Tuesday, January 28, 2025

మనలను ఆవరించిన మాయ

రైటప్: ఈశ్వరచంద్ర విద్యాసాగర్

భగవద్గీత95

ఒక పండితుడు దేశంలో బాగా పేరున్నవాడు. సంస్కృత భాషలో చాలాగొప్ప పరిశ్రమచేసినవాడు. ఆయనకు ఒకప్పుడు ఒక విషయం మీద గొప్పసందేహం కలిగింది. దానిని తీర్చగలిగినవాడు దేశం మొత్తం మీద ఒకే ఒక్కడు కనపడ్డాడు. కాకపోతే ఆయన తనకు దూరంగా ఎక్కడో బెంగాల్‌ లో ఉంటాడు. తన సందేహం గురించి ఆయనకు ఉత్తరం వ్రాసి మీతో చర్చించాలని ఉన్నది ఫలానా రోజున వస్తాను అనుమతి ఇవ్వగలరు అని అడిగాడు.

దానిదేముంది తప్పక రండి అని బెంగాల్‌ లో ఉన్న పండితుడు తిరుగుటపా వ్రాశారు. పండితుడు రైలులో కలకత్తా చేరుకున్నారు. చేతికి బంగారు కంకణాలు ధరించి మహా ఖరీదయిన పట్టువస్త్రాలు ధరించి దర్జా ఒలకబోస్తూ రైలు దిగారు. తనను రమ్మని పిలిచిన బెంగాల్‌ పండితుడు ఎక్కడన్నా కనపడతాడేమో అని చుట్టూ చూశాడు. ఎక్కడా ఆయన ఈయనకు కనపడలేదు. సమయం గడిచిపోతున్నది.

Also read: భక్త సులభుడు భోళాశంకరుడు

ఇంతలో ఆయనకు ఒక వ్యక్తి కనపడ్డాడు. అత్యంత సాధారణమైన దుస్తులు ధరించి ఉన్నాడతడు.  అతను కూలీ అయి ఉంటాడనుకొని “ఏమోయ్‌ ఇటువస్తావా. కాస్త నా పెట్టె నీ నెత్తిన పెట్టుకొని నాకు ఫలానావారిల్లు చూపిస్తావా. నీవు అడిగిన డబ్బులిస్తాను“ అని పిలిచాడు.

అందుకు ఆ సాధారణవ్యక్తి సంతోషంగా ఒప్పుకొని పెట్టెనెత్తిన పెట్టుకొని నడవడం మొదలుపెట్టాడు. రైల్లోనుంచి దిగినాయన కూలీతో “ఏమోయ్‌ నేనెవరింటికి వెళుతున్నానో తెలుసా? ఆయన ఈ దేశంలోనే మహాపండితుడు. నేనే గొప్ప పండితుడినయితే ఆయన నాకన్నా మహాపండితుడు. నా సందేహాలు తీర్చగలవాడు ఆయనొక్కడే. నా వలన నీకు కూడా ఆయన దర్శనమవుతుందిలే. నువ్వు అదృష్టవంతుడివి. రా“.

Also read: జీవితం  ఎట్లా వస్తే అట్లా స్వీకరించాలి

కూలీమనిషి అన్నిమాటలను మౌనంగా వింటూ నడుస్తున్నాడు. కలకత్తాలో వారు చేరవలసిన చోటికి చేరుకున్న తరువాత… పండితుడిని ఇంటిలోకి సాదరంగా ఆహ్వానించి కూర్చోపెట్టి లోపలికి వెళ్ళాడు పెట్టెమోసుకొచ్చిన కూలీ. కాసేపటికి బయటకు వచ్చి ఆయనకు మంచినీళ్ళిచ్చి కుశల ప్రశ్నలువేశాడు.  పండితుడికి సాధారణవ్యక్తి మాట్లాడే పద్ధతి చూసి అనుమానం వచ్చి…

’’వారేరీ ’’ అని అడిగాడు. `మీరు ఎవరి కోసం వచ్చారో ఆ వ్యక్తి నేనే` అని బదులిచ్చారాయన. ఆ సాధారణవ్యక్తి మరెవరో కాదు అసాధారణ ప్రజ్ఞావంతుడైన శ్రీ ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌. ఆ తరువాత ఏం జరిగి ఉంటుందో చెప్పనక్కర్లేదనుకుంటా.

`పైపైని మెరుగులకోసం భ్రమచెందు గుడ్డిలోకం` అని ఒక సినిమా పాటున్నది. నేటి సమాజం మనిషి డ్రస్సు, పర్సు చూసి గొప్పవాడనుకుంటున్నది. లేదా గొప్పవాడంటే గొప్ప డ్రస్సు, మనీ పర్సు ఉండాలనుకొంటున్నది… ఇలాంటి ఆలోచనలను కలిగి ఉన్న సమాజం ఆసురీ ప్రవృత్తి కలిగినటువంటిది. ఇలాంటి ఆలోచనలు వ్యర్ధముకాదా?

మోఘాశా మోఘకర్మాణా మోఘజ్ఞానా విచేతసః

రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః

అర్ధం లేని ఆలోచనలు, అర్ధం లేని ఆశలు, అర్ధంలేని పనులు, అర్ధంపర్ధంలేని నడవడిక.

విలువలపట్ల ఏ మాత్రం నమ్మకంలేనివారు అసలవేమిటో తెలియని వారు. అందుకే మన ఎదురుగా మేధావులున్నా అవధూతలున్నా మనకు తెలియదు. మాయ మనలను ఆవరించి ఉంటుంది. ఇది ఆసురీ ప్రకృతి. ఇలాంటివారిని ‘‘విచేతసులు ’’ అని పిలిచారు పరమాత్మ.

BRAIN LESS PEOPLE

Also read: జ్ఞానంతో ఆలోచించి ఇష్టం వచ్చినట్టు చేయమని అర్జనుడికి కృష్ణుడి ఉద్బోధ

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles