మనిషి మనుగడకు అవసరం ధర్మం
దాన్ని ప్రసాదించేది మతం
ఏ మనిషి మరో మనిషికి
ఐడెంటికల్లీ ఈక్వల్ టు కాదు
అందుకనే ఇన్ని మతాలు
వాటి ఆచారాలు, పూజలు
వాటి కోసం ఎన్నో ఎత్తుగడలు
యుద్ధాలు, రాజకీయాలు.
ఆది మానవుడు రక్షణకోసం
సంఘజీవిగా మారాడు
నేటి మానవుడు సంఘానికి
కుల, మత, ప్రాంత, భాష, రంగు
భేదాలేర్పరచి మనుషులను,
మనసులను విడగొట్టేస్తున్నాడు
తన రక్షణ సంగతి మరచి
ఆధిపత్య పోరాటంకోసం
సంఘాలు ఏర్పరుస్తున్నాడు
సంఘ ప్రాబల్యం కోసం
ఆలోచనా శక్తిని పూడ్చిపెట్టి
ఒక చేత కత్తి
మరోచేత కరెన్సీ పట్టి
బయలు దేరాడు
తన ప్రపంచ సామ్రాజ్యం
స్థాపించడానికి
జగజ్జేతలు కావాలని
కలలు కన్నవాళ్ళు
కనుమూసి తెరిచేలోగా
మట్టిలో కలిసి పోయారు
చరిత్రను తిరుగరాసే ఆశతో
చరిత్ర హీనులై పోయారు.
దేవుడికి, మంచికి, మానవత్వానికి
దగ్గర చేసేది మతమనే గ్రహింపు
ఈ ‘ప్రగతిశీల‘ జగతికి
ఏనాటికైనా కలిగేనా
కలతలులేని కల్లలులేని
మానవతా రాజ్యం
మనం తెచ్చుకోగలమా
అన్ని మతాల్లో ఉన్న
మానవ కల్యాణ ఆశయాన్ని
ఏనాటికైనా చేరగలమా
మతం అసలు ఉద్దేశమైన
దైవత్వానికి దగ్గరయ్యే ఆశని
నెరవేర్చుకో గలమా?!!
Also read: స్త్రీ
Also read: ఆత్మావలోకనం
Also read: చదువు
Also read: దేవాంతకులు
Also read: పెంపకం