా ఒప్పందం కుదిరింది అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
Also read: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే…..
అయితే రాష్ట్రంలో అధికార వైసిపికి ప్రజాదరణ క్రమంగా తగ్గిపోతోంది. జన సేనతో కలిస్తే తప్ప ప్రతిపక్ష టిడిపి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే పరిస్థితుల్లో లేదు. వచ్చే ఎన్నికల్లో టిడిపి, బిజెపి, జనసేన కలిసి పనిచేస్తే వైసిపికి ఇబ్బందే. వీటిలో ఏ పార్టీ విడిపోయినా వైసీపీకి కోద్దో గొప్పో ప్రయోజనమే.
Also read: సార్వత్రిక ఎన్నికల సారథి సోము వీర్రాజే ? !