అమెరికా కొత్త అధ్యక్షుడుగా జో బైడెన్ సింహాసనాన్ని అధిరోహించడానికి మార్గం సుగమమైంది. అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలిచినట్లు జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన అధికారి ఎమిలీ మర్ఫీ “నిర్ధారణ లేఖ”ను అందజేశారు. ఈ నేపథ్యంలో, అధికార బదిలీకి డోనాల్డ్ ట్రంప్ సమ్మతించడం అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామంగా భావించాలి. ట్రంప్ ఇప్పటి వరకూ తన ఓటమిని అంగీకరించకపోవడం, వైట్ హౌస్ ను వదలడానికి ససేమిరా అనడం, తనకు అనుకూలంగా ఉన్న న్యాయస్థానాల ద్వారా జో బైడెన్ గెలుపును అడుగడుగునా అడ్డుకొనే ప్రయత్నాలు చేయడం మొదలైన విన్యాసాలన్నీ జరిగాయి.
ఏమేమి చేయాలో అవన్నీ చేయండి : ట్రంప్
ఇప్పుడు కూడా ట్రంప్ తన ఓటమిని అంగీకరించడం లేదు.”దేశ ప్రయోజనాల దృష్ట్యా, ఆరంభ లాంఛనాల కోసం ఏమేమి చేయాలో, అవన్నీ చేయాలని మర్ఫీ బృందానికి సిఫార్సు చేస్తున్నా…” అని ట్వీట్ చేశారు. పద్ధతి ప్రకారం ఎన్నికల్లో గెలిచిన అధ్యక్ష అభ్యర్థి జనవరి 20వ తేదీ నాడు అధికారికంగా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ప్రతి నాలుగు సంవత్సరాలకొకసారి జరుగుతాయి. జనవరిలో అధికార మార్పిడి జరుగుతుంది. ఈ లెక్కన వచ్చే సంవత్సరం జనవరి 20తేదీ నాడు అధికారికంగా జో బైడెన్ అమెరికాకు అధ్యక్షుడవుతాడు. ఈలోపు అధికార బదిలీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
జనవరి 20న అధికార మార్పిడికి రంగం సిద్ధం
జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. నిధులు, ప్రభుత్వ భవనాలు, అధికారుల కేటాయింపు, సాంకేతిక పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలను అందుబాటులో ఉంచడం, వేతనాలు చెల్లించడం, ప్రయాణాలకు కావాల్సినవి ఏర్పాటుచేయడం, ఇతర దేశాధినేతలతో మాట్లాడే అనుమతులు ఇవ్వడం మొదలైనవన్నీ జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ చేతిలోనే ఉంటుంది. ఇక, ఈ దిశగా కదలికలు ప్రారంభమయినట్లే. మిషిగన్ తీర్పులోనూ అత్యధిక మెజారిటీతో జో బైడెన్ గెలవడంతో ఇక చేసేది లేక ట్రంప్ మెత్తబడ్డాడు.
మంత్రి మండలి ఏర్పాటుకు కసరత్తు
కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు జో బైడెన్ కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం. ఉపాధ్యక్షురాలుగా కమలా హ్యారిస్ పదవి పక్కా అయిపొయింది. కీలక శాఖలు ఎవరెవరికి కేటాయించాలనే అంశంపై చర్చలు సాగుతున్నాయి. కొందరి పేర్లు కూడా బయటకు వస్తున్నాయి.అందులో ఆర్ధిక శాఖా మంత్రిగా ఆర్ధికవేత్త జానెట్ ఎల్లెన్, విదేశాంగ మంత్రిగా ఆంథోనీ బ్లింకెన్, పర్యావరణ రాయబారిగా జాన్ కెర్రీ మొదలైన పేర్లు బయటకు వచ్చాయి. జో బైడెన్ బృందంలో భారతీయులకు పెద్ద పీట వేసే అవకాశాలు ఉన్నాయి.
భారత సంతతివారికి ప్రాధాన్యం
గతంలో బరాక్ ఒబామా బృందంలోనూ భారతీయులు ఉన్నారు. ఈసారి సంఖ్య పెరిగేట్టుగా ఉందని తెలుస్తోంది. భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఎట్లాగూ అత్యంత ముఖ్యమైన ఉపాధ్యక్ష పదవిలో ఉండబోతున్నారు. ఆన్నీ కలసి వస్తే, రాబోయేకాలంలో అమెరికాకు అధ్యక్షురాలు అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. అధికార మార్పిడి ప్రక్రియకు అడ్డంకులు తొలిగిపోయినా ముందుంది మొసళ్ల పండుగ అని చెప్పాలి. అధికారం చేపట్టబోయేది డెమోక్రాటిక్ పార్టీయే అయినప్పటికీ యూ ఎస్ కాంగ్రెస్ లో రిపబ్లికన్ పార్టీకే మెజారిటీ ఉంది.
డెమొక్రాటిక్ ప్రభుత్వానికి కాంగ్రెస్ లో ప్రతిఘటన
ఈ అవకాశంతో జో బైడెన్ పరిపాలనను రిపబ్లికన్స్ అడుగడుగునా అడ్డుకుంటారు. అక్కడ కూడా మెజారిటీ వస్తే తప్ప, డెమోక్రాటిక్ పార్టీకి ఆట సులువు కాదు.ప్రతి రెండు సంవత్సరాలకొకసారి అమెరికన్ కాంగ్రెస్ కు ఎన్నికలు జరుగుతాయి. ఈసారి ఎన్నికలు 2022లో ఉన్నాయి. అప్పటి దాకా డెమొక్రాట్స్ కు తిప్పలు తప్పవు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న వాతావరణం చూస్తుంటే, ట్రంప్ విధానాల వల్ల రిపబ్లికన్ పార్టీకి అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. ఈ రెండేళ్లలో జో బైడెన్ ఆకట్టుకునేట్లు పరిపాలన కొనసాగిస్తే, రేపు రాబోయే కాంగ్రెస్ ఎన్నికల్లో కూడా డెమోక్రాటిక్ పార్టీకి ప్రభంజనం తేగలడు.
రిపబ్లికన్లతో కలిసి పని చేస్తా : బైడెన్
దేశ ప్రయోజనాల అంశాల్లో రిపబ్లికన్స్ తో కలిసి పనిచేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, జో బైడెన్ గతంలో అనేకసార్లు వ్యాఖ్యానించారు. బరాక్ ఒబామా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు బైడెన్ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. కీలక సందర్భాల్లో రిపబ్లికన్స్ తో మంతనాలు జరిపి చక్రం తిప్పాడు. ఆ నైపుణ్యం జో బైడెన్ కు ఉంది. ఇప్పుడు అధ్యక్షుడుగానూ ఆ పాత మంత్రాలు మళ్ళీ వాడి, మంత్రాంగం నెరిపే అవకాశం ఉంది. 2022లో కాంగ్రెస్ ఎన్నికలు జరిగేంత వరకూ సామ, దాన, భేద, దండోపాయలతో పరిపాలన సజావుగా కొనసాగించుకోవాల్సిన బాధ్యత బైడెన్ పై ఉంది. వచ్చే కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుపు కూడా పెద్ద సవాల్. అక్కడ కూడా గెలుపు సాధిస్తే, డెమోక్రాటిక్ పార్టీకి కొన్నేళ్లపాటు ఎదురే ఉండదు. జో బైడెన్ అధికారంలోకి వస్తే, భారత్ కు ఎంతో మేలు జరుగుతుందనే ప్రచారం ఎక్కువగా ఉంది. దాని వాస్తవ రూపం సమీపకాలంలోనే తెలుస్తుంది. ఒక్కటి మాత్రం నిజం, అమెరికన్లు పూర్తిగా వ్యాపార, వాణిజ్య, ఆర్ధిక స్వార్ధం కలిగినవారు. అది ట్రంప్, బైడెన్, క్లింటన్, బుష్ ఎవరైనా సరే! వారి రక్తం ఒక్కటే. తీరు, శైలి, వాక్కు మాత్రమే భిన్నం అనే స్పృహలో మనం ఉండాలి.