హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఒక్క కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనలేమని చెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలోని బాయిల్డ్ రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని, తెలంగాణలో రైతులు ఇకముందు వరిపంట సాగు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ప్రగతిభవన్ లో జరిగిన వ్యవసాయశాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ అధ్యక్షతన సమావేశం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన వ్యవసాయ పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో గత యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రం ఎఫ్.సీ.ఐ ద్వారా త్వరగా తీసుకోవాలని తద్వారా వానాకాలంలో ఉత్పత్తి అయ్యే పంట నిల్వకు సరిపడా స్థలం లభిస్తుందని పేర్కొంటూ, ఇటీవల రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, కేటీఆర్ లు.. కేంద్ర పౌర సరఫరాలశాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి విన్నవించగా, ఒక్క కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనలేమని ఇప్పటికే కేంద్రం వద్ద 5 సంవత్సరాలకు సరిపడా నిల్వలున్నాయని కేంద్రమంత్రి తేల్చిచెప్పిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ పరిస్థితుల్లో ప్రస్తుత వానాకాలంలో కూడా 60 లక్షల టన్నులు మించి ధాన్యం తీసుకోనని కేంద్ర ప్రభుత్వం నిర్మొహమాటంగా చెప్పినందున, ధాన్యాన్ని ప్రభుత్వం గానీ, మిల్లర్లు గానీ కొనుగోలు చేయడానికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు రానున్నాయని అధికారులు సమావేశంలో తెలిపారు.
దేశంలో కరువులు, ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని ప్రజల అవసరాల దృష్ట్యా ధాన్యం నిల్వ చేయడం కేంద్ర ప్రభుత్వ విధి అని, రాష్ట్రాలు తమకు పంటలను కనీస మద్దతు ధర ద్వారా కొనుగోలు చేసి ఇవ్వడం వరకే రాష్ట్రాల బాధ్యత అని అధికారులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అయితే, కేంద్రమంత్రి గోయల్ మాత్రం ఇప్పటికే నిల్వలు ఉన్న దృష్ట్యా ఒక్క కిలో ధాన్యం కూడా కొనలేమని చెబుతున్నారని అధికారులు వివరించారు.
వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించాలి
రాష్ట్రంలో కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా రైతు బంధు వంటి పంట పెట్టుబడి సాయం, 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్ వంటి ప్రోత్సాహకాల ద్వారా సాగు గణనీయంగా పెరిగి, రైతులు పంటలు బాగా పండిస్తున్నారని సమావేశం అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి వ్యవసాయ ఎగుమతులను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించి, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర వ్యవసాయాధారిత పరిశ్రమలను ఇబ్బడి ముబ్బడిగా ప్రోత్సహిస్తే బాగుండేదని కానీ, కేంద్రం ఇలాంటివేమీ చేయకపోవడం వల్ల.. ఆహార నిల్వలు పేరుకు పోతున్నాయని చెప్పి తన బాధ్యతల నుండి కేంద్రం తప్పించుకోజూస్తున్నదని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం తెగేసి చెప్పిన దరిమిలా, ఇక వచ్చే యాసంగి కాలం నుండి వరి వేయడమంటే, రైతులు ఉరి వేసుకోవడమే అనే అభిప్రాయం వ్యక్తమైంది. గత యాసంగిలో రాష్ట్రం 92 లక్షల టన్నుల ధాన్యం సేకరించిందని, రైతులు ఈ వానాకాలంలో 55 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగు చేస్తున్నారని, దీని ద్వారా సుమారు 1 కోటి 40 లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా ఉందని, ఇప్పటికే సుమారు 70 లక్షల టన్నుల ధాన్యం ఇంకా రాష్ట్ర రైస్ మిల్లుల్లో, ఇతర ప్రదేశాల్లో నిల్వ ఉందని అధికారులు వివరించారు. వీటి దృష్ట్యా పీడీఎస్ తదితర అవసరాల మేరకు, కేంద్రప్రభుత్వం నిర్ధారించిన కోటా మినహా, మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయడం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానాల దృష్ట్యా సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్ర ప్రభుత్వంపై గత యాసంగిలో సేకరించిన ధాన్యం వల్ల సుమారు రూ.2,000 కోట్ల అదనపు భారం పడనుందని అధికారులు వివరించారు. వీటన్నింటి దృష్ట్యా యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలైన శనగలు, వేరు శనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదాలు, కూరగాయల లాంటివి పండిస్తే రైతులకు లాభాలు వస్తాయని సమావేశం అభిప్రాయపడింది.
గతంలో కరోనా వల్ల రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోవద్దని రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి ధాన్యం కొనుగోలు చేసింది. కానీ, ఈ వర్షాకాలంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్దారించిన 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లను ఐకేపీ కేంద్రాల ద్వారా కోటా మేరకు మాత్రమే ధాన్యం సేకరణ జరగాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. రైతులను చైతన్య పరిచేందుకు వ్యవసాయశాఖ అన్ని స్థాయిల్లోని అధికారులు తగు ప్రచారం నిర్వహించాలని సమావేశం అభిప్రాయపడింది.