సంపద సృష్టిద్దాం- 13
రాబర్ట్ టి. కియొసాకి పేరు విన్నారా? ఆర్థిక పాఠాలు నేర్పే గురువులలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ‘‘రిచ్ డాడ్ – పూర్ డాడ్’’ పుస్తకంతో తనను తాను ఈ ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు తానేం రాసినా చాలా ఏళ్లపాటు ప్రపంచమంతా దాని గురించే మాట్లాడుకుంటుంది. తానేం ఉపన్యసించినా చాలా నెలలపాటు వాటి గురించే యువతరం కబుర్లు చెప్పుకుంటుంది. కాలంకంటే ముందుండి ఆర్థిక విషయాలలో సరికొత్త అవగాహన కలిగిస్తున్న దార్శనికుడు. ఆయన ఏం చెప్తాడంటే, ‘‘మీ ఆర్థిక పరిస్థితులను మీ అధీనంలోకి తీసుకుని రండి. లేదా జీవితాంతం ఇంకొకరి ఆదేశాలను అమలు చెయ్యటానికి సిద్ధపడండి. డబ్బుకు మీరు యజమానిగానైనా ఉండగలరు. లేదా దానికి బానిస కాగలరు. అది ఎంచుకోవటం మీ ఇష్టం’’.
Also read: సమయానికి వేద్దాం కళ్లెం
ఒక యుగంలో చెలామణిలో ఉన్న కొన్ని మాటలు, ఆ యుగం మారాక కూడా చలామణీలో ఉండిపోతున్నాయని కియోసాకి బాధపడుతున్నారు. ఉదాహరణకు పారిశ్రామిక యుగంలో బాగా పాపులర్ అయిన డైలాగ్ ఇది. ‘‘స్కూలుకు వెళ్లు. బాగా చదువుకో. మంచి మార్కులు తెచ్చుకో. అప్పుడే నీకు సురక్షితమైన ఉద్యోగం దొరుకుతుంది. ఎంతో ఎక్కువ జీతం నీకు ఇస్తారు. వేరే లాభాలు కూడా ఉంటాయి. ఆ తరువాత నీ ఉద్యోగమే నిన్ను అన్ని విధాలా ఆదుకుంటుంది’’. పారిశ్రామిక యుగం వెళ్లిపోయి ఇప్పుడు మనం సాంకేతిక విప్లవ యుగంలో ఉన్నాం. ఈ 21వ శతాబ్దపు నియమాలు మారిపోయాయి. అయినా ఇప్పటికీ చాలా ఇళ్లల్లో ఆ పాత డైలాగే పిల్లలకు చెప్తుంటారు. మీతో చాలామంది ఆ మాటలు చెప్పే ఉంటారు. మీరు కూడా ఆ మాటలు వాడే ఉంటారు కదా. మరి కాలం మారిపోయినా, ఇంకా పాత డైలాగులు ఎందుకు కొడుతున్నాం అంటే ఆర్థిక విషయాలపై అవగాహన లేకపోవడం వల్లనే.
Also reaed: బకెట్లు మోసే ప్రపంచం
పదవీ విరమణ ప్రయోజనాలు
రాజులు సొంతంగా వ్యవసాయం చేయలేక, రైతుల చేత వ్యవసాయం చేయిస్తూ, పంటలో ఎంతో కొంత ఇమ్మనేవారు. ఇక్కడ రైతులు ఉద్యోగులు కారన్న సంగతి గమనించండి. నెలనెలా రాజునుంచి జీతం అందుకోవడం లేదు. జీతం తీసుకోకపోగా, తిరిగి రాజుకే శిస్తుల రూపంలో ఎంతో కొంత ముట్టజెప్పేవారు. వ్యవసాయం ఒక గొప్ప ఉపాధిగా పరిఢవిల్లిన సమయం అది. వ్యవసాయంతో పాటు దాని అనుబంధ కార్యకలాపాలలో గ్రామమంతా ఉపాధి పొందిన రోజులవి. కాని, పారిశ్రామిక యుగం మొదలయ్యాక పరిస్థితి తిరగబడిరది. యంత్రాల దగ్గర పనివారు లేనప్పుడు, కార్యాలయాలలో ఉద్యోగులు కరువైనప్పుడు.. వారిని నియమించడానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేయాల్సివచ్చింది. విద్యావిధానాన్ని మార్చింది. పని వేళలను సైతం ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. తరువాత వారానికి ఆరు రోజుల పని, ఆనక ఐదు రోజుల పని వంటి మినహాయింపులు ఇవ్వడం మొదలైంది.
Also read: పైప్ లైన్ నిర్మిద్దాం!
1889లో ప్రష్యా దేశపు అధ్యక్షుడు ఓట్టోవాన్ బిస్మార్క్ తొలిసారి రిటైర్మెంట్ పథకం ప్రవేశపెట్టాడు. ఆయన తన ప్రభుత్వంలో ఉద్యోగులకు అరవై ఏళ్లకు కాదు, 70 ఏళ్లకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఉద్యోగి మరణించేవరకు ఫించను అందించాడు. ఎందుకంటే అప్పుడు ప్రష్యాలో పురుషుల సగటు జీవితకాలం 45 ఏళ్లు. (ఇప్పుడు మన జీవన ప్రమాణం 90 ఏళ్లు పెరిగాక కూడా పెన్షన్ పథకాలను ఉద్యోగులు కోరుకోవడం కేవలం ఆ ప్రభుత్వాలను దివాళా తీయించడానికే!) ఇది బాగా పాపులర్ అయింది. దేశదేశాలకు పాకింది. ప్రష్యన్ విద్యావిధానం కేవలం సైనికులు, ఉద్యోగులను తయారుచేయడమే. సైనికులు, ఉద్యోగుల పని ప్రభుత్వం చెప్పినట్టు చేయడమే. అంటే పైవారి ఆదేశాలను అనుసరించడమే. తదనంతర కాలంలో ఉద్యోగ జీవితానికి కాలక్రమంలో గొప్ప క్రేజ్ ఏర్పడింది. కాని ఇప్పుడు సాంకేతిక సమాచార విప్లవయుగంలో మారిన నియమాలను దృష్టిలో పెట్టుకుని కొత్తగా మనం ఏమైనా నేర్చుకుని ఆచరణలోకి దిగితే ఫరవాలేదు. లేదంటే మనం కూడా అందరిలాగే మన సమయాన్ని డబ్బుకు అమ్ముకోవడంతోనే సరిపోతుంది. అవాంతరాలు వస్తే భరించలేని అసౌకర్యానికి గురవుతాం.
Also read: తలపోతల వలబోతలు
అడుగు – నమ్ము – పొందు
మనకు ఆదాయం ఎలా సమకూరుతుందో తెలుసుకోవడానికి క్యాష్‌ఫ్లో క్వాడ్రెంట్ సహకరిస్తుంది. ఇందులో నాలుగు భాగాలుంటాయి. ఇ, ఎస్, బి మరియు ఐ అనే విభాగాలు. మనమందరమూ ఈ నాలిగింటిలో ఏదో ఒక విభాగానికి చెందుతాం. ఇ అంటే ఎంప్లాయీ అనగా ఉద్యోగి, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీ అంటే స్వయం ఉపాధిపై ఆధారపడిన చిన్న వ్యాపారి, బి అంటే బిజినెస్ ఓనర్ (వ్యాపారవేత్త), ఐ అంటే ఇన్వెస్టర్ (పెట్టుబడిదారుడు). వీటి గురించి సమగ్రంగా తెలుసుకోవడం మాత్రమే కాదు, ఇందులో మనం ఏ విభాగంలో ఉన్నామో స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి మనస్తత్వానికి అనుగుణంగా ఏదో ఒక విభాగంలో స్థిరపడతాం. ఏ విభాగంలో మనకు ఊపిరాడదో, నిలవలేమో అప్పుడు కొంత ప్రయత్నం చేసి మరో విభాగంలోకి మారిపోతాం. కాబట్టి కోటీశ్వరులు కావాలనుకునే సాహసవీరులంతా ముందుగా తాము ఏ విభాగంలో ఉన్నామో తెలుసుకోవాలి. ఏ విభాగంలో చేరితే లక్షలు దాటి కోట్ల రూపాయలు సంపాదించగలమో అర్థం చేసుకోవాలి. ఆర్థిక స్వేచ్ఛ పొందడానికి ఏ విభాగం మనకు సాయపడగలదో నేర్చుకుని, చక్కటి కృషి చేయడంద్వారా ఆ విభాగంలోకి చేరుకోవాలి.
మనలో అత్యధిక శాతం జనాభా పూర్తిగా ఇ క్వాడ్రెంట్‌లోనే ఉంటారు. అక్కడే నేర్చుకుంటారు, నివసిస్తారు, ప్రేమిస్తారు, చివరకు జీవితాన్ని చాలిస్తారు. పుట్టిననుంచి గిట్టిన దాకా మన విద్యావ్యవస్థ, సమాజం ప్రతి ఒక్కరికీ ఉగ్గుపాలతో ఇ క్వాడ్రెంట్ ప్రపంచంలో ఎలా నివశించాలో శిక్షణనిస్తాయి. సాధారణంగా ఇ క్వాడ్రెంట్‌లో ఉన్న ప్రజలు ఇలా ఆలోచిస్తారు. ‘‘నేనో సురక్షితమైన, భద్రతగల ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. దానిలో మంచి జీతంతో పాటు, ప్రశస్తమైన ప్రయోజనాలు కూడా ఉండాలి.’’ అంతే కాకుండా వారికి ఎవరైనా సొంతంగా వ్యాపారం మొదలు పెడతామని చెప్పగానే అందులో ఎంతో రిస్క్ ఉంది కదా అంటారు. వారి జీవితంలో ‘భద్రత’ చాలా ప్రధానమైన విలువ.
తప్పక చేయండి: బ్యాంకు అకౌంట్‌లో మీ క్రెడిట్ స్కోర్ అకస్మాత్తుగా పెరగాలంటే క్రెడిట్‌కార్డు ద్వారా ఒక యాభైవేల రూపాయలు వస్తువు కొనుగోలు చేసి ఆరు నెలల్లో తీర్చేయండి. లేదా చిన్న మొత్తంలో పర్సనల్ లోన్ తీసుకుని ఎలాంటి నాగాలు లేకుండా ఆరు నెలల్లో లోన్ క్లియర్ చేసేయండి. ఒక్కసారి క్రెడిట్ స్కోరులో గణనీయమైన మార్చు చూడగలరు. కాని మన సంపద సృష్టి సబ్జెక్టులో క్రెడిట్ కార్డు వాడకూడదు.
Also read: విధాతలు మీరే!
–దుప్పల రవికుమార్