Thursday, November 21, 2024

మన మనసును నిర్మించేది మనం తినే ఆహారమే

గోదాదేవి 14వ పాశురంలో మన తినే ఆహారం, వేసుకునే వస్త్రాలు మనను ఏవిధంగా తీర్చిదిద్దుతాయో, వాటిని ఏ విధంగా మార్చుకోవాలో వివరిస్తున్నారు. శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు, శ్రీమాన్ కందాడై రామానుజాచార్యవర్యులు ఈపాశురంలో అంతరార్థాలను, విశేషాలను అద్భుతంగా విశ్లేషించి చెప్పారు.

Also read: లక్ష్మణుడు యోగి, భరతుడు ముని

శరీరమే పురము

ఈ శరీరమనే పురము లేదా తోటలో నాడీమండలము చైతన్యప్రసరణమార్గమనీ. ఈ నాడీమండలము వెన్నుపూసలో ఉంటుందనీ, అక్కడి దిగుడు బావి లో తామరపూవులున్నాయనీ చెప్పారు. తామరపూలంటే నాడీ చక్రములు- మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము విశుద్ధము, ఆజ్ఞాచక్రము, సహస్రారము ఇవన్నీ శరీరంలో ఉటాయి. కలువలంటే అంటే ఇంద్రియములనీ అవి ముడుచుకున్నాయనీ వివరించారు.

Also read: అందరినీ వర్షంతో కరుణించే కరిమబ్బు- క్రిష్ణయ్య

అష్టాక్షరీ మంత్రమే తోట

మరో వివరణ ప్రకారం అష్టాక్షరీ మంత్రం విహరించే తోట. ఇందులో విహరిస్తే జీవుడికి ఆనందం కలుగుతుంది.  మధ్యలో ఉన్నమెట్లున్నదిగుడుబావి నమః అనేది. నన్ను నేనే రక్షించుకోగలను అనే స్వతంత్ర భావన అనే అజ్ఞానాన్ని బావి కడిగివేస్తుంది. అందుక ప్రతీక కలువపూవుముడుచుకొనిపోవడం. రక్షించేది భగవంతుడే అనే పరతంత్రభావనకు ప్రతీక అయిన తామరపూవు సూర్యోదయం వల్ల వికసించింది. తెల్లవారడమంటే జ్ఞానం కలగడమే.

Also read: నవరత్నభవనం అంటే నవద్వార శరీరమే

కోరికలులేని మనసు

కోరికలమీద మనసులేకుండా వైరాగ్యం సూచించేది కాషాయ వస్త్రధారణ. కుంచెకోల అంటే ఆలయద్వారాలు తెరిచే తాళం చెవులు. ఆలయాలను వైరాగ్యభావనలున్న సన్యాసులు యతులే నిర్వహించేవారు. వారయితే భోగాలు వదులుకుని పరమాత్మయందు రక్తి కలిగి ఉంటారు.  కోరికలతో కూడిన మనసుకు జేగురురంగు సంకేతం. భగవంతుడిపట్ల విముఖమైన మనసు రాయివంటిది. ఆ జేగురు రాళ్లు లేదా జాజు రాళ్లు, ఆ రాళ్లను నుగ్గు చేయడం నీటిలో కలపడం అంటే కోరికలు పొడిచేసి, భగవంతుడిపట్ల ప్రేమను కలపడం. ఈ భావనలకు మనసే ప్రధానం కనుక దాన్ని శుద్ధి చేసుకోవడమని భావం.పరిశుద్ధమైన శాకాహారం తీసుకుంటేనే మనసు సాత్వికంగా తయారవుతుంది. సత్వ గుణంలోనో భక్తి పుడుతుంది. తీసుకునే ఆహారాన్ని బట్టి సత్వ, రజ, తమో గుణాలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. తాంబూలాలు వేసుకోవడం, తినగూడనవి తినకుండా ఉంటే దంతాలు తెల్లగా ఉంటాయి. భగవంతుడిని భావించే సాధనం మనసే కనుక ఆ మనసు తినే పదార్థంతో ఏర్పడుతుంది కనుక ఆహార తత్వాన్ని బట్టి మనస్తత్వం మారుతూ ఉంటుంది. మనం తిన్న ఘన పదార్థంలో నిస్సారమైంది మలరూపంలో వెళ్లిపోతుంది. సారతరమయిన పదార్థం రక్తమాంస ధాతువులై మనసుగా తయారవుతుంది. సత్వ గుణప్రధానమైన ఆహారం తీసుకుంటే మనసుకూడా అదేవిధంగా మారుతుంది.తెల్లని పలువరుస ఆహార శుద్ధిని వాక్ శుద్ధినీ సూచిస్తుంది.

Also read: అహంకార, కామ క్రోధాలే రాక్షసులు

జ్ఞాన ముద్ర

ఇక్కడ నమ్మళ్వార్ ఉపదేశ లేదా జ్ఞానముద్రతో ఉన్నారు. కుంచెకోలవలె ఉంటుంది.కుంచెకోల ఆలయపు తాళపు చెవి అని ఒక అర్థం అయితే, ఆచార్యపరంగా చూస్తే అది ఉపదేశ ముద్ర అవుతుంది. అది హృదయద్వారాన్ని తెరిచే తాళం చెవి. శంఖం అంటే ప్రణవం, చక్రమంటే సుదర్శనము, భగవంతుడిని చక్కగా చూపేది. కుంచెకోల అంటే ఆచార్యజ్ఞాన ముద్ర. జ్ఞాన ముద్ర అంటే చూపుడు వేలు బొటనవేలుతో చేర్చి, మూడు వేళ్లు దూరముగా ఉంచడం. బొటన వేలు భగవంతుడు. చూపుడు వేలు అంటే జీవుడు. మూడువేళ్లు అంటే గుణత్రయం-సత్వ, రజ, తమోగుణాలు. ఈ మూడుగుణాలు దూరమైతేనే జీవుడు భగవంతుడిని చేరుకుంటాడని చెప్పడమే జ్ఞాన ముద్రలోని సందేశం. శంఖ చక్రములను భుజాలపైన దాల్చిన ఆచార్యులే మనకు ఆశ్రయించదగిన వారు అని కందాడై రామానుజాచార్య వివరించారు.వైరాగ్యం కలిగిన శిష్యులకు యతులు ఉపదేశించడమే కుంచెకోల.

Also read: లేవమ్మా గోపికా, గోవిందుని సేవిద్దాం రావమ్మా

మాటనేర్పు

తనకు కలిగిన భగవదనుభవమును దాచుకొనకుండా చెప్పడమే సిగ్గులేకుండా ఉండడం. సిగ్గులేదంటే బెరుకు లేదని అర్థం. వ్యతిరేకార్థం ఏదీ లేదు. పరిపూర్ణత సాధించి శిష్యులకు మనోరంజకంగా చెప్పడమే మాటనేర్పు.

శంఖచక్రధారి

శంఖ చక్రధరుడైన శ్రీ కృష్ణుడిని గోపికలు కీర్తిస్తున్నారు. ‘‘పుట్టే యపుడే చతుర్భుజాలు శంఖు చక్రాలు ఎట్టు ధరియించెనే ఈ కృష్ణుడూ’’ అని అన్నమయ్య వర్ణిస్తాడు.శ్రీకృష్ణుడు చతుర్భుజాలతో శంఖ చక్రాలతో జన్మిస్తే ఆశ్చర్యపోయి చూసిన దేవకీ వసుదేవులు, శత్రువులు ఎక్కడ గమనిస్తారో అని ఆందోళన పడితే, వాటిని మరుగు పరుస్తాడు. అయితే ఆతరువాత యశోదకు, ప్రియమైన గోపికలకు కూడా ఆయన చతుర్భుజాలతో కనిపించేవాడట. శంఖమంటే గోపికలకు చాలా ఇష్టం. శంఖం ఎప్పుడూ శ్రీకృష్ణుడి చేతిలోనే ఉంటుంది. పూరించినపుడు అధరాలను తాకుతూ ఉంటుంది. అతను ఊదే గాలితో పలుకుతూ ఉంటుంది. అదే విధంగా గోపికలు కూడా శ్రీకృష్ణ హస్త, అధర సంస్పర్శనము కోరుకుంటూ ఉంటారట. శంఖము ప్రణవస్వరూపము. దూరంగా ఉన్నవారికి కూడా శంఖ నాదంతో తాను అక్కడ ఉన్నట్టు తెలియజేస్తాడు. ఆవుల మంద వదిలి దూరంగా పోయిన ఆవులను శంఖ నాదంతో పిలుస్తాడు. దూరమైన జీవులను దరిచేర్చేది శంఖమే. విరోధులకు గుండెలదిరేట్టు చేసి దూరం చేసేదీ శంఖమే. విష్ణోర్ముఖోత్థానిల పూరితస్యయస్యధ్వనిర్దానవ దర్పహంతాం, తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే అని వేదాంత దేశికులు కీర్తిస్తారు.

Also read: గుఱ్ఱం నోట్లో చేతిని ఉబ్బించి కేశిని చంపిన కేశవుడు

ఇక చక్రంగురించి. దీనికి సుదర్శనమని పేరు అంటే పరమాత్ముడిని బాగుగా దర్శనము చేయించేది. ఆయన సంకల్పిస్తే చాలు దూరంగా వెళ్లి శత్రువులను దునుమాడి తిరిగి వస్తుంది. దూరం ఉన్న ఆప్తులను దరికి రప్పించేశంఖాన్ని, దూరాన ఉన్న శత్రువులను తరిమి కొట్టే చక్రాన్ని, ఆ శంఖ చక్రాలను ధరించిన బాహుయుగళం గల వాడిని ప్రేమిస్తున్నారు గోపికలు. దూరంనుంచే దరిజేర్చి ఉద్ధరించి, ఆలింగనం చేసుకునే దీర్ఘబాహువులు కలిగిన ఆజానుబాహుడిని, చూడగానే కన్నులతోకనికరించి ఊరట కలిగించే ప్రసన్న నేత్రుడైన పుండరీకాక్షుడిని కీర్తిస్తున్నారు.లోపలగోపబాలిక గొప్ప ప్రామాణికురాలు మంచిగా మాట్లాడగలదు కూడా, అందుకే ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడు తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చు అని ఈ గోప బాలికను కూడా గోదమ్మ మేలుకొలుపుతున్నారు.

14 Bapu bommalu ideas | indian art, indian paintings, indian art paintings

బాపురేఖావ్యాఖ్య

బాపు బొమ్మ ఒక అద్భుతమైన రేఖా వ్యాఖ్యలో మనకు తిరుప్పావై 14 వ పాశురపు భావార్థం కనిపిస్తుంది. పెరటి మడుగులో కమలాలు విరిసాయి. నల్లకలువలేమో ముకుళించాయి. యోగులు పొద్దున్నే లేచి దేవాలయాలను తెరవడానికి తాళాలు తీసుకుని వెళుతున్నారట. వారి దంతధవళ శోభన కాంతులగురించి గోద ప్రస్తావించింది. కుంచెకోల పట్టుకుని జాజిరంగుతో అద్దిన కాషాయ రంగు వస్త్రాలు కట్టుకుని అర్చకులుబయలు దేరారు. అటు గోపికలు, ఇటు యోగులు మునులు గోపబాలుడిని కీర్తిస్తున్నారు. తామరలలో బాలుడై కాలి బొటనవేలితో ఆడుకుంటున్నవటపత్రశాయిని పూజిస్తున్నారు. గోపికల కన్నుల వెలుగులు, మునుల పన్నుల తెలుపు కలిసి తెల్లారిందనీ గోపికలు మునులు శ్రీకృష్ణానుభవంలో ఉన్నారని బాపు వివరిస్తున్నారు. మాడభూషి శ్రీధర్

Also read: మనసున నమ్మిన వారి గావ మరుగుజ్జుగా దిగి వచ్చినాడు

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles