- టిబిజికెఎస్ అధ్యక్షులు వెంకట్రావు
యూనియన్ ఎన్నికల్లో తమదే విజయమని,సింగరేణిలో యూనియన్ గుర్తింపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము పోటీకి సిద్ధమే నని టిబిజికెఎస్ అధ్యక్షులు బి. వెంకట్రావు అన్నారు. ఆదివారం శ్రీరాంపూర్లో జరిగిన యూనియన్ అన్ని బ్రాంచీలకు చెందిన 850 మంది ప్రతినిధుల సమావేశంలో వెంకట్రావు మరోసారి ఏకగ్రీవంగా యూనియన్ కేంద్ర కమిటీ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శి గా తిరిగి మిర్యాల రాజిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా కార్యవర్గాన్ని యూనియన్ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తో సంప్రదించి ఎంపిక చేస్తామని యూనియన్ అధ్యక్షులు వెంకట్రావు ప్రకటించారు. కార్మికుల సమస్యలు ఎన్నో యూనియన్ ఆధ్వర్యంలో పరిష్కరించబడ్డాయని సీఎం కేసీఆర్ కు బొగ్గు గనుల కార్మికుల పైన ప్రత్యేకమైన ప్రేమ ఉంటుందని వెంకట్రావు అన్నారు. సంస్థ కార్మికుల ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత తమ పై ఉందన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ నీతి నిజాయితీ గా కార్మికులకు సేవలు అందించాలని సూచించారు. టిఆరెస్ సభ్యత్వం ను ప్రారంభించారు.
Also Read: వచ్చే నాలుగేళ్లలో 14 కొత్త గనులకు ప్రణాళికలు
ఎజెండా లేకున్నా ఎన్నికలు:
ఆదివారం జరిగిన సమావేశంలో ఎజెండా లేనప్పటికీ యూనియన్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఎన్నికలు వ్యూహాత్మకంగా జరిగాయి. కారణం ప్రతినిధులకు కూడా తెలియక కొందరు ఆందోళన చెందుతున్నారు. అయితే బైలా ప్రకారం ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో కార్మిక శాఖకు సంబంధించిన యూనియన్ వివరాలు ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిఉన్నందున ఎన్నిక నిర్వహించాల్సిన వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే బిఎమ్మెస్ నుంచి రాజీనామా చేసిన మాజీ టిబిజికెఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య చేరిక అనంతరం యూనియన్ అధ్యక్ష పదవి ఇస్తారనే భావన ఉండడంతో ఆయనకు పదవి దక్కకుండా చేయడానికే హడావిడిగా ఎన్నికల ఎజండా తెచ్చారని కూడా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా యూనియన్ లోని అంతర్గత గ్రూపుల వ్యవహారం కూడా ఆదివారం సమావేశంలో కనిపించింది. మొత్తానికి వెంకట్రావు తన వ్యూహాన్ని ప్రదర్శించి ఆధిపత్యాన్ని యూనియన్ లో నిలబెట్టుకోవడం విశేషం. యూనియన్ కార్యకలాపాల్లో50 ఏండ్ల అనుభవం ఉన్న 81ఏండ్ల వెంకట్రావు ఇంకా కార్మిక రంగంలో యాక్టివ్ గా కొనసాగడం విశేషం. అరేండ్లు ఎమ్మెల్సీ గా కూడా వెంకట్రావు గతంలో పనిచేశారు. ఏఐసీసీ సభ్యుడిగా, వేజ్ బోర్డు సభ్యుడిగాపని చేసిన అనుభవం ఉంది.
Also Read: సింగరేణిలో రాజకీయాలు