Tuesday, November 5, 2024

దేశప్రేమికుల్ని ఎగతాళి చేస్తున్న దేశద్రోహులు

బీజేపీకి మెజార్జీ ఉన్నందువల్ల పార్లమెంట్ ను రద్దు చేసి ప్రెసిడెంట్ రూల్ లాంటిది పెట్టినా పెడతారు. ఈ దిశగా వారు రాజ్యాంగాన్ని మార్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. మనుషులంతా సమానం కాదనీ, పుట్టుకనుబట్టి మనషులను చీల్చిన మూడువేలయేళ్ళనాటి వారసత్వాన్ని కొనసాగిస్తున్నవారు దేశంలో అధికారంలో ఉన్నారు. పైగా వారిది సనాతన ధర్మ సంప్రదాయం అని చెప్పుకుంటున్నారు. వారు పవిత్రగ్రంథాలుగా చెప్పుకునేవన్నీ అమానవీయ విలువలకు పట్టం కట్టేవే. ఇలాంటివారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరికీ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అందాలని చెప్పిన ఈ దేశ రాజ్యాంగానికి విలువనిస్తారా? భారత దేశాన్ని ఆధునిక ప్రపంచంలోకి నడిపించిన మన రాజ్యాంగాన్ని, దాని విలువల్ని నిలబెడతారా? – అని అనుమానపడాల్సివస్తోంది. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఈ దేశ పౌరులకు పూర్తిగా అర్థమైంది. దీన్ని ఇలాగే కొనసాగిస్తే దేశంలో రాబోయేది ఇక ఫాసిజమే!

-లోక్ సభ పూర్వ సెక్రటరీ జనరల్ పి.డి.టి. ఆచారి.

ఈ రోజు దేశద్రోహులు అధికారంలోకి వచ్చారు కాబట్టి, దేశ ప్రేమికుల్ని ఎగతాళి చేస్తున్నారు. ముస్లింలయినందువల్ల వారిని రెండవ స్థాయి పౌరులుగా చూస్తున్నారు. మాట్లాడితే ఈ దేశంలోని ముస్లింలంతా పాకిస్తాన్ వెళ్ళిపోవాలని ఆదేశాలిస్తున్నారు. ముస్లింల ఇళ్ళమీదికి బుల్ డోజర్లు పంపుతున్నారు. దేశభక్తి గురించి మహోపన్యాసాలిచ్చే ఈ దేశ ద్రోహులకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. తెలిసినా, తెలియనట్టే ప్రవర్తిస్తుంటారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో అసలే పాలుపంచుకోని ఆరెస్సెస్ వారికి దేశభక్తి గురించి మాట్లాడే అర్హత ఉందా? ఆలోచించండి! భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఎనిమిది లక్షల మంది ముస్లింలు తమ ప్రాణాల్ని నజరానాగా సమర్పించారని వీరికి తెలుసా?  ఈ విషయం ఏ ముస్లిం రచయితో రాయలేదు. తారాచంద్ అనే చరిత్రకారుడు రాశాడు. ఈయన అలహాబాదు విశ్వవిద్యాలయానికి 1940లలో వైస్ చాన్సలర్ గా పని చేశారు. బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపనీకి వ్యతిరేకంగా తొలియుద్దం చేసినవాడు సిరాజుద్దౌలా. ఒకప్పటి బెంగాల్ నవాబు. రెండోయుద్ధం చేసినవాడు మరో బెంగాల్ నవాడు మీర్ ఖాసిం. దేశచరిత్రలో ‘క్విట్ ఇండియా’ (భారత్ ఛోడో ఆందోళన్) ఒక మహోన్నత పోరాటం. దాన్ని ప్రతిపాదించినవాడు ముస్లి యూసుఫ్ మెహర్ అలీ. ఒక సోషలిస్టు నాయకుడు.1942లో బొంబాయి మేయర్ గా పని చేశాడు. ఎరవాడ సెంట్రల్ జైలులో జైలు జీవితం గడిపాడు. ‘సైమన్ గోబ్యాక్’ నినాదం ఇచ్చింది కూడా ఈ యూసుఫ్ మెహర్ అలీయే.

Also read: టర్కీలో బౌద్ధం ఎందుకుందీ, ఎలా ఉంది?

‘జైహింద్’ నినాదాన్ని హిందూత్వవాదులు స్వంతం చేసుకోవడానికి తాపత్రయ పడుతున్నారు గానీ, ఆ నినాదాన్ని రూపొందించింది మన హైదరాబాద్ వాడైన అబీద్ హుస్సేన్ సఫ్రానీ. సాఫ్రాన్ అంటే కాషాయ రంగు హిందువులకు ప్రియమైనది. ఆ రంగును తన పేరు చివర తగిలించుకుని, పరమత సహనంలోని ఔన్నత్యాన్ని చాటి చెప్పినవాడు. 1857లో ప్రథమ స్వాతంత్ర్యోద్యమాన్ని ప్రారంభించినవాడు ముస్లిం – చివరి మొఘలు చక్రవర్తి బహదూర్ షా జఫర్! (కొందరు తప్పుగా మంగళ్ పాండే అని ప్రచారం చేస్తున్నారు.) 1917లో గాంధీజీ ప్రాణాలు కాపాడింది కూడా ఒక ముస్లిమే – గాంధీజీ బీహార్ చంపారన్ లో ఉన్నప్పుడు సూప్ లో విషం కలిపి, ఆయనతో తాగించి చంపాలని బ్రిటిష్ వారు కుట్రచేశారు. అప్పుడు అక్కడ వంటవాడిగా ఉన్న బతక్ మియా అన్సారీ తెగించి, విషయం గాంధీజీకి చెప్పి, తాగకుండా అడ్డుకోగలిగాడు.  వారు చేస్తున్న కుట్ర బయటపెడితే గనక, తనను తన కుటుంబాన్నీ సర్వనాశనం చేస్తామని బ్రిటిష్ వారు బెదించినా కూడా బతక్ మియా అన్సారీ తెగించి అలా చేయడమంటే మాటలు కాదు గదా? ఎంత తెగువ, ఎంత ధైర్యం, ఈ దేశం మీద ఎంత ప్రేమా ఉండాలి?

భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారులకు అండమాన్ లోని – కాలాపానీ – సెల్యులర్ జైలులో అత్యంత కఠినమైన శిక్షలు విధించేవారు. అలా శిక్షలు అనుభవించిన దేశభక్తులలో తొంభయ్ అయిదు శాతంమంది ముస్లింలేనన్నది మరువకూడదు. భారతరత్న అబుల్ కలాం ఆజాద్ కూడా భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నందుకు నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను 14 ఏళ్ళు జైల్లో పెట్టింది. ఇలాంటి వివరాలు దేశప్రజల్లో చాలామందికి తెలియకపోవచ్చు. తరాలు మారాయి. జీవన శైలి మారింది. వందేళ్ళ క్రితం ఏం జరిగిందో తెలుసుకోవలసిన అవసరం ఏమిటీ? అని కొంతమంది అనుకోవచ్చు. నిజాలు, వాస్తవాలు కావాలనుకున్నవారు తెలుసుకోవాలి. అబద్ధపు బతుకు బతకాలనుకుంటే ఏమీ తెలుసుకోనక్కరలేదు. వివేచనతో వాస్తవాలు గ్రహించాలనుకుంటే మాత్రం ఆనాటి ఆ త్యాగమూర్తులను స్మరించుకోవాలి. లేకపోతే అబద్ధపు కథలు చెప్పి, బూటకపు మాటలతో బురిడి కొట్టించే పార్టీలు, నాయకులు మన చుట్టే ఉన్నారు. ముఖ్యంగా సమకాలీన సమాజంలో ఎల్లవేళలా జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది గనక – తప్పక తెలుసుకుంటూ ఉండాలి.

Also read: డిగ్రీలు లేని ప్రిన్సిపాలూ, మరో పరిశోధకుడు

నిజాయితీ, ఆత్మగౌరవం అంటే ఏమిటో తెలుసుకోవడానికి ఒక చిన్న కథను పరిశీలిద్దాం – ఒక ఎడారి ప్రాంతపు వ్యాపారి తను సుఖంగా ప్రయాణాలు చేయడానికి ఒక ఒంటెను కొనాలనుకున్నాడు. ఒక వ్యక్తి దగ్గర బేరమాడి ఒంటెను కొన్నాడు. ఇంటికి వెళ్ళి ఒంటెను శుభ్రంగా కడగమని పనివాడికి చెప్పాడు. పనివాడు ఒంటెను కడుగుతుంటే దాని వీపుమీది నుండి ఒక చిన్న సంచి కింద పడింది. పనివాడు అది తీసుకువెళ్ళి తన యజమానికి ఇచ్చాడు. యజమాని ఆ చిన్న సంచి విప్పి చూశాడు. ఆశ్చర్యంగా అందులో రత్నాలు ధగధగా మెరిసిపోతూ కనిపించాయి. ‘‘ఇది వెంటనే తీసుకువెళ్ళి మనకు ఒంటెను అమ్మిన వ్యక్తికి ఇచ్చేయాలి’’ అన్నాడు యజమాని.

‘‘హూజూర్ – ఇది ఎవరూ చూడలేదు కదా? మీరు ఉంచేసుకోవచ్చు – ఉంచేసుకోండి’’- అన్నాడు పనివాడు.

‘‘నాకు చెపుతున్నావ్ కానీ, ఆ పని నువ్వెందుకు చేయలేదూ? ఈ సంచి నీకు దొరికినట్టు నాకు తెలియదు కదా?’’- అన్నాడు యజమాని.

‘‘అయ్యబాబోయ్! మీకు అలా ఎలా ద్రోహం చేస్తాను హుజూర్? నేను మీ ఉప్పు తిని బతుకుతున్నవాణ్ణయ్యా!’’-అన్నాడు పనివాడు.

‘‘నువ్వు – నన్నే మోసం చేయలేకపోయావు..బావుంది! కానీ – మరి నేనూ? నన్ను నేను ఎలా మోసగించుకోనూ?’’ అన్నాడు యజమాని.

కొంత అర్థమయ్యూ, కొంత అర్థం కాక తెల్లముఖం వేశాడు పనివాడు.

రత్నాలున్న చిన్న సంచిని తీసుకెళ్ళి వ్యాపారి ఒంటెను అమ్మినవ్యక్తికి అందజేశాడు. అతని ముఖం నవ్వుతో విప్పారింది.

‘‘మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నావి నాకు తిరిగి ఇచ్చేశారు.  ఈ రోజుల్లో మీ లాంటి వారు ఉండడం చాలా అరుదు – సంతోషంగా ఒక మాట చెబుతున్నాను వినండి! ఇందులోంచి మీకు నచ్చిన రత్నాలు తీసుకోండి. నేనిచ్చే బహుమతి అనుకోండి!’’ అన్నాడు ఒంటెను అమ్మిన వ్యక్తి.

‘‘రెండు తీసుకునే మీకు ఇచ్చానండి’’- అని అన్నాడు వ్యాపారి. ఒంటెను అమ్మిన వ్యక్తి అతనివైపు అనుమానంగా చూసి, లెక్కబెట్టుకున్నాడు. అన్నీ సరిగానే ఉన్నాయనుకొని,

‘‘అదేమిటీ? మీరేమీ తీసుకోలేదు కదా? అన్నీ సరిగానే ఉన్నాయి!’’ – అన్నాడు.

‘‘అయ్యా! నేను తీసుకున్నవి నా నిజాయితీ-నా ఆత్మగౌరవం! ఆ రెండు రత్నాలు నా దగ్గరే పెట్టుకుని, మీ రత్నాలు మీకు ఇచ్చేశా’’ అన్నాడు వ్యాపారి. నిజాయితీపరుడి విలువను అర్థం చేసుకోవలసిందే తప్ప, డబ్బుతో, సంపదతో, రత్నాలతో కొలవలేం! ఇలాంటి కథలు మన దేశంలో అధికారంలో ఉన్న అర్సెస్సెస్-బీజేపీకి నచ్చవు. ఎందుకంటే వారికి నిజాయితీ, ఆత్మగౌరవం అక్కరలేదు. వాటికి తీసుకెళ్ళి కొర్పొరేట్లకు అప్పగించి ప్రజల్ని పీడిస్తుంటారు. ఒకప్పుడు ఇదే అరెస్సెస్ ఇదే భారత ప్రభుత్వంతో ఎందుకు నిషేధించబడిందో ఆత్మవిమర్శ చేసుకోరు! బీజేపీ నాయకుల నిజాయితీ ఎలుగెత్తి చెప్పడానికి వారి మంత్రి స్మృతి ఇరానీ బతుకు చిత్రం చూస్తే చాలు!

మోదీ ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రిగా ఉన్న ఒకప్పటి టీ.వీ. నటి స్మృతి ఇరానీ – ఇరాన్ వాణ్ణి ఎలా పెళ్ళి చేసుకుందీ? అని చాలా మందికి అనుమానం వస్తుంది. అయితే, ఆమెను చాలా దగ్గరగా చూసిన మహిళలు కొందరు చెప్పిన విషయమేమంటే – స్మృతికి తిండి లేక బట్టలేక, ఉండటానికి నీడలేక తల్లిడిల్లుతున్న సమయంలో దయతలచి, ఒక మహిళ తీసుకుపోయి ఆశ్రయమిచ్చింది. అంతే! ఆశ్రయమిచ్చిన మహిళ భర్త మీదే స్మృతి కన్నేసింది. అతణ్ణి లోబరుచుకుని పెళ్లిచేసుకోక తప్పని పరిస్థితి కల్పించింది. చివరకు పెండ్లి చేసుకుంది. పోనీ రెండో భార్యగా ఆ ఇంట్లో గౌరవంగా బతకొచ్చుకదా? నీచపు బుద్ధి ఎక్కడ పోతుందీ? ఆశ్రయమిచ్చిన మహిళను, అంటే సవతిని, వీధిపాలు చేసి ఆ భర్తనూ, ఆ ఇంటినీ, ఆ ఆస్థినీ స్వంతం చేసుకుంది. ఆ తర్వాత నటిగా ఎదగడం, పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవడం జరిగింది. ఇక అదంతా వేరే విషయం. నైతికత లేని బతుకులు ఏ స్థాయిలో ఉంటేనేం? విలువ ఉండదు కదా? ఒకప్పటి ఆర్యుల పాలసీ అయినా, ఇప్పటి బీజేపీ పాలనైనా ఇలాగే ఉంటుందన్నమాట!

Also read: వేద గణితం అబద్ధం: సున్నాను కనుగొంది బౌద్ధులే!

హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆరెస్సెస్ ను నిషేధించిన  భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ‘హిందూ రాష్ట్ర’ గురించి ఏమన్నారో చూడండి – ‘‘నా దృష్టిలో భారత దేశం హిందూ దేశంగా మారదు. హిందూ మతమే భారత దేశం కాదు. మైనారిటీలు కూడా మన దేశంలో నివసిస్తున్నారని, వారి భద్రతకు ఏర్పాట్లు చేయడం మన కర్తవ్యమని గుర్తుంచుకోవాలి! ఈ దేశం అందరిది. అది ఏ మతంవారైనా,  ఏ కులంవారైనా అందరూ ఈ దేశ పౌరులే! పాకిస్తాన్ అనుసరిస్తున్న మార్గాన్ని మనం అనుసరించలేం. మన లౌకిక లక్ష్యాలు రక్షించబడాలని-మనం గుర్తుంచుకోవాలి! ఇక్కడ ప్రతిముస్లిం, ప్రతి క్రిస్టియన్ ఇంకా ఇతర మైనార్టీలు తాము ఇక్కడ సురక్షితంగా ఉన్నామని, భారతీయ పౌరులుగా సమాన హక్కులు కలిగి ఉన్నామనీ విశ్వసిస్తున్నారు. ఈ విషయం మనం గుర్తుంచుకోవడంలో విఫలమైతే, దీనికి విస్తృత ప్రచారం ఇవ్వడంలో విఫలమైతే, అది మన వారసత్వానికీ, దేశానికీ ఘోర అవమానం జరిగినట్టే’’- అని అన్నారు సర్దార్ పటేల్. దేశ సమగ్రతకు పాటుపడిన దృఢసంకల్పుడాయన. ‘ఉక్కుమనిషి!! అందువల్ల ప్రస్తుతం బీజేపీతో పారాడవల్సింది అధికారంకోసం కాదు – దేశ సమగ్రతకోసం- అని ప్రధాన విపక్షాలన్నీ ఏకకంఠంతో అంటున్నాయి. ‘‘భారత్ జోడో, నఫ్రత్ ఛోడో’’ (భారత్ ను ఏకం చేయండి, విద్వేషాన్ని విడనాడండి)- అని దేశ ప్రజలంతా అంటున్నారు.

Also read: జీవిత సమస్యల్లోంచి బయట పడడం ఎలా?

(రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త,  జీవశాస్త్రవేత్త. మెల్బోర్న్ నుంచి)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles