పానుగంటి ప్రతిభ అనన్యం. ప్రజ్ఞ ఐహుముఖీనం. నాటకకర్తగా, వ్యాసరచయితగా ఆయన పేరు సుస్థిరం. ప్రక్రియ ఏదైనా ఆయన రచనలకు హాస్యం ఆలంబనం. పదాలు గుప్పించడంలోనూ, ఒకమాటకు పది మాటలు వాడి వ్యంగ్యాన్ని, వర్ణనను, హాస్యాన్ని రంగరించడంలోనూ ఆయనకు ఆయనే సాటి. సాక్షి వ్యాసాల శైలి వరద గోదావరిలాగా ఝరీవేగంతో పరుగులెట్టేది. కొందరు ఆయనను “ఆంధ్రా అడిసన్” అంటారు. మరికొందరు ఆయనను “ఆంధ్రా షేక్స్పియర్” అంటారు. గ్రాంథిక భాషలో సామాజిక రుగ్మతలను ఎండగడుతూ ఆయన రాసిన ‘సాక్షి వ్యాసాలు’ తెలుగు సాహితీ వినీలాకాశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కున్నాయి. ఆయన రాసిన నాటకాలు కూడా ఆనాటి సాహితీ అభిమానుల ఆదరణను పొందాయి. ” పానుగంటి సాక్షి వ్యాసాలు చదవడం మాననంటి.. ఎంచేతనంటే వాటిలో పేనులాంటి భావానికాయన ఏనుగంటి రూపాన్నియ్యడం నేనుగంటి” అని శ్రీశ్రీ సైతం కొనియాడిన మేటి సాహితీ శిఖరం పానుగంటి.
అభినవ కాళిదాసు, కవిశేఖరుడు
పానుగంటి లక్ష్మీ నరసింహారావు తెలుగు సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావును పాఠకలోకం ‘కవిశేఖరుడ’నీ, ‘అభినవ కాళిదాసు’ అనీ బిరుదులతో అభినందించింది. నవంబరు 2, 1865వ తేదీన రాజమహేంద్రవరం తాలూకా సీతానగరంలో రత్నమాంబ, వెంకట రమణయ్య దంపతులకు జన్మించారు.1884లో మెట్రిక్యులేషన్, 1886లో ఇంటర్, 1888లో బి.ఎ. పరీక్షలలో ఉత్తీర్ణులైనారు. పెద్దాపురం హైస్కూలులో ఉపాధ్యాయుడిగా చేరిన పానుగంటి, ఆ రోజుల నుండే తన రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు. అయితే ఉపాధ్యాయుడిగా తన సంపాదన చాలకపోవడంతో తొలుత లక్ష్మీనరసాపురం సంస్థానంలో దివానుగా చేరారు. ఆ తర్వాత ఉర్లాం, అనెగొంది, పిఠాపురం మొదలైన సంస్థానాల్లో కూడా పనిచేశారు. ఆయన లక్ష్మీ పురం జమిందారిణి రావు చెల్లయమ్మ గారి దివానుగా చేరారు. ఆరు సంవత్సరాల తర్వాత అభిప్రాయ భేదాల మూలంగా ఉద్యోగం మాని వేశారు. తరువాత ఉర్లాము సంస్థానం లోను, బళ్ళారి జిల్లాలోని ఆనెగొంది సంస్థానంలోను దివానుగా కొంతకాలం పనిచేశారు. పిఠాపురం మహారాజా శ్రీ సూర్యారావు బహదూరు పానుగంటి రచనల గురించి వినగా, రాజాకు మైనారిటీ తీరగా రాజ్యాధికారం చేపట్టిన తర్వాత పంతులుగారిని 1915-16 మధ్య ‘నాటక కవి’గా తమ ఆస్థానంలో నియమించారు. ఆయన కోరికపై అనేక నాటకాలు వ్రాసారు. వాటి నన్నింటిని మహారాజుగారే అచ్చు వేయించారు.
సామాజిక రుగ్మతలను ఎండగట్టడం ఉద్దేశం
పానుగంటి వారి రచనలల్లో ప్రముఖమైనవి ‘సాక్షి వ్యాసాలు.’ ‘సువర్ణముఖి,’ ‘ఆంధ్రపత్రిక’ లలో 1913 నుండి 1933 మధ్యకాలంలో ప్రచురించ బడ్డాయి. వ్యాసాలన్నీ అచ్చమైన గ్రాంథిక భాషలో ఉన్నా, వ్యవహారానికి దగ్గరగా ఉండే శైలితో రాయడం రచయిత ప్రత్యేకత. వినోద ప్రధానశైలిలో రాస్తూ.. ఆనాటి సామాజిక రుగ్మతలను ఎండగట్టడం ఈ వ్యాసాల ప్రధాన ఉద్దేశం. 1711 – 12 లో స్పెక్టేటర్ అనే ఆంగ్ల పత్రికలో జోసెఫ్ అడిసన్, రిచర్డ్ స్టీల్ వ్రాసిన స్పెక్టేటర్ పేపర్స్ వ్యాసాలతో ప్రేరణ పొందిన పానుగంటి ఈ వ్యాసాలను రాశారంటారు. ఈ వ్యాసాలలో కాలాచార్యుడు, జంఘాల శాస్త్రి, వాణీదాసు, బొర్రయ్య శెట్టి అనే పాత్రల ద్వారా సామాజిక విషయాలపై చర్చలను పెడతారు రచయిత. వారి సంభాషణల ద్వారా పాఠకుడికి అందాల్సిన సందేశాన్ని అందిస్తారు. “సాక్షి వ్యాసాలు” పుస్తకంగా వచ్చాక, అనతికాలంలోనే పానుగంటి వారి పేరు ఆంధ్రదేశంలో మారుమ్రోగి పోయింది. ఆ వ్యాసాలు విశేష పాఠకాదరణ పొందాయి.
పిఠాపురం జమీందారు ప్రోత్సాహంతో అనేక రచనలు
‘సాక్షి వ్యాసాలు’ రాసిన తర్వాత పిఠాపురం జమీందారు ప్రేరణతో ఇంకా అనేక రచనలు చేశారు పానుగంటి. సారంగధర చరిత్ర, వృద్ధ వివాహము, రాధాకృష్ణ, నర్మదా పురుకుత్సీయము, సరస్వతి, దుష్టప్రధాని, ఆనందనాథ, కల్యాణ రాఘవము, కంఠాభరణము, విజయ రాఘవము, కోకిల, విప్రనారాయణ చరిత్ర, బుద్ధబోధసుధ, వీరమతి, పూర్ణిమ అందులో ప్రముఖమైనవి. ఆయన రాసిన నాటకాలే పానుగంటి వారి అభినవ కాళిదాసు బిరుదును పొందేలా చేశాయి. తన రచనల వలన తొలినాళ్లలో ఆయన విశేషంగా ధనమార్జించినా, అవసాన దశలో పేదరికానికి, ఋణబాధకు గురవడం గమనార్హం. సంస్థానం అందించే గౌరవ వేతనంపైనే ఆయన ఆధారపడాల్సి వచ్చింది. “నాకెవరును దానధర్మము చేయనక్కరలేదు. తగ్గింపు ధరలకు నూటయాభై సెట్ల పుస్తకాలు యాభై మంది కొని, నా మానుషమును కాపాడినను, నాకు సివిలు ఖైదు తప్పును” అని తన చివరిదశలో ఆ మహా రచయిత వాపోయాడంటేనే అతని పరిస్థితి అప్పుడు ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత అనారోగ్యం కూడా అతన్ని బాగా కుంగదీసింది. తెలుగు పాఠకులపై చెరగని ముద్ర వేసిన సాక్షి వ్యాసాలను ఆ రోజుల్లో కుర్రకారుతో సహా ఎందరో ఎంతో ఆసక్తిగా చదివేవారు.
సాంఘిక దురాచారాలపైన జంఘాలశాస్త్రి ద్వారా దాడి
ఆ రోజుల్లో అవి కలిగించిన సంచలనం అంతా యింతా కాదు. “జంఘాలశాస్త్రి” అనే పాత్ర ముఖతః పానుగంటివారు సమకాలిక సాంఘిక దురాచారాలమీద, మూఢ విశ్వాసాలమీద పదునైన విమర్శలు చేసేవారు అని నండూరి రామమోహనరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. మృదుమధుర నవార్ధభాసుర వచనరచనా విశారదులైన” మహాకవి ఆధునిక కాలమున ఎవరు అని ప్రశ్నించినచో నా ప్రత్యుత్తరము “పానుగంటి లక్ష్మీనరసింహారావు”గారని. .. నిబ్బరమైన పానుగంటి వచనమునకబ్బురపడని గద్యప్రేమికులుండరని, నాటకములలో కన్యాశుల్కము ఎట్టిదో గద్య రచనములలో సాక్షి అటువంటిదని మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి పేర్కొన్నారు.
ఆయన తెలుగు సాహితీ లోకాన్ని విడిచి తిరిగి రాని లోకాలకు పానుగంటి వారు వెళ్లినా, సాక్షి వ్యాసాలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా ఉండి పోయాయి. ఇప్పటికీ తెలుగు విద్యార్థుల పాఠ్యాంశాలలో ఈ వ్యాసాలను ప్రచురించడం ఆయనకు దక్కిన గొప్ప గౌరవమే. సుమారు ఇరవై సంవత్సరాలు ఆయన జీవితం సుఖంగా జరిగింది. ఆ రోజుల్లో దివాణం తరువాత వ్యయానికి వీరి గృహమే అనేవారు. ఆధునిక శ్రీనాధునిగా జీవించారు. ఉద్యోగాల వలన, రచనల వలన విశేషంగా డబ్బు గడించినా దానిని నిలువ చేయడంలో శ్రద్ధ కనపరచలేదు.
చరమాంకంలో పేదరికం
ఆధునిక శ్రీనాధుని వలెనే అనుభవించి నన్నాళ్ళూ బాగా అనుభవించి, తుది రోజులలో పేదరికానికి ఋణబాధకు లోనయ్యారు. మహారాజావారు బాగా పోషించినా, పంతులుగారికి తుదిదశలో వైషమ్యాలేర్పడి, తమదగ్గర ఏనాడో చేసిన రుణం కొరకు వారికి ఇచ్చే నూట పదహారు రూపాయల గౌరవ వేతనం వేతనంలో కొంతభాగం తగ్గించ డానికి ఉత్తర్వులు జారీ చేశారు. వృద్ధాప్యంలో వీరు అటు ఇటు తిరిగి సంపాదించ లేకపోయారు. చేతికి అందివచ్చిన కుమారులు ఉన్నా వారిని ఉద్యోగాలకు పంపలేకపోయారు. పానుగంటి కవి శేఖరుని దుస్థితి గురించి ఆయన వ్రాసిన లేఖను ఆంధ్రపత్రికలో యర్రవల్లి లక్ష్మీనారాయణ ప్రచురించాడు … “నాకెవరును దానధర్మము చేయనక్కరలేదు. తగ్గింపు ధరలకు నూటయాభై సెట్ల పుస్తకాలు యాభై మంది కొని, నా మానుషమును కాపాడినను, నాకు సివిలు ఖైదు తప్పును”. 1933 నుండి శారీరకంగా, మానసికంగా ఆయన ఆరోగ్యం చెడిపోయింది. 1935 లో పిఠాపురంలో ఉత్సవాలు నిర్వహించి పురజనులు ఘనంగా సన్మానించారు. ఈ ఉత్సవానికి చిలకమర్తి లక్ష్మీనరసింహం అధ్యక్షత వహించారు. పరిస్థితులు మారి, తీవ్ర మనస్తాపంతో ఈయన అక్టోబరు 7న, 1940లో మరణించాడు.
(సోమవారం, నవంబర్ 2వ తేదీ, ‘ఆంధ్రా షేక్స్పియర్’ జయంతి)