- వరుసగా నాలుగో శతకం బాదిన యువఓపెనర్
- సంగక్కర, అల్వీరోల సరసన పడిక్కల్
దేశవాళీ వన్డే క్రికెట్ లో కర్ణాటక యువఓపెనర్ దేవదత్ పడిక్కల్ సెంచరీల మోత మోగిస్తూ భారతజట్టు తలుపులు తడుతున్నాడు. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న విజయ్ హజారే వన్డే ట్రోఫీ లీగ్ దశ నుంచి క్వార్టర్ ఫైనల్స్ వరకూ నాలుగు మ్యాచ్ ల్లో నాలుగు సెంచరీలు నమోదు చేశాడు.పాలం-ఏ గ్రౌండ్ వేదికగా కేరళతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ -2 మ్యాచ్ లో 20 సంవత్సరాల పడిక్కల్ 101 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రవికుమార్ సమర్త్ తో కలసి బ్యాటింగ్ కు దిగిన పడిక్కల్ మొదటి వికెట్ కు 43 ఓవర్లలో 249 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆట 43వ ఓవర్ కు ముందే వరుసగా నాలుగో శతకం పూర్తి చేసిన పడిక్కల్ ను పేసర్ బాసిల్ పడగొట్టాడు.
Also Read: దేశవాళీ క్రికెట్లో సరికొత్త రికార్డు
లీగ్ దశలో ఒడిషా 152, కేరళ పై 126 నాటౌట్, రైల్వేస్ పై 145 నాటౌట్ స్కోర్లు సాధించాడు. ఇప్పటి వరకూ పడిక్కల్ నాలుగు శతకాలతో 673 పరుగులు సాధించడం విశేషం.వన్డే క్రికెట్ చరిత్రలో వరుసగా నాలుగు శతకాలు బాదిన ఆటగాళ్లలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, సౌతాఫ్రికా ఆల్ రౌండర్ అల్విరో పీటర్సన్ ఉన్నారు.2015 ప్రపంచకప్ లో సంగక్కర వరుసగా నాలుగు సెంచరీలు సాధిస్తే 2015-16 సీజన్ మోమెంటమ్ వన్డే కప్ లో అల్వీరో సైతం నాలుగు శతకాలు నమోదు చేశాడు.ఇప్పుడు ఆ ఇద్దరి సరసన భారత కుర్రాడు పడిక్కల్ సైతం నిలిచాడు.
Also Read: 100 వన్డేల క్లబ్ లో హర్మన్ ప్రీత్ కౌర్
ఐపీఎల్ గత సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టులో సభ్యుడిగా బరిలోకి దిగిన పడిక్కల్ పలు మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకొన్నాడు. కేవలం 20 లక్షల రూపాయల కనీసధరకే పడిక్కల్ ను బెంగళూరు ఫ్రాంచైజీ దక్కించుకొంది.