తెలుగుదేశం ప్రతినిధి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైన ధ్వజమెత్తిన నాయకుడు పట్టాభి మాల్దీవులకు వెళ్ళారని సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేస్తున్నది. ఆయన విమానంలో కూర్చున్న ఫొటోలనూ, విమానాశ్రయంలో ఉన్న ఫొటోలనూ సోషల్ మీడియాలో పెట్టారు. ముఖ్యమంత్రిని దుర్భాషలాడారనే ఆరోపణపైన పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలం మచిలీపట్టణంలోనూ, ఆ తర్వాత రాజమహేంద్రవరం జైలులోనూ ఉంచారు. అంతలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టుకు ముందు వైఎస్ ఆర్ సీపీ కార్యకర్తలు పట్టాభి ఇంటిపై దాడి చేసి చిందరవందర చేశారు. పట్టాభి ఇంటిపై దాడికి సంబంధించి పోలీసులు 23మందిని గుర్తించారు.
పట్టాభి విజయవాడ వాస్తవ్యుడు. కేటరింగ్ వ్యాపారం నుంచి పైకి ఎదిగారు. పార్లమెంటు సభ్యుడు నాని దగ్గర కొంతకాలం పని చేశారు. జగన్ ను దుర్భాషలాడటం, వైసీపీ నాయకులు దాన్ని పట్టించుకొని ప్రతీకార చర్యలు తీసుకోవడం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మూడు రోజులు నిరాహారదీక్ష చేయడం, దిల్లీకి వెళ్ళి రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్ లో శాంతి,భద్రతలు క్షీణించాయని చెబుతూ రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం, పట్టాభి దిష్టిబొమ్మను ఆంధ్రప్రదేశ్ అంతటా తగులపెట్టడంతో ఆయన హోదా అమాంతంగా పెరిగింది. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఢీకొంటున్న టీడీపీ నాయకులలో ప్రముఖుడుగా పట్టాభి పేరుతెచ్చుకున్నారు.