- నాలుగురోజుల్లోనే సౌతాఫ్రికా చిత్తు
- నౌమన్ అలీ స్పిన్ మ్యాజిక్ లో సఫారీల గల్లంతు
పాకిస్థాన్ చాలాకాలం తర్వాత సొంతం గడ్డపై టెస్ట్ మ్యాచ్ లో కళ్లు చెదిరే విజయం సాధించింది. ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ లీగ్ లో భాగంగా కరాచీ నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన తొలిటెస్టు మొదటి నాలుగురోజుల ఆటలోనే ఆతిథ్య పాక్ 7 వికెట్లతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి 1-0 ఆధిక్యం సంపాదించింది. బాబర్ అజమ్ నాయకత్వంలో తొలిసారిగా టెస్టు సిరీస్ లో పాల్గొంటున్న పాకిస్థాన్ తన రెండో ఇన్నింగ్స్ లో విజయానికి అవసరమైన 88 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు నష్టపోయి సాధించింది. అజర్ అలీ 31, ఫవాద్ అలం 4 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
నౌమన్ అలీ స్పిన్ మ్యాజిక్:
అంతకుముందు నాలుగో రోజు ఆటలో రెండోఇన్నింగ్స్ కొనసాగించిన సౌతాఫ్రికా 245 పరుగులకే కుప్పకూలింది. లెగ్ స్పిన్నర్ యాసిర్ షా 4 వికెట్లు, అరంగేట్రం స్పిన్నర్ నౌమన్ అలీ 5 వికెట్లు పడగొట్టి సఫారీలను కకావికలు చేశారు. 34 సంవత్సరాల లేటు వయసులో టెస్టుక్యాప్ సాధించిన నౌమన్ అలీ 35 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ఘనత సాధించిన పాక్ తొలి బౌలర్ గా రికార్డుల్లో చేరాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ క్వింటన్ డి కాక్ నాయకత్వంలోని సౌత్ ఆఫ్రికా జట్టు తొలిఇన్నింగ్స్ లో 220 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ జట్టు 158 పరుగుల ఆధిక్యం సంపాదించింది. దీంతో పాక్ జట్టు విజయానికి మార్గం సుగమం చేసుకొంది. సిరీస్ లోని రెండవ, ఆఖరి టెస్టు రావల్పిండి వేదికగా ఫిబ్రవరి 4 నుంచి 8 వరకూ జరుగుతుంది. 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తమ గడ్డపై టెస్టు సిరీస్ ఆడటానికి వచ్చిన సఫారీ జట్టుపై పాక్ జట్టు సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించి స్పిన్ పవర్ తో విజేతగా నిలిచింది.