Thursday, November 21, 2024

పళనిస్వామిదే ఏఐఏడిఎంకె, పన్నీర్ సెల్వం గెంటివేత

  • తమిళనాట నాటకీయమైన పరిణామాలు
  • జయలలితే శాశ్వత ప్రధాన కార్యదర్శి కాదని తేల్చిన పళని
  • రెండు వర్గాల మధ్య కొట్లాట అనూహ్యం
  • స్టాలిన్ కు సానుకూలమైన ప్రతిపక్ష చీలిక

అన్నాదురై తరం అంతరించిన తర్వాత తమిళతంబిల రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంది. అన్నాదురై తర్వాత కరుణానిధి ముఖ్యమంత్రి పదవి స్వీకరించడం, ఎంజి రామచంద్రన్ విభేదించడం, విడిగా అన్నా డిఎంకె  పార్టీని నెలకొల్పడం, తర్వాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం, అనంతరం జయలలిత పార్టీ పగ్గాలు స్వీకరించడం, ముఖ్యమంత్రి పదవి ఆమెను వరించడం, నిండుసభలో ఆమె చీరలాగి డిఎంకె సభ్యులు అవమానానికి గురి చేయడం, అందుకు ప్రతిగా తాను ముఖ్యమంత్రిగా ఉండగా కరుణానిధిని అరెస్టు చేసి లాక్కొని పోవడం, జయలలిత మరణం అనుమానాస్పదం కావడం, ఆమె సన్నిహఇతురాలు శశికళను అనుమానించడం, ఆమెకు నాలుగేళ్ళు జైలుశిక్ష పడి బెంగళూరు అగ్రహారం జైలులో ఉండవలసి రావడం, దాంతో దినకరణ్ ఆట కట్టించడానికి పన్నీర్ సెల్వం, పళనిస్వామి చేతులు కలపడం, అధికారంలో ఉపముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా కొనసాగడం, అధికారం పోయిన తర్వాత రెండు ముఠాలు రాళ్ళు విసురుకోవడం, పార్టీకి జయలలితే ప్రధాన కార్యదర్శిగా ఉంటారన్న మాట విస్మరించి పళనిస్వామి ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం, పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించడం – అన్నీ నాటకీయంగా జరిగిన పరిణామాలే. తాజా పరిణామాలు ముఖ్యమంత్రి స్టాలిన్ కూ, ఆయన నాయకత్వంలోని డిఎంకెకూ సానుకూలమని వేరే ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.

మాజీ ముఖ్యమంత్రి ఎడప్పడి కె. పళనిస్వామికీ, మాజీ ఉపముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంకీ మధ్య ఘర్షణ అనివార్యమని కొంత కాలంగా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఏఐడిఎంకెలో ఏక నాయకత్వం కాకుండా ద్వంద్వనాయకత్వం ఉండాలనే చర్చ ప్రారంభమైననాటి నుంచీ పళనిస్వామి పన్నీర్ సెల్వం ఫ్యూజ్ పీకేస్తారని అందరూ అనుకుంటున్నదే. పళనిస్వామికే పార్టీలు ఆధిక్యం ఉన్న సంగతి కూడా రహస్యమేమీ కాదు. అందరికీ ఆశ్చర్యం కలిగించిందేమంటే జులై 11న చెన్నై సమీపంలోని వరగరంలో పార్టీ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగిన సందర్భంలో నగర మధ్యంలో రాయపేటలో ఏఐఏడిఎంకె కేంద్ర కార్యాలయంలో రెండు వర్గాల మధ్య పోరాటం జరగడం. ఈ కొట్లాట చూసి తమిళనాడు రెవెన్యూ డిపార్ట్ మెంటు అధికారులు పార్టీ కేంద్ర కార్యాలయానికి తాళం కప్ప తగిలించారు.

పళని, పన్నీర్ మద్య స్నేహం వెనుక అసలు రహస్యం

పళనిస్వామికీ, పన్నీర్ సెల్వంకీ మధ్య దోస్తానా అవకాశవాదమైనది. శశికళను పార్టీకి దూరంగా ఉంచే ఉద్దేశంతో, ఆమె మేనల్లుడు దినకరన్ ఆట కట్టించాలనే సంకల్పంతో పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు చేతులు కలిపారు. పన్నీర్ సెల్వం కంటే పళనిస్వామి సమర్థుడనీ, పార్టీలో బలం ఉన్నవాడనీ జయలలితకు సైతం తెలుసు. అందుకే ఆమె న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్నప్పుడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా పన్నీరె సెల్వంను నియమించారు కానీ పళనిస్వామిని కాదు. పళనిస్వామి ఎప్పటికైనా ఏకు మేకవుతాడనే అంచనా జయలలితకు ఉంది. జయలలిత మరణం తర్వాత పరిస్థితులలో పళనిస్వామిది పైచేయి అయింది. ఇద్దరూ కలసి పార్టీని ఐకమత్యంగా ఉంచారు. పదవులు పంచుకున్నారు. 2017 సెప్టెంబర్ నుంచి ఇద్దరూ కలిసి శశికళనూ, దినకరణ్ నూ దూరంగా పెట్టారు. 2021 మేలో గడువు పూర్తయ్యే వరకూ ప్రభుత్వం కొనసాగినంతకాలం రెండు వర్గాలూ కలసికట్టుగానే ఉన్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా పన్నీర్ సెల్వం తన విధులను సక్రమంగానే నిర్వహించారు.  అధికారం నుంచి బయటపడిన తర్వాత విభేదాలు మొదలయ్యాయి. పళనిస్వామితో స్నేహంగా ఉండాలనీ,  తన వర్గాన్ని పళనిస్వామి వర్గంతో విలీనం చేసి సమైక్యంగా కొనసాగాలని ప్రధాని నరేంద్రమోదీ తనకు చెప్పినట్టు పన్నీర్ సెల్వం చెబుతూ ఉండేవారు. మొన్నకూడా ఈ విషయం గుర్తు చేశారు.

పళనిస్వామిదే పైచేయి

ఎన్నికల ముందు లుకలుకలు మొదలైనాయి. 2020లో తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల ముందు ప్రకటించాలని పళనిస్వామి పట్టుపట్టడం, దాన్ని పన్నీర్ సెల్వం ప్రతిఘటించడంతో ఏఐఏడిఎంకెలో వాతావరణం వేడెక్కింది. ఎన్నికల తర్వాతనే పళనిస్వామిని ఏఐఏడిఎంకె లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించారు. ఇది జరిగిన నెలరోజులకు లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకుడిగా పన్నీర్ సెల్వం పేరు ప్రకటించారు. మొన్న మే నెలలో రెండు రాజ్యసభ స్థానాలకి అభ్యర్థులను ప్రకటించినప్పుడు సైతం ఇద్దరి మధ్యా ఏకాభిప్రాయం లేదు. పార్టీ కౌన్సిల్ సభలు జూన్ 23న, జులై 11న జరిగాయి. అంతకు ముందు న్యాయస్థానంలో పోరాటం జరిగింది. పార్టీ నాయకుడిగా పళనిస్వామిని గుర్తించరాదంటూ పన్నీర్ సెల్వం చేసిన అభ్యర్థనను మద్రాసు హైకోర్టు తిరస్కరించింది. పళనిస్వామి జులై 11 సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు. పన్నీర్ సెల్వంనూ, అతని అనుచరులనూ పార్టీ నుంచి బహిష్కరించారు. పన్నీర్ సెల్వం కుమారుడు రవీంద్రనాథ్ పార్లమెంటు సభ్యుడు. తండ్రీకోడుకుల రాజకీయం ఎట్లా ఉంటుందో, దాన్ని పళనిస్వామి ఎట్లా ప్రతిఘటిస్తారో అన్నది భవిష్యత్తుగా గమనించదగిన పరిణామాలు. 2024 లోక్ సభ ఎన్నికలలో పళనిస్వామి ఎన్ని స్థానాలు గెలుచుకుంటారో, పన్నీర్ సెల్వం ఎటువంటి ఫలితాలు సాధిస్తారో చూడాలి. ఎవరేమి చేసినా స్టాలిన్ పని తేలికైంది. ప్రతిపక్షం చేలిక అధికార పక్షానికి ఎప్పుడైనా ఆనందదాయకమే, లాభదాయకమే. స్టాలిన్ నిరుడు మేలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత హుందాగా వ్యవహరిస్తూ, ప్రతిపక్షాలను గౌరవిస్తూ, సిటీ బస్సులలో తిరుగుతూ, సాధారణ ప్రజలతో బాతాఖానీ చేస్తూ పరపతిని బాగా పెంచుకున్నారు. ఆయన మరింత ఎత్తు పెరిగారు. కాంగ్రెస్  కూడా డిఎంకెతో సహజీవనం చేస్తున్న కారణంగా ప్రతిపక్షంలో ఒకటి, రెండు స్థానాలకు పళనిస్వామి, పన్నీర్ సెల్వం పోటీ పడవలసి ఉంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles