పద్మజా నాయుడు (నవంబర్ 17, 1900 – మే 2, 1975) స్వాతంత్ర్య సమర యోధురాలు, కవయిత్రి, సుదీర్ఘ కాలం పాటు గవర్నర్ గా పని చేసిన మహిళ. ఆమె హైదరాబాద్‌లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంయుక్త వ్యవస్థాపకురాలు. పురుషుల ఆధిపత్య ప్రజా రంగంలో, సామాజిక సేవకురాలిగా, రాజకీయ నాయకురాలిగా, పాలకురాలిగా ప్రత్యేక గుర్తింపు పొందారు.
పద్మజా నాయుడు 1900 నవంబర్ 17న హైదరాబాద్‌లో జన్మించారు. ఆమె (బెంగాలీ) తల్లి ప్రఖ్యాత కవి, భారత స్వాతంత్ర్య సమర యోధురాలు సరోజిని నాయుడు. ఆమె (తెలుగు) తండ్రి ముత్యాల గోవిందరాజులు నాయుడు వైద్యుడు. ఆమెకు జైసూర్య, లీలమణి, ఆదిత్య, రణధీర అనే నలుగురు తోబుట్టువులు.
గోల్డెన్ థ్రెషోల్డ్ లోనే విద్యార్జన
పద్మజా నాయుడు పెద్దగా చదువు కోలేదు. చిన్ననాడు చేరిన మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలలో నాలుగేళ్ళు మాత్రమే చదివారు. బాల్యంలో తరుచుగా అనారోగ్యానికి గురికావడంతో ఆమె చదువు సరిగా సాగలేక పోయింది. ఆమె నేర్చుకున్న విద్య, సంస్కారం అంతా తన తల్లి వివాసమైన గోల్డెన్ థ్రెషోల్డ్‌కు వచ్చి పోయే వారి మధ్యే సాగి పోయింది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వర్క్స్ శాఖను ఏర్పాటు చేసి ఆమె పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. ప్రజారోగ్య పరిరక్షణకై ఆమె ఎంతో మంది ముస్లిం స్త్రీలను సభ్యులుగా చేర్చుకొని ప్లేగు రిలీఫ్ కమిటీని ఏర్పాటు చేశారు. పౌరుల స్వేచ్ఛ కొరకు, జాగిర్దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా స్థాపించ బడిన స్వదేశీ లీగ్ అనే సంస్థకు అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే, ఆమె తన సంపాదకత్వంలో ‘వన్ వరల్డ్’ అనే పత్రికను నడిపారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో సామ్యవాద సిద్ధాంతానికి ప్రభావితులైన కొందరు ఉస్మానియా విద్యార్థులు కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించగా, సంస్థకు పద్మజా నాయుడు సహకారాన్ని అందించారు. 1935లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడి నప్పుడు, రైతుల దుర్భర పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడానికి ఏర్పడిన హైదరాబాద్ సహాయక సంఘానికి ఆమె అధ్యక్షురాలుగా వ్యవహరించారు. అనేక ప్రాంతాలు పర్యటించి, భాధితులకు తక్షణ సహాయం అందేలా ఏర్పాట్లు చేశారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో కారాగారవాసం
1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. అప్పటికి మహిళలకు ప్రత్యేకమైన జైళ్ళు లేకపోవడం, పలుకుబడి కలిగిన కుటుంబానికి చెందిన వారు కావడం మూలాన ఆమెను హయత్ నగర్ లోని బేగం గారి దేవిడిలో సకల సౌకర్యాలు కలిగిన రాజభవనంలో నిర్బంధించారు. దానికి ఆమె సంతోషించక తనతో పాటు అరెస్ట్ అయిన తక్కిన మహిళలకు ఎందుకు ఆ వసతులు కల్పించలేదని ప్రశ్నించారు. చైనా యుద్ధ సమయంలో ఆమె తనకున్న విలువైన బంగారు ఆభరణాలను నేషనల్ డిఫెన్స్ ఫౌండేషన్ కు సమర్పించారు. భారతదేశం నుండి ” క్రమబద్ధమైన బ్రిటీష్ ఉపసంహరణ” కోరుతూ మహాత్మా గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఖాదీ గురించి గాంధీ సందేశాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసేందుకు, విదేశీ వస్తువులను బహిష్కరించడానికి కృషి సల్పారు.
రెడ్ క్రాస్ సంస్థతో సంబంధాలు
పద్మజా నాయుడు భారత రాజ్యంగ సభకు 1950 లో ఎన్నికై రెండేళ్ళు ఆ పదవిలో కొనసాగారు. ఆ తరువాత ఆమె 1956 నుండి 1967 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నరుగా పనిచేశారు. స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా తల్లితో పాటు పనిచేసిన పద్మజ, 21 యేళ్ల వయసులోనే హైదరాబాదులో భారత జాతీయ కాంగ్రెస్ సహ వ్యవస్థాపకురాలు అయ్యారు. స్వాతంత్ర్య్ర్యానంతరం పద్మజా నాయుడు పార్లమెంటుకు ఎన్నికైనారు. కానీ అనారోగ్యం వల్ల రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత పశ్చిమ బెంగాల్ గవర్నరుగా పని చేశారు. అర్ధ శతాబ్దానికి పైగా ఉన్న ఆమె ప్రజా జీవితంలో, స్వచ్ఛంద సేవలో ఔట్సాహికురాలై, ఆమె మానవ సంక్షేమ నిర్దేశిత, అంతర్జాతీయ మానవతా సంస్థ రెడ్‌క్రాస్ సొసైటీ తో సంబంధం కలిగి ఉండేది. బంగ్లాదేశ్ శరణార్ధుల సహాయచర్య లప్పుడు భారత రెడ్ క్రాస్ సంస్థ ఛైర్ పర్సన్ గాను పని చేసి, ప్రముఖ పాత్ర పోషించారు. పద్మజా నాయుడుకు భారత్ సేవక్ సమాజ్, అఖిల భారత హస్తకళల బోర్డు, నెహ్రూ స్మారక నిధి వంటి సంస్థలతో అనుబంధం ఉండేది.
గోల్డెన్ థ్రెషోల్డ్ హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి
పద్మజ తన కవితా సంకలనం “ది ఫెదర్ ఆఫ్ డాన్” పేరుతో 1961లో ప్రచురించారు. 1975లో పద్మజా నాయుడు స్మృత్యర్ధం డార్జిలింగులోని జంతు ప్రదర్శన శాలను పద్మజా నాయుడు హిమాలయ జంతు ప్రదర్శన శాలగా మార్చగా, నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రారంభోత్సవం చేశారు. పద్మజా నాయుడు తన తల్లి (సరోజిని నాయుడు) నివాసం ది గోల్డెన్ థ్రెషోల్డ్‌ను 1970 లలో హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి (యుఒహెచ్) అప్పగించారు.
భారతజాతికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆమెకు పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. పద్మజా నాయుడు 1975 మే 2 న పరమపదించారు.
(నవంబర్ 17 పద్మజా నాయుడు జయంతి)