ఆకాశవాణిలో నాగసూరీయం –16
“సిగ్నేచర్ ట్యూన్… లేదే… ఏం చేయాలి? ఎలా చేయాలి?”, అని హడావుడి పడుతూ దాదాపు పరుగెత్తు కొచ్చారు అనౌన్సర్ గోపి! గోపి అంటే ఆకాశవాణి కడపలో చాలాకాలం శ్రోతలను మంత్రముగ్ధులు చేసిన మాధుర్యపు గళం. అనంతపురం ఆకాశవాణి ప్రారంభానికి అనౌన్సర్లకు శిక్షణ ఇవ్వడానికి కడప నుంచి పక్షం రోజుల ముందు వచ్చారు.
Also read: బదిలీ బాదరాయణంలో జీవనమాధుర్యం!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సగం కేంద్రాలలో పని
ఆరోజు 1991 మే 29! తొలుత మే 22న దేశంలో అనంతపురంతో సహా ఐదు ఆకాశవాణి కేంద్రాలు ఒకేరోజు ప్రారంభం కావాల్సి ఉండింది. అయితే, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆకస్మికంగా కనుమూయడంతో వాయిదా పడ్డాయి. దగ్గరలో ఉన్న ఆకాశవాణి కడప. ఎంత వేగంగా వచ్చినా మూడు గంటలకు పైగా దూరం. అప్పటికి ఈ-మెయిల్స్ వగైరా ప్రచారంలో లేవు. నిజానికి ఆకాశవాణి కేంద్రానికి ప్రారంభానికి అవసరమైన అన్నీ పద్ధతి ప్రకారం పంపుతారు. ప్రసారాలకు ముందు వినిపించే 2 నిమిషాల సంగీతం ఆకాశవాణి ప్రసారాలకు సంకేతం. దాని ద్వారా శ్రోతలు ప్రసారాలను గుర్తిస్తారు, ఏ మాత్రం ‘మిస్’ కాకుండా వింటారు.
అది మధ్యాహ్నం. నేను భోజనం ముగించుకుని ఆఫీసుకు వచ్చాను. సాయంకాలం 5.55 గం. ప్రసారం ప్రారంభం. ఈ సిగ్నేచర్ ట్యూన్ 5.53 కు వినిపించి, లాంఛనంగా అనంతపురం ఆకాశవాణి ప్రసారాలకు శ్రీకారం చుట్టాలి. అందువల్లనే గోపి హడావుడి పడ్డారు. సిగ్నేచర్ ట్యూన్ గురించి అంత వరకు ఎవరికీ గుర్తుకు రాలేదు. పద్మనాభరావు డైరెక్టరు, నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ మిగతా పెక్స్ లు జాయిన్ కాలేదు.
Also read: పదిలంగా సాగిన ఉద్యోగ రథం!
చాకచక్యంగా అధిగమించిన అవాంతరం
గోవాలో పనిచేసే కాలంలో తెల్లవారుజామున తెలుగు విదేశీ ప్రసారాలు, రాత్రిపూట నేషనల్ ఛానల్ ప్రసారాలు వినడం హాబీ. విదేశీ ప్రసారాలంటే భారతీయ సంతతి వారి కోసం వేర్వేరు దేశాల్లో ఉండేవారికి వారి వారి భాషల్లో అరగంటో, గంటో ఈ ప్రత్యేక ప్రసారాలు ఉంటాయి. అందువల్ల ఆయా దేశాల భౌగోళిక స్థానం బట్టి ప్రసార సమయాలు మారుతుంటాయి. కనుక 24 గం. ఏదో భాషలో ఏదో మీటర్ల మీద ఆకాశవాణి ప్రసారాలు జరుగుతూ ఉండేవి. కనుక ఒక్క అంగలో సాంకేతిక విభాగం వైపు వెళ్ళిపోయి రేడియో స్పెక్ట్రమ్ స్కాన్ చేయమని కోరాను. ఒక అరగంటలో సిగ్నేచర్ ట్యూన్ లభించింది. వెతుకుతున్నపుడే రికార్డింగు ఏర్పాట్లు చేసుకున్నాం.
అలా నా స్థాయిలోనే తొలి అవాంతరం చాకచక్యంగా దాటాను. ఏ పై అధికారి జోక్యం లేకుండానే సమస్య పరిష్కారమైంది. అంతే, సంభ్రమంగా నా ఉద్యోగం సాగిపోయింది. 12 రేడియో కేంద్రాలున్న సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో ఆరు కేంద్రాలలో నేను పనిచేశాను. ప్రతి ఆకాశవాణి కేంద్రం ఉత్సవాలు జరుపుకోవడంలో నేను భాగస్వామిని కావడం బదిలీలు కల్పించిన గొప్ప అవకాశం.
అనంతపురం కేంద్రంలో ఐదేళ్ళు దాటిన తర్వాత 1996 సంవత్సరం మధ్యలో విజయవాడ వెళ్ళాను. 1948 డిసెంబరు ఒకటిన మొదలైన విజయవాడ ఆకాశవాణికి 1998 స్వర్ణోత్సవ సందర్భం. అప్పటికి నేను అక్కడ చేరి రెండేళ్ళు దాటింది. కీలకమైన ‘ఉదయ రేఖలు’ కార్యక్రమంతో మంచి గుర్తింపు వచ్చింది. ప్రయాగ వేదవతి ఆకాశవాణి సారథిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ స్వర్ణోత్సవాలకు తెలుగు పత్రికలు ఇచ్చిన ప్రాధాన్యత వెలలేనిది. గొప్పగా చేశాం. మంచి సావనీరు తెచ్చాం. ఇందులో నేను పూర్తిగా లీనమై సేవలందించాను. ఇది ఇప్పుడు మధురస్మృతి.
Also read: లేచి వచ్చిన లేపాక్షి బసవడు!
వివిధ కేంద్రాలలో విభిన్నమైన అనుభూతులు
విశాఖపట్నం కేంద్రంలో చాలా ఎక్కువ విభాగాలు పర్యవేక్షించడమే కాక వైవిధ్యమైన కార్యక్రమాలు చేయగలిగే అవకాశం దొరికింది. గిరిజనుల నుద్దేశించిన కార్యక్రమాలు, యువవాణి కార్యక్రమాలు, హెల్త్ లైవ్ కార్యక్రమం, ఆదివాసీ అంతరంగం వీక్లీ లైవ్ కార్యక్రమం, తారాతీరం సినీకార్యక్రమం ఇలా ఎన్నో. గురజాడ అప్పారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గురించి ధారావాహికలు అదనం. ఇవి కాక నేను అక్కడున్నప్పుడే ఎఫ్.ఎం. రెయిన్ బో మొదలు కావడం, మొదలైన తొలి మూడు గంటలు లైవ్ ప్రోగ్రాం నేను ఫిల్మ్ పెర్సనాలిటీలతో నిర్వహించడం ఉత్సవమే కదా!
2008 సైన్స్ డే (ఫిబ్రవరి 28) తర్వాత హైదరాబాదులో చేరాను. చేరిన మూడోరోజు భద్రాచలం రాముల వారి కళ్యాణానికి ప్రత్యక్ష వ్యాఖ్యాన కార్యక్రమం బాధ్యత పడింది. 1950 ఏప్రిల్ 1న భారతప్రభుత్వం నైజాం రేడియో ప్రసారాలను ఆకాశవాణిగా మార్చింది. అందువల్ల 2010 లో అరవయ్యేళ్ళ పండుగ. సావనీరు విడుదల కాలేదు కానీ ‘వజ్రవారధి’, ‘మన తెలుగు’ వంటి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించే అవకాశం నాకు కల్గింది.
1963లో మొదలైన కడప ఆకాశవాణికి 2012-2013 స్వర్ణోత్సవ సందర్భం. నేను 2012 అక్టోబరులో చేరాను. పరిస్థితులు చాలా మారాయి. బడ్జెటుకు కోత, సిబ్బంది లోటు కటకట. ఖర్చులేకుండా ప్రోగ్రామ్ హెడ్ గా చాలా మార్పులు చేశాను. ‘ఈ ప్రాంతం- ఈవారం’, ‘విరిజల్లు’, ‘అన్నమయ్య పదగోపురం’, ‘బ్రహ్మంగారి తత్వప్రభ’ వంటి కార్యక్రమాలు చేసి తృప్తి పడ్డాను.
1938 జూన్ 16న మదరాసులో తొలి తెలుగు ప్రసారాలు మొదలయ్యాయి. అదే తేది ఆచంట జానకిరాం జన్మదినం కావడం విశేషం. 2013 మేనెలలో మద్రాసులో నేను చేరిన వేళ ఆ కేంద్రం 75 సంవత్సరాల అమృతోత్సవాలు చివరి స్థాయిలో ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో పాల్గోవడం కూడా భాగ్యమే!
Also read: విజయదశమి కనకదుర్గ తెప్పోత్సవం
నా పుట్టినరోజే ప్రారంభమైన తిరుపతి కేంద్రం
తిరుపతి స్టేషన్ డైరెక్టరుగా 2016 నుంచి 2018 దాకా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వంటి ఎన్నో సందర్భాలు తామరతంపరగా వచ్చాయి. తిరుపతి కేంద్రం విశేషం.. ఏమిటంటే ఆ కేంద్రం ప్రారంభమైన తేదీ, నా బర్త్ డే ( ఫిబ్రవరి 1) ఒక్కటే కావడం! నెల్లూరు ఆకాశవాణి కేంద్రం భూమి పూజకు కూడా నేను తిరుపతి నుంచి వెళ్ళాల్సి వచ్చింది. అనంతపురం, కడప కేంద్రాలలో మదరాసు తెలుగు ప్రసారాల్లో చాలా ప్రయోజనకరమైన మార్పులు చేర్పులు చేసిన తృప్తి ఉంది!
“ఉద్యోగంగా కాక ఉద్యమంగా చేశారు…” అని మిత్రులు రావినూతల కిరణ్ బాబు ‘ఆకాశవాణిలో నాగసూరీయం’ వ్యాసాలకు ఫేస్ బుక్ లో స్పందించారు. వార్తాపత్రికలు, టీవీ ఛానళ్ళు, రేడియో మాధ్యమానికి సాధ్యం కాని ఫీడ్ బ్యాక్ సోషల్ మీడియాలో వీలయ్యింది!’ కిరణ్ బాబుగార్కి కృతజ్ఞతలు చెబుతూనే, ఉద్యమం మాట ఏమో గానీ, నాకు ఉద్యోగం ఉత్సవంగా, ఉత్సవాల వెల్లువగా సాగిపోయింది అని మాత్రం చెప్పగలను!
Also read: అనంతపురం పల్లెకళల దిగంతం!!
డాక్టర్ నాగసూరి వేణుగోపాల్,
ఆకాశవాణి పూర్వ సంచాలకులు,
మొబైల్ ఫోన్-9440732392