- శత్రుత్వం పాలకులతోనే కానీ ప్రజలతో కాదు
- తప్పులు నిజాయితీగా ఒప్పుకుంటే మంచిదేగా
- గతం మరచి ఆపన్నహస్తం అందించడం భారత సంస్కారం
ఒళ్ళంతా వరుస దెబ్బలు తిన్నాక తత్త్వం బోధపడినట్లు పొరుగు దేశం పాకిస్తాన్ శాంతిమంత్రం వినిపిస్తోంది. భారతదేశంతో కలహాలు మాని శాంతితో సహజీవనం సాగించాలని కోరుకుంటున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తో తక్షణమే చర్చలు జరుపడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అంటున్నారు. ఈ మాటలు మనసులో నుంచి వచ్చాయని అనుకోలేం. అవసరార్ధం మారిన స్వరంగానే భావించాలి. మన దేశంపై అనేకసార్లు యుద్ధానికి దిగి, మన భూభాగాన్ని ఆక్రమించుకొని, సరిహద్దుల్లో నిత్యం అలజడులు సృష్టిస్తూ, ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ, అమాయకులను ఊచకోత కోయిస్తూ ఇప్పుడు సంధికి సిద్ధమవుతున్న వైనం అనుమానాస్పదమే. మనల్ని శత్రుదేశంగా భావించి అంతర్జాతీయ సమాజాల్లో అడుగడుగునా మనల్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. నేడు తానే దోషిగా ప్రపంచదేశాల ముందు తలవంచుకొని నిల్చుంది. లోకంలో ఉగ్రవాద దేశంగా అపకీర్తిని ఏనాడో మూటగట్టుకుంది. పెంచి పోషించిన తాలిబాన్ కూడా ఎదురు తిరిగారు. పాకిస్తాన్ భూభాగాన్నే ఆక్రమించుకోడానికి సిద్ధమయ్యారు. దేశం అప్పుల ఊబిలోకి వెళ్లిపోయింది. ప్రజలు కష్టాల కడలిలో మునిగిపోయారు. ఆ దేశంలోని అంతర్గత వ్యవస్థల మధ్యనే సఖ్యత లేదు. ఇది తరతరాలుగా సాగుతున్న సంప్రదాయం. శ్రీలంక కూడా అదే పడవలో నడిచింది. ఈ రెండు దేశాలు చైనాను నమ్మాయి.
Also read: పేద ఇంట్లో ప్రమిద వెలిగిస్తుందా నిర్మలమ్మ?
అక్రమార్కులు పాలకులే, ప్రజలు కాదు
నేడు పూర్తిగా మునిగిపోయాయి. తమ స్వార్థం కోసం పాలకులు చైనాతో చేతులు కలిపి భారత్ ను ఇబ్బంది పెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. నేడు చావు దెబ్బలు తిన్నారు. దేశ ప్రజలే నేడు ఎదురుతిరుగుతున్నారు. మొత్తంగా పాలకుల అక్రమపర్వంలో అన్నీ చేదు అనుభవాలే మూట గట్టుకున్నారు. వరుసగా ప్రధానమంత్రులు మారిపోతున్నారు. కానీ వారి వైనం ఏమాత్రం మారలేదు. మారినట్లు కనిపించే చిత్రాన్ని చూపించే కొత్త ఆట మొదలు పెట్టారు. ఆర్ధిక సంక్షోభంతో తల్లడిల్లుతున్న వేళ తమకు సాయం చెయ్యండంటూ ప్రపంచ దేశాలను పాకిస్తాన్ వేడుకుంటోంది. ఈ తరుణంలో భారత్ సహాయాన్ని కూడా పూర్తిగా అర్థిస్తోంది. గతంలో మూడుసార్లు భారత్ పై యుద్ధం చేసి గుణపాఠాలు నేర్చుకున్నామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంటున్నారు. కశ్మీర్ అంశంలో ఉన్న తగాదాలను నిజాయితీ, నిబద్ధతతో చర్చలు జరిపి పరిష్కరించుకుంటామని ఆయన చెబుతున్నారు. ఇన్నాళ్లు నిజాయితీగా, నిబద్ధతగా వ్యవహరించలేదని ఆయన మాటల్లోనే ధ్వనిస్తోంది. భారత్ తో జరిపిన యుధ్ధాల వల్ల పాకిస్తాన్ ప్రజలకు చివరకు పేదరికం, వేదన, నిరుద్యోగం మిగిలాయని సాక్షాత్తు ఆ దేశ ప్రధాని ఈరోజు ఒప్పుకుంటున్నారు. పాపం, ప్రజలు ఇలాంటి బాధలు పడుతున్నారంటే మనకు కూడా బాధ వేస్తోంది. పాలకుల అకృత్యాలు ఎలా ఉన్నా మానవీయ కోణంలో తోటి మనిషి పట్ల సానుభూతి, ప్రేమ ఎవరికైనా ఉండాలి. శాంతికాముక దేశమైన భారత్ కు ఎప్పుడూ ఉంటాయి. అప్పుడు హెపటైటిస్ వ్యాధి ప్రబలినప్పుడు, నిన్న కరోనా కబళిoచిన వేళ కూడా మన దేశం సాయం అందించి పెద్దమనసు చాటుకుంది.
Also read: సంబురాల సంకురాత్రి
వివేకంగా వ్యవహరించాలి
శత్రువైనా కష్టాల్లో ఉంటే గేలి చేయక ఆదుకొనే స్వభావం భారతీయుల రక్తంలోనే ఉంది. మన వివాదం పాలకులతోనే కానీ… ఆ దేశ సామాన్య ప్రజలతో కానే కాదు. ఉభయ దేశాల్లో ఉన్న వివిధ రంగాల నిపుణులను, కార్మికులను, వెరసి మానవవనరులను ఉభయతారకంగా సద్వినియోగం చేసుకుందామని, తద్వారా తమ దేశానికి ఎక్కువ మేలు కలుగుతుందని ఆ దేశ ప్రధాని మన ముందు ఉంచుతున్నారు. ఆ దేశంతో ఎప్పుడు ఎలా నడవాలో ఈపాటికే మనకు అర్ధమైంది. మానవత్వాన్ని చాటుకుంటూనే ఆ దేశంతో పరమ వివేక శోభితంగా, రాజనీతి, యుద్ధనీతితో నడవాల్సి వుంది.
Also read: పాకిస్థాన్ లో ప్రకంపనలు