• పోలీసు స్టేషన్లలో పెరుగుతున్న టీనేజ్ ల మిస్సింగ్ కేసులు!
• జంటగా వచ్చి షాక్ ఇస్తున్న ఈ నాటి యువత!
• నేరం మాది కాదు, వయసుది!
తెలుగు రాష్ట్రాల్లో చాలా పోలీసు స్టేషన్లలో ‘గర్ల్స్ మిస్డింగ్’ కేసులు నమోదు అవుతున్నాయి. పదహారేళ్ళ అమ్మాయిల నుండి 22 ఏళ్ల అమ్మాయిలు ఇంట్లో నుంచి వెళ్లి పోతున్నారనే సమాచారం పేరెంట్స్ కు, పోలీసులకు కునుకు లేకుండా చేస్తోంది. పోలీసులు ఆ అమ్మాయిలకు ఇచ్చే ఫోన్ ల ఆధారంగా దుర్భిణి వేసి చూస్తే ఎవరు ఒకరు భాయ్ ఫ్రెండ్ తో తెలుగు రాష్ట్రాల్లోని ఏ మూలనో దొరకడంతో తల్లి దండ్రులు లబోదిబో మంటున్నారు. పోలీసులు పేరెంట్స్ ముందు వారి పిల్లలకు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నప్పుడు విస్తు పోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వారు ఎంచుకున్న జంట విద్యాధికులు అయి ఉండడం లేదు…ఆస్తి పాస్తులు పెద్దగా ఉన్నవారు కావడం లేదు. మంచి ఉద్యోగంలో ఉన్నవారు కూడా కాదు… కేవలం వ్యామోహంతో అబ్బాయిలతో/ అమ్మాయిలతో వెళ్లి జీవితాలను ప్రేమ పేరుతో బలి చేసుకుంటున్నారు. కొంత మంది తల్లి దండ్రులు పిల్లలు పరువు తీసే పనులు చేస్తున్నారని పరువు హత్యలకు పాల్పడుతున్నారు.
నిండు ప్రాణం తీసుకున్న యువతి:
ఈ మధ్య రాంపల్లి లో ఒక అమ్మాయి తన భాయ్ ఫ్రెండ్ లతో వెళ్లి ఆటో వారు కిడ్నాప్ చేసినట్టు నాటకం ఆడి పోలీసులను హైరానా పట్టించి చివరకు నిజం ప్రేమ వ్యవహారం తెలిసి తల్లి దండ్రుల పరువు తీసినట్టు భావించి నిండు ప్రాణం తీసుకుంది. సోషల్ మీడియా వికృతపు పోకడలను నిందించినా కన్నతల్లిదండ్రులకు మిగిలింది గర్భశోకమే. విఫలమైన ప్రేమ వ్యవహారం విలుల ఎంత? నిండు ప్రాణం డబ్బుకు దొరుకుతుందా? కూతురు పై అతి ప్రేమ పెంచుకున్న మారుతిరావు కథ ఏమైంది? అటు భర్తను చంపించిన తండ్రి పై ద్వేషభావం పెంచుకున్న కూతురు ముఖం చూడలేక పోయిన మారుతీ రావు చివరకు ఆత్మ హత్య కు పాల్పడడం వల్ల మొత్తం కుటుంబం విషాదసముద్రంలో మునిగిపోయింది. అమృత రావు కూతురు అమృతకు అటు భర్త, ఇటు తండ్రి దూరమై పసికందులో భర్తను చూసుకునే ప్రేమ మిగిలింది.
Also Read: బంధువులు… బహుముఖాలు!
గాయం నయం అవుతుంది, మచ్చలు మిగులుతాయి:
విఫలమైన ప్రేమ వ్యవహారం, అందులో సంబంధం కలిగిన వ్యక్తుల మరణానికి కారణాలు, దానికి దారితీసిన సంఘటనలు తీవ్ర బాధాకరమైనవి. గాయం కాలక్రమేణా నయం అవుతుంది, కానీ అది వదిలివేసిన మచ్చలు మాత్రం జీవితాంతం ఉంటాయి. ఆకర్షణ అనే ప్రేమ ఎన్నో నిండు జీవితాలను అంతం చేస్తోంది… చాలా ప్రేమ కథలు విషాదంగా ముగుస్తున్నాయి…టీనేజ్ లో కొత్త పరిచయాలు కలల ప్రపంచంలో విహరించేలా చేస్తున్నాయి. టెన్త్ అయిపోగానే ఇంటర్ లో చేర్చి తమ కూతురు గొప్ప సరస్వతీ పుత్రిక అవ్వాలని ఆశించే తల్లిదండ్రులకు ఎవరి చేతిలోనో మోసపోయిన కూతురు చరిత్ర బయట పడగానే పదహారేళ్ళ తమ పెంపకం ఎందుకు కొరగాకుండా పోయిందని ఆవేదనతో తల్లి దండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అబ్బాయి అయితే తమ కొడుకు తమ అంతస్తు గల అమ్మాయిని తేలేదనే కక్ష తో ఆమెను వేధించడం వల్ల కూడా ఆడపిల్ల ప్రాణం ఆహుతి అయిపోతుంది. ఈ ప్రేమ వ్యవహారాలు పరువు హత్యలు, లేదా మోస పూరిత ప్రేమలు, మోజు తీరే ప్రేమలతో అమ్మాయిల జీవితాలు బుగ్గి పాలవుతున్నాయి.
ప్రేమ స్వచ్ఛమైనది, ప్రేమ బాధాకరమైనది, ప్రేమ మధురమైనది, ప్రేమ భయంకరమైనది. నిజమైన ప్రేమలు అధికంగా ఉంటాయా? అసలు ప్రేమ ఆకర్షణగా మారడానికి కారణాలేవీ అనే విషయాలు పరస్పర నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. ప్రేమ విఫలమా? సఫలమా? అనేది వ్యక్తుల మానసిక సంఘర్షణను బట్టి ఉంటుంది. మనశ్శాంతి కరువు “మీకు ఎప్పుడూ బాధ కలిగించకపోతే, ప్రేమలో మీరు చాలా అదృష్టవంతులు లేదా విఫలమైతే ఒంటరిగా ఉన్నారన్నమాట. అంటే చుట్టూ ఎంత మంది మనుషులు ఉన్నా ప్రేమలో మీరు విజయం సాధించకుండా ఏకాంతంగా ఒంటరి అయిపోయినట్టే! పక్షుల్లో… జంతువుల్లో కూడా ప్రేమ ఉంటుంది…అవి కోరుకునే నిబంధనల ప్రకారం కలిసే విహరిస్తాయి! కానీ మనసు ఉన్న మనిషి ప్రేమలూ, సరికొత్త ప్రేమ పక్షుల కోసం వెతకడం వల్ల జీవితాల్లో మనసు శాంతి లేకుండా పోతుంది. ప్రేమించినవాడిని వద్దని తల్లి దండ్రులు ఒత్తిడి చేయడం వల్లో, లేదా కులాంతర, మతంతరా ప్రేమలు ఫలప్రదం కాకపోవడం వల్లనో భగ్న ప్రేమికులు అవుతున్నారు… ప్రేమలో పడ్డ ఆడపిల్లలు మనసు చంపుకుని వేరే వారిని మనవాడుతుంటే…ప్రేమ దక్కలేని అబ్బాయిలు బలవంతం మరణాలకు పాల్పడుతున్నారు. ఒకరిపై ప్రేమ కలగడానికి కేవలం నాలుగు నిమిషాలు పడుతుందట. ఆయన/ ఆమె నడవడిక, మాట్లాడే పద్ధతి, హుందాతనం, కళ్ళల్లో కాంతి ఇవే వాళ్ళు చూస్తుంటారు.
Also Read: తత్వం అర్థం కాకే యువత బలవన్మరణం
కత్తుల వంతెన:
తరువాత క్యారెక్టరైజేషన్ లో మిళితం అవుతున్నప్పుడే అభిప్రాయ భేదాలు వస్తాయి..కొంత మంది సర్దుకు పోతారు. నచ్చినవారు దొరకలేదనే బాధ ఉన్నప్పటికీ మనసు చంపుకొని కాపురం చేస్తారు. శృంగార సంబంధ ప్రేమ కలకలం కత్తుల వంతెన. మనసు సంబంధమైన ప్రేమ పది కాలాలు పదిలంగా ఉంటుంది. ఒక మానసిక అధ్యయనం ప్రకారం ప్రేమలో పడటం కొకైన్ తీసుకోవడం లాంటిది. ఎందుకంటే రెండు అనుభవాలు మెదడును అదేవిధంగా ప్రభావితం చేస్తాయి… ఇదే విధమైన ఆనందం కలిగిస్తుంది. ప్రేమలో పడటం వల్ల మెదడులోని 12 ప్రాంతాలను ఒకేసారి ఉత్తేజపరిచే అనేక ఆనందం కలిగించే రసాయనాలు ఉత్పత్తి అవుతాయని పరిశోధనలో తేలింది.
సుఖాంతం లేదా విషాదాంతం:
పరస్పర స్పర్శ తో మొదలయ్యే ప్రేమ విడదీయరాని బంధంగా మారితే ప్రేమ సుఖాంతం. లేదా విషాదాంతం. ప్రేమ బలీయమైందా కాదా అనేది మనిషిలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ల వల్లే తేలుతుంది. ఆ పేరే ఆక్సిటోసిన్. దానివల్ల స్పర్శ జ్ఞానం పెరిగి ఈ హార్మోన్ మెదడు, అండాశయాల వరకు ప్రాకి బంధం అనుబంధం అవుతుంది. ఆక్సిటోసిన్ గతి తప్పితే ప్రేమలు కోర్టు మెట్లు ఎక్కుతాయి. లేదా పోలీస్ స్టేషన్లో దోషిగా నిలబడే స్థితికి తెస్తాయి. ఈ రెండు కాక పరువు హత్యలు… లేదా గుండె పగిలి హఠాన్మరణం పొందవద్దంటే…అబ్బాయిలు అమ్మాయిల కదలికలపై పేరెంట్స్ కన్నేసి ఉంచాలి.
ఒక బైక్ లేదా కారు కొనిచ్చేప్పుడు లేదా అమ్మాయికి స్కూటీ కొనిచ్చినప్పుడు ఉండే ఆనందం కాలేజీ టైం అయిపోగానే ఇంటికి వస్తుందా? లేదా నోటివెంట అబద్ధాలు వస్తున్నాయా? అమ్మాయి/ అబ్బాయి ఫ్రెండ్ ఎవరు? వారి పేరెంట్స్ గురించి ఆరా తీయాలి..అప్పుడప్పుడు కాలేజికి వెళ్లి ఆకస్మిక తనిఖీ లు చేయాలి.
Also Read: సోషల్ మీడియా సామాజిక విప్లవమా?సమస్యల సమాహారమా?
అటండెన్స్ చూడాలి, లెక్చరర్లతో మాట్లాడాలి:
హాజరు పట్టిలో అటెండెన్స్ చూడాలి… లెక్చరర్ల తో వారి బిహేవియర్ అడిగి తెలుసుకోవాలి… ఒక వేళ వ్యతిరేక రొపోర్టు వస్తే మందలించకుండా చక్కటి కౌన్సిలింగ్ చేయాలి…అప్పుడు పెంపకానికి సార్థకత వస్తుంది..
లేదా తెల్లవారు జామున మీ ఇంటికి పొలీసుల నుండి ఫోన్ రావచ్చు. అమ్మాయి/ అబ్బాయి తప్పతాగి అర్ధరాత్రి పబ్బుల్లో గంతులేసి పోలీసులకు దొరికి పోయిన తల్లి దండ్రుల ముందు తల దించుకునేలా చేసుకునే స్థితికి తమ పిల్లలు చేరుకోకుండా చూడవలసిన బాధ్యత నేటి తల్లిదండ్రులపైన ఎంతో ఉంది!