- దుబాయ్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్
- ఒక్క వికెట్టు కూడా కోల్పోకుండా లక్ష్యం ఛేదించిన పాక్
పాకిస్తాన్ జట్టు భారత జట్టుపైన టీ 20 మ్యాచ్ లో అద్భుత విజయం సాధించింది. గెలుపొందడం అసాధ్యమనుకునే దశ నుంచి సునాయాసంగా భారత్ పై గెలిచే స్థాయికి పాకిస్తాన్ జట్టు చేరుకోవడం విశేషం. విజయానికి అవసరమైన 152 పరుగులను పాకిస్తాన్ 18 ఓవర్ల లోపే సాధించడం విశేషం. ఇద్దరు పాక్ ఓపెనర్లు ఏ మాత్రం ఆయాసపడకుండా, తోట్రుపడకుండా తమదైన శైలిలో ఆడి విజయం సాధించారు. భారత బౌలర్లు ఒక్క పాకిస్తాన్ వికెట్టును సైతం పడగొట్టలేకపోయారు. అదే పాకిస్తాన్ బౌలర్లు 20 ఓవర్లలో ఏడు భారత వికెట్లు పడగొట్టారు. అన్ని విధాల ఆదివారంనాడు దుబాయ్ లో పాకిస్తాన్ క్రికెటర్లు భారత క్రికెటర్ల కంటే బాగా ఆడి శభాష్ అనిపించుకున్నారు.
దుబాయ్ లో జరిగిన భారత్ – పాకిస్తాన్ టీ20 మ్యాచ్ లో పాకిస్తాన్ అవలీలగా గెలుపొందింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అతడి నిర్ణయం సత్ఫలితాలను ఇచ్చింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ను షహీన్ షా అఫ్రిది పెవిలియన్ కు పంపించాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వికెట్ ను హసన్అలీ పడగొట్టాడు. భారత జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ టీ 20లలో తన 29వ అర్ధశతకం చేసిన తర్వాత అఫ్రిది చేతిలోనే వికెట్టు కోల్పోయాడు. అప్పటికి కొహ్లీ స్కోరు 57పరుగులు. హార్దక్ పాండే మరోసారి ఆశాభంగం కలిగించారు. రిషబ్ పంత్ 30 బంతులలో 39 పరుగులు చేశాడు. మొత్తం మీద భారత్ 151 పరుగులు చేసింది. పాకిస్తాన్ గెలవాలంటూ 152 పరుగులు చేయాలి.
పాకిస్తాన్ ఓపెనర్లు బాబర్ ఆజం, మొహమ్మద్ రిజ్వాన్ లు అద్భుతంగా ఆడారు. చెరి అర్ధ శతకం సాధించారు. ఇద్దరూ వికెట్టు కోల్పోకుండా అద్భుతంగా ఆడి పది వికెట్ల విజయం సాధించారు.