Wednesday, December 25, 2024

జీ-ట్వంటీలో మన గళం

  • అత్యంత శక్తిమంతమైన అంతర్జాతీయ సంస్థ
  • ప్రపంచాన్ని ప్రభావితం చేయగల గ్రూపు

గ్రూప్ 20గా పేరున్న ఇందులో మనం కూడా సభ్యులుగా ఉన్నాం. అంతర్జాతీయ వేదికలపై ఇందులోని సభ్య దేశాలకు పేరు, ప్రతిష్ఠ ఉన్నాయి. జీ -2 నుంచి జీ-20 వరకూ అనేక పేర్లతో గ్రూపులు ఉన్నాయి. వీటన్నిటిలో అత్యంత శక్తిమంతమైంది జీ 20. జనాభా పరంగానూ, వాణిజ్య పరంగానూ, జీడీపీలో వాటా పరంగానూ ఈ దేశాల భాగస్వామ్యం అతిపెద్దది. ప్రపంచంలోని బలమైన ఆర్ధిక వ్యవస్థలకు ఇదే వేదిక. ఈ వేదికలపై తీసుకొనే నిర్ణయాల చట్టబద్ధత సంగతి ఎలా ఉన్నప్పటికీ, యావత్తు ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తి ఈ గ్రూప్ కు ఉందన్నది వాస్తవం. వీటిల్లో బాగా ఎదిగిన దేశాలు, మనలాగే ఎదుగుతున్న దేశాలు కూడా ఉన్నాయి. అర్జెంటీనా నుంచి యూరోపియన్ యూనియన్ వరకూ ప్రముఖ దేశాలన్నీ సభ్య దేశాలుగా ఉన్నాయి. మిగిలిన దేశాల సంగతి అటుంచగా భారతదేశానికి ఈ వేదికపై ప్రత్యేక గౌరవం ఉంది. దాదాపు పాతికేళ్ళ నుంచి సాగుతున్న ఈ ప్రయాణంలో అనేక అంశాలపై చర్చలు జరుగుతూ ఉంటాయి. సదస్సులను నిర్వహిస్తూ ఉంటారు. వీటిల్లో ఆర్ధిక అంశాలు ప్రధానంగా ఉంటాయి. అనేక సమకాలీన అంశాలు కూడా చర్చల్లోకి వస్తూ ఉంటాయి. ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ మొదలైన సంస్థలు కూడా సదస్సుల్లో పాల్గొంటూ ఉంటాయి.

Also read: కె సీ ఆర్ జాతీయ విన్యాసం

పర్యావరణం, ఉగ్రవాదం చుట్టూ చర్చలు

పర్యావరణ మార్పులు, ఆరోగ్యం, ఉగ్రవాదం చుట్టూ కూడా చర్చలు సాగుతూ ఉంటాయి. ఈ దేశాలన్నీ కలిసి అంతర్జాతీయంగా కొన్ని నిబంధనలను ఏర్పరచుకుంటూ ఉంటాయి. ఆ నిబంధనలకు నూటికి నూరు పాళ్ళు కట్టుబడి ఉండే దేశాల్లో భారత్ ప్రథమ శ్రేణిలో ఉంటుంది. శాంతి, సుస్థిరత, ప్రజాస్వామ్యం విశ్వమంతా రాజ్యమేలాలని నినదించే రాజ్యాలలో మనం తొలివరుసలో ఉంటాం. ఈ క్రమంలో సాంకేతికతను అందిపుచ్చుకోవడం అత్యావశ్యకం. ప్రపంచంలో జరిగే మార్పుల పట్ల యువతను అవగాహనతో ఉంచడం కూడా కీలకం. ప్రజలను నిత్య చైతన్యవంతులను చేయడం ముఖ్యం. ప్రజల ఆర్ధిక, సామాజిక ప్రగతికి బలమైన మార్గాలను వేయడం అంతే ముఖ్యం. ఆహారం, ఇంధన భద్రత నుంచి అనేక అంశాల్లో స్థిరత్వాన్ని సాధించాల్సివుంది. కోవిడ్ దుష్ప్రభావాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి. రష్యా -ఉక్రెయిన్ మధ్య సాగిన యుద్ధం కూడా ప్రపంచ దేశాలను అనేక ఇబ్బందులకు గురిచేసింది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పర్యావరణం చాలా దెబ్బతిని ఉంది. చర్చలు, దౌత్యం ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదు. దీనికి చైనా ప్రవర్తన ఒక పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. ప్రపంచం ముందుకు సాగాలంటే అన్నింటి కంటే ముఖ్యమైనది ఐకమత్యం. స్వార్థకాంక్షతో రగిలి పోతున్న చైనా వంటి దేశాల వల్ల విభజన తప్ప, ఐక్యత సందేహాస్పదమవుతోంది. డబ్బున్నవాడు – పేదవాడి మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోతోంది. ఇది సామాజిక అశాంతికి దారితీసే పెను ప్రమాదం ఉంది. సమతుల్యత, సమభావం సాధించకపోతే ఇటువంటి వేదికలు ఎన్ని నిర్మాణమైనా, ఎన్ని సదస్సులు జరిగినా ప్రయోజనం సున్నా. “ప్రతిమనిషి మరియొకరిని దోచుకొనేవాడే – తన స్వార్థం తన సౌఖ్యం చూచుకొనేవాడే” అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు సార్వజనీనమై, నిత్యసత్యాలై విలసిల్లుతున్నాయని నేటి దేశాల తీరుతేన్నులే చాటి చెప్పుతున్నాయి.

Also read: కశ్మీరీ పహాడీలకు బహుమానం

మానవత్వం పరిమళించాలి

బాహ్యంగా పై నుంచి చూస్తే ఒకే గ్రూప్ లాగా కనిపించినా, వివిధ వేదికలపై ఈ దేశాలు వేరు కుంపట్లు పెట్టుకున్నాయి. వేరు వేరు గ్రూపులను ఏర్పాటు చేసుకున్నాయి. 1997 ప్రాంతంలో ఆసియాలో ఆర్ధిక సంక్షోభం వచ్చింది. ఆ సందర్భంలో ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలన్నీ కలిసి గ్రూప్ గా ఏర్పడాలని భావించి, ఈ గ్రూప్ ను నిర్మించుకున్నాయి. కోవిడ్ ప్రభావం, మరికొన్ని ఇతర పరిస్థితుల్లో అమెరికా వంటి అగ్రదేశానికి కూడా నేడు ఆర్ధికమాంద్యం భయం పట్టుకుంది. మిగిలిన దేశాల్లో కూడా ఈ వదంతులు వినిపిస్తున్నాయి. డాలర్ తో పోల్చుకుంటే మన రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. దీని నుంచి అత్యంత త్వరగా పైకి లేవాల్సిన చారిత్రక అవసరం ఉంది. తాజాగా ఇండోనేసియా రాజధాని జకార్తాలో జరిగిన జీ-20 సదస్సులో మన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేక ప్రసంగం చేశారు. ‘సమర్ధ పార్లమెంట్ – సచేతన ప్రజాస్వామ్యం’ అనే అంశాన్ని స్పృశిస్తూ ఆయన చేసిన ప్రసంగంలోనూ భారతదేశం పోషిస్తున్న ఆదర్శవంతమైన పాత్రను గుర్తుచేయడంతో పాటు, ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ తో యువత అనుసంధానాన్ని నొక్కి మరీ చెప్పారు. ఈ సదస్సులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తో పాటు భారత పార్లమెంట్ బృందం కూడా పాల్గొంది. మరిన్ని దేశాలను కలుపుకొని జీ -20 ని మరింత విస్తరించాలని ఈ దేశాలు అలోచిస్తున్నాయి. ఆలోచన మంచిదే. కాకపోతే మానవత్వం పరిమళి0చాల్సి ఉంది. అది ప్రతిధ్వనించిన్నప్పుడే ఈ గ్రూపుల ప్రయోజనం పూర్తిగా నెరవేరుతుంది.

Also read: పాదయాత్రలన్నీ జైత్రయాత్రలు కాగలవా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles