మహిళా రిజర్వేషన్ బిల్లును మంగళవారంనాడు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. పార్లమెంటు కొత్త భవనంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి బిల్లు ఇది కావడం విశేషం.
మహిళల హయాంలో ప్రగతి సాధించాలని ప్రధాని నరేంద్రమోదీ నొక్కి వక్కాణిస్తూ, మహిళల అభివృద్ధి గురించి కేవలం మాటలు చెబుతే సరిపోదనీ, అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలనీ, ఈ దిశగా మహిళల రిజర్వేషన్ బిల్లు సకారాత్మకమైనదని అన్నారు. ఈ బిల్లు పార్లమెంటు సభ్యులకు అగ్నిపరీక్ష వంటిదని మోదీ అభివర్ణించారు. ఈ బిల్లును త్వరలోనే చట్టం చేస్తామని దేశంలోని మహిళలందరికీ హామీ ఇస్తన్నాను అంటూ మోదీ రాజ్యసభలో మాట్లాడారు.
పార్లమెంటులో, అసెంబ్లీలలో 33శాతం స్థానాలను మహిళలకు కేటాయించడానికి ఉద్దేశించిన బిల్లును మంగళవారంనాడు కేంద్ర న్యాయశాఖమంత్రి అర్జున్ రాం మెఘావల్ ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపైన లోక్ సభ బుధవారంనాడూ, రాజ్యసభ గురువారంనాడు చర్చించబోతున్నాయి. అప్పటికే రిజర్వేషన్లు ఉన్న దళితులూ, ఆదివాసీల విషయంలో 33 శాతం ఏ విధంగా అమలు చేస్తారనే తర్జనభర్జన కారణంగా 2010లో బిల్లు ఆగిపోయింది. ఇప్పుడు లోక్ సభలో బీజేపీ స్వయంగా మంచి మెజారిటీ ఉన్నది. రాజ్యసభలోనూ మిత్రపక్షాలతో కలిసి మెజారిటీ ఉన్నది. కనుక బిల్లు చట్టమయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.
బిల్లును ప్రతిపక్షాలు అన్నీ స్వాగతించాయి.అయితే బిల్లును క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని అన్నాయి. బిల్లు కాంగ్రెస్ కూ, ఆమ్ ఆద్మీపార్టీకీ అంతగా నచ్చినట్టు లేదు. వచ్చే ఎన్నికలలో లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే ఇంతవరకూ అటకమీద ఉంచిన బిల్లును అధికార పార్టీ అకస్మాత్తుగా తీసుకొని వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. నిజానికి ఈ బిల్లును 2010లో డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిందనీ, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్ గాంధీ 2019లో ఈ విషయంపైన లేఖ రాశారనీ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసింది. పార్టీ అధినేత సోనియాగాంధీ పార్లమెంటులో ప్రవేశిస్తూ ‘అది తమ బిల్లు’ అంటూ చెప్పుకొచ్చారు.
చదువుకున్నమహిళలకే టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలకూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖడ్గే విజ్ఞప్తి చేశారు. దీంట్లో చరిత్రాత్మకం ఏమున్నదంటూ మాజీ కాంగ్రెస్ నాయకుడు కపిల్ శిబ్బల్ ప్రశ్నించాడు. మోదీ అధికారంలోకి రాగానే 2014లో ఈ బిల్లును ప్రవేశపెట్టవలసి ఉన్నదనీ, ఇన్నాళ్ళూజాప్యం చేసి, ఇప్పుడు చరిత్రాత్మకం అనడం హాస్యాస్పదమని శిబ్బల్ వ్యాఖ్యానించారు.
ఇది ఎన్నికల ఎత్తుగడ అనీ, జుమ్లా అనీ, కోట్లాది మహిళలనూ, యువతులనూ మోసం చేయడమనీ రాజ్యసభ సభ్యుడూ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడూ జైరాంరమేష్ దుయ్యపట్టాడు.
మహిళల ప్రయోజనాల పట్ల ఆసక్తి ఉన్నట్టు బీజేపీనటిస్తున్నదని ఆప్ శాసనసభ్యురాలు, ఢిల్లీ మంత్రి అతిషీ వ్యాఖ్యానించారు. ఇది మహిళలను వంచించడమేనని ఆమె అన్నారు. ఈ బిల్లును పార్లమెంటు ఈ వారంలో ఆమోదించినప్పటికీ అది అమలులోనికి 2029లోపల రాదని ఆమె చెప్పారు. ఇది నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణపైన ఆధారపడి ఉంటుందనీ, అది 2027 జనాభా లెక్కలపైన ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు. అమలు చేసే అవకాశం లేని బిల్లుపైన హడావిడి చేయడంలో బీజేపీ ఉద్దేశం ఎన్నికలలో లబ్ధిపొందాలనే అని ఆమె విమర్శించారు. జనాభా లెక్కలూ, నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణతో నిమిత్తం లేకుండా వెంటనే రిజర్వేషన్లను అమలు చేయాలని అతిషీ డిమాండ్ చేశారు. ప్రభుత్వోద్యోగాలలో సగం మహిళలకుదక్కాలని అతిషీ కోరారు.
బీజేపీ 2014లో తెస్తానన్న బిల్లు ఇప్పుడు తెచ్చిందని సీపీఎం నాయకురాలు బృందాకరత్ వ్యాఖ్యానించారు. వెనుకబడిన తరగతుల, దళితుల, ఆదివాసీల మహిళలకు ఏ విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తారో వివరంగా చెప్పాలని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ 2009లో మహిళల బిల్లును కష్టపడి నాయకులైనవారిపై కుట్రగా అభివర్ణించారు.
ఈ బిల్లు ఒక జిత్తులమారి ఎత్తుగడ అని రాష్ట్రీయజనతా దళ్ నాయకురాలు రబ్డీ దేవి అభివర్ణించారు. బడుగువర్గాలకు చెందిన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు. బిల్లును ఇంకా అధ్యయనం చేయవలసి ఉన్నదని డీఎంకే నాయకుడు తంగపాండియన్ అన్నారు. 1996 నుంచి అటకమీద ఉన్న బిల్లును సభలో ఇప్పటికైనా ప్రవేశపెట్టినందుకు ప్రధానిని అభినందించాలని జేడీ(ఎస్) అధినేత దేవె గౌడ అన్నారు.