Sunday, December 22, 2024

భారత్–చైనా సరిహద్దులో పాకిస్తాన్ సైనికులు?

  • పాక్ సైనికులూ, చైనా సైనికులూ ఉమ్మడిగా వ్యవహరిస్తున్నారా?
  • పాక్ సైనికులకు చైనా శిక్షణ ఇస్తున్నదా?
  • ఒకే సారి ఇరువైపుల నుంచి దురాక్రమణ చేసే కుట్ర జరుగుతోందా?
మాశర్మ

భారత్-చైనా సరిహద్దు దగ్గర చైనా సైన్యంతో పాటు దాని సన్నిహిత దేశం పాకిస్తాన్ సైనికులు కూడా తిష్ట వేసినట్లు వార్తలు వస్తున్నాయి. చైనా జర్నలిస్ట్ షెన్ షెవీ శనివారం షేర్ చేసిన ఓ వీడియో ఇది నిజమేనని స్పష్టం చేస్తోంది. ఈ వీడియో నిడివి 52 సెకండ్లు ఉంది. ఈ వీడియోలో చైనా సైనికులతో పాటు గుబురు గడ్డంతో మరో సైనికుడు కనిపిస్తున్నాడు. ఇతని రూపు రేఖలు, శరీరాకృతి చైనీయులకు పూర్తి భిన్నంగా వుంది. ఎల్ ఏ సి (వాస్తవాధీనరేఖ) దగ్గర చైనాకు సహాయం అందించడానికి అన్నట్లుగా పాక్ సైన్యం కూడా రంగంలోకి దిగినట్టు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ సైనికులకు చైనా శిక్షణ ఇస్తోందా? అనే అనుమానాలు మరో వైపు కమ్ముకుంటున్నాయి. సరిహద్దుల్లో అటు చైనా సైనికులు -ఇటు పాకిస్తాన్ సైనికులు మాటిమాటికీ మన సైనికులతో గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో,  తూర్పు లడాఖ్ ప్రాంతంలో భారత సైన్యం, వైమానిక దళం కలిసి ఉమ్మడి వ్యూహం రచిస్తున్నాయి. చైనా దూకుడును అడ్డుకోవడమే దీని ప్రధాన లక్ష్యం. లేహ్ ఎయిర్ ఫీల్డ్ లో ఇప్పటికే వైమానిక దళం యుద్ధ విమానాలను సిద్ధం చేసి ఉంచింది. వాస్తవాధీన రేఖ ప్రాంతంలో పరిస్థితులు హద్దు మీరితే, కట్టడి చెయ్యడానికి భారత్ ఈ వ్యూహం రచిస్తోంది. నిజంగా యుద్ధమే సంభవమైతే,  చైనా, పాకిస్తాన్ రెండు దేశాలను ఎదుర్కోడానికి మేము సర్వసన్నద్ధంగా ఉన్నామని భారత వాయుసేన దళపతి ఆర్ కె ఎస్ బాదౌరియా తాజాగా ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

వాయుసేన సామర్థంలో చైనాతో సమానం

వాయుసేన సామర్ధ్యంలో చైనా మనకంటే గొప్పదేం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అవసరమైతే, ఉత్తర (చైనా), పశ్చిమ (పాకిస్తాన్) సరిహద్దుల్లో యుద్ధం చెయ్యడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంసిద్దంగా ఉందని ఆయన  బలంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలను తేలికగా తీసివెయ్యరాదు. గత 5నెలలుగా లడాఖ్ ప్రాంతంలో భారత్-చైనాల మధ్య ఘర్షణ వాతావరణమే నడుస్తోంది. దీనికి తోడు పాకిస్తాన్ కూడా సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తూనే వుంది. ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఒకటి అర్ధమవుతోంది. ఒక పక్క చైనా-భారత్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో,  ఇంకొక పక్క పాకిస్తాన్  భారత్  సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం  సృష్టిస్తూ ఉంటుంది.పాకిస్తాన్ నెమ్మదిగా ఉన్నట్టు అనిపించగానే, నేపాల్ నుండి భారత్ కు వ్యతిరేకమైన వ్యాఖ్యరావడమో  లేదా చర్య జరగడమో చోటుచేసుకుంటుంది. ఇవీ కాకపోతే, రష్యా నుండి భారత్ కు వ్యతిరేకమైన వాతావరణం కల్పన జరుగుతోంది. పాకిస్తాన్, నేపాల్, రష్యా వెనకాల నిల్చొని, చైనా ఆడించే నాటకాలు  అని స్పష్టంగా అర్ధమవుతున్నాయి. భారత్ ను బలహీన పరచడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా, బహిరంగంగా, రహస్యంగా చైనా చేసే కుతంత్రాలే ఈ పరిణామాలన్నీ. వీరందరూ కలిసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని భారత్ కూడా గ్రహించింది.

రష్యాతో సత్సంబంధాలు

అందుకే, వ్యూహాత్మకంగా చైనాతో చర్చలు జరుపుతూనే, ఇంకొక పక్క అమెరికాతో బంధాలు మరింత దృఢ పరచుకుంటోంది. అదే సమయంలో, రష్యాతో బంధాలు దెబ్బతినకుండా ఉండేలా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నంలో భారత్ గతంలో కంటే ఇంకా బలంగా ముందుకు సాగుతోంది. ఈ అక్టోబర్ 12వ తేదీ నాడు చైనా,  భారత్ సైనికాధికారులు మరోసారి సమావేశం కానున్నారు. సరిహద్దుల్లో ఉన్న ప్రతిష్టంభనను తొలగించుకోవడమే ముఖ్య ఉద్దేశం. ఉద్రిక్త ప్రాంతాల నుండి రెండు దేశాల బలగాలను ఉపసంహరించుకోవడం, అదనపు బలాలను పంపించకుండా ఉండడం, రెండు దేశాల మధ్య శాంతి స్థాపన జరగడం ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరుగనుందని సమాచారం. ఆచరణలో చైనా ఏ మేరకు కట్టుబడి ఉంటుందన్నది అనుమానమే. ఇప్పటికే పలుమార్లు ఒప్పందాలను ఉల్లంఘించిన చరిత్ర చైనాకు ఉంది. పైకి మాట్లాడేది వేరు, వెనకాల ఆచరించేది వేరని ఈపాటికే మనకు అర్ధమైంది. అయినప్పటికీ పొరుగుదేశంతో, మన కంటే బలమైన దేశంతో తగాదాలు పెంచుకోవడం, యుద్ధం వచ్చేలా చేసుకోవడం వివేకం కాదు. అటు అమెరికాతో-ఇటు చైనాతో సంబంధాలు కొనసాగిస్తూ ఉంటే, పాకిస్తాన్ లాంటి దేశాలు భారత్ ను ఏమీ చెయ్యలేవు. పాకిస్తాన్-చైనాల మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని ప్రపంచ దేశాలు ఇప్పటికే గ్రహించాయి. చైనా సైన్యంతో పాకిస్తాన్ సిపాయి కలిసి ఉన్నట్లు వైరల్ అవుతోన్న తాజా వీడియో ఆ రెండు దేశాల బంధాన్ని మరోమారు తేట తెల్లం చేసింది. అసలు రంగు బట్టబయలైంది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles