గాంధీయే మార్గం -7
06 ఏప్రిల్ 1930. ఉదయం 6 గంటల 30 నిమిషాలు. 61 సంవత్సరాల వృద్ధుడైన నాయకుడు తన సహచరులతో వచ్చి ఉప్పును తయారు చేశారు. ఆ నాయకుడే గాంధీజీ! అలా ఉప్పు సత్యాగ్రహానికి రంగస్థలం అయిన ప్రాంతం గుజరాత్ తీరంలోని దండి. తొమ్మిది దశాబ్దాల క్రితం జరిగిన ఈ సంఘటన అప్పటి బ్రిటీషు పాలకుల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఉద్యమం కారణంగా భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.
Also read: అవును… నేడు గాంధీయే మార్గం!
వ్యూహంలో చాతుర్యం:
గాంధీజీ వేషభాషలు చాలా మామూలుగా కనబడతాయి. ఇంగ్లండు చదువు గానీ, దక్షిణాఫ్రికా అనుభవం గానీ ఆయనకు ఉన్నట్టు మాటలు, దుస్తుల ద్వారా అంచనా వేయలేం. ఆయన ఇతరుల దృష్టికి దొరకని వ్యూహాలు అల్లగల రాజకీయ చతురుడు. ఈ దండి సత్యాగ్రహం భావనలో రెండు అంశాలు మనం గమనించవచ్చు. ఒకటి ఉప్పు, రెండవది నడక.
గాలి, నీరు తరవాత ముఖ్యమైనది ఉప్పు అని గాంధీజీ దండి సత్యాగ్రహం గురించి వివరిస్తూ పేర్కొన్నారు. అప్పటి బ్రిటీష్ వారు భారతీయుల నుంచి వసూలు చేసే పన్నుల్లో ఉప్పు పన్ను 8.2 శాతం ఆక్రమించేది. నిజానికి సుదీర్ఘమైన సముద్రతీరంగల ఈ దేశంలో ఉప్పు వద్దన్నా లభిస్తుంది. ఎందుకంటే మనకు సూర్యరశ్మి కూడా కొరత కాదు.
Also read: రాగద్వేష రహితమైన, వివేకం గల విజ్ఞాన దృష్టి
అయితే బ్రిటీష్ వాళ్ళు తమకనుకూలంగా ఉప్పు తయారీని నిషేధిస్తూ చట్టాలు చేశారు. ఈ ఉప్పు పన్ను ధనికుల కన్నా పేదవారినే ఎక్కువ బాధించేది. అంత వ్యూహాత్మకంగా దేశంలోని పేదలను కదిలించే ఉప్పును గాంధీజీ తన ఉద్యమానికి ఒక ప్రతీకగా స్వీకరించడం అమోఘమైన పాచిక.
గాంధీజీ చంపారణ్య ఉద్యమ సమయంలో ఏనుగునెక్కి కూడా ప్రయాణం చేస్తాడు. దండి సత్యాగ్రహానికి బండ్లు, కార్లు కాకుండా కేవలం నడిచే కార్యక్రమంగా ఆయన మలిచాడు. సబర్మతీ ఆశ్రమానికి దగ్గరలో వుండే ఏదో ఒక తీర ప్రాంతాన్ని కాకుండా 200 మైళ్ళ దూరంలో వుండే నౌసరి (దండికి అప్పటి పేరు) ని ఎంచుకోవడం కూడా గాంధీ ప్రతిభావంతమైన ప్రణాళిక.
Also read: గాంధీజీ సార్వత్రికత ఏమిటి?
12 మార్చి 1930వ తేదీన 78 మంది అనుచరులతో 24 రోజుల పాటు నడుస్తూ మధ్యమధ్యన ప్రతి రోజూ ఒక ఊరిలో ఆగుతూ సాగడం అప్పటికి చాలా కొత్త వింతగా కనబడింది. మిగతా జాతీయ నాయకులు ఇదేమి వ్యూహమని పరాచికాలు ఆడగా బ్రిటీష్ పాలకులు 6 పదులు దాటిన ముదుసలి ఏమి నడుస్తాడులే అని తమలో తాము నవ్వుకున్నారు.
ఈ రెండు వర్గాల అంచనాలను వమ్ము చేస్తూ దండి సత్యాగ్రహం గొప్పగా విజయవంతం కావడమే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమందికి ప్రేరణ ఇచ్చింది.
Also read: గాంధీజీ అవసరం నేడు ఎక్కడెక్కడ?
యువకులకు పెద్ద పీట:
గాంధీతోపాటు 200 మైళ్ళు నడచిన 78 మంది వివరాలు పరిశీలిస్తే అందులో 40-50 సంవత్సరాల వయసున్నవాళ్ళు 6 గురు మాత్రమే వుండగా… 60 దాటినవాడు ఒక్క గాంధీజీయే. ఈ బృందంలో ఎక్కువ మంది 20-25 మధ్య వయసున్న యువకులే కావడం విశేషం.
నిజానికి చాలా జాగ్రత్తగా గాంధీజీ ఈ 78 మందిని ఎంపిక చేసుకున్నారు. వీరిలో ఒకే ఒక తెలుగు వ్యక్తి 25 సంవత్సరాల ఎర్నేని సుబ్రహ్మణ్యం. వీరే తరువాతి దశలో పొట్టి శ్రీరాములుకు మిత్రుడిగా, గురువుగా కొనసాగారు.
భారతదేశపు స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలక సంఘటనలు సహాయ నిరాకరణ, శాసనోల్లంఘనం వంటివి ఉవ్వెత్తున మొదలయినా చౌరీచౌరాలో జరిగిన అల్లర్లు కారణంగా గాంధీ తన వ్యూహాన్ని మార్చేశారు. తరువాత మనకు కనబడే ప్రధాన సంఘటన దండి సత్యాగ్రహమే. ఈ మధ్యకాలంలో గాంధీజీ జైలులో ఉన్నా… వ్యూహం పకడ్బందీగా సాగింది.
సంఘటనలకు స్పందనగా ఎలా వ్యక్తులు తమను తాము మలచుకోవాలో సత్యాగ్రహ శిక్షణ కూడా ఏర్పాటు చేశారు. అటువంటి వినూత్న శిక్షణకు రాజమండ్రి దగ్గర వున్న సత్యాగ్రహ ఆశ్రమం కేంద్రం కావడం తెలుగువారందరికీ గర్వకారణం.
Also read: అద్భుతమైన వ్యక్తిత్వం కస్తూర్బా సొంతం
దండి సత్యాగ్రహం ప్రభావం:
06 ఏప్రిల్ 1930న గాంధీజీ తన సహచరులతో కలసి ఉప్పును తయారు చేసి, బ్రిటీష్ శాసనాన్ని ఉల్లంఘించారు. అలా గాంధీ తయారు చేసిన ఉప్పు గడ్డను తరువాత వేలం వేయడం ఒక చారిత్రక విశేషం.
గాంధీజీ ఉప్పు తయారు చేసిన సమయంలో తెలుగింటి కోడలైన సరోజినీనాయుడు చట్టాన్ని గాంధీజీ అతిక్రమించారని బిగ్గరగా ప్రకటించడం ఇంకో విశేషం.
కమలాదేవి ఛటోపాధ్యాయ,”స్వాతంత్ర్యం ఉప్పును కొంటారా” అని బొంబాయిలో మెజిస్ట్రేట్ ను అడగడం మరో ఆశ్చర్యకరమైన అంశం.
ఈ రీతిలో దేశవ్యాప్తంగా ఉప్పు స్వతంత్రపు ఉద్యమానికి నిప్పు రవ్వగా పనిచేసింది.
1930 ఫిబ్రవరి 27న ‘యంగ్ ఇండియా’ పత్రికలో ‘నేను అరెస్టయితే’ అనే శీర్షికతో గాంధీజీ ఒక సంపాదకీయాన్ని రాస్తూ ఉప్పు పన్ను దుష్ప్రభావాన్ని వివరించారు. అదే సంవత్సరం మార్చి రెండవ తేదీ గాంధీజీ వైస్రాయ్ కి సుదీర్ఘమైన ఉత్తరంగా తన వాదనను వినిపిస్తూ ఈ పన్ను ద్వారా పేదలను ఏ స్థాయిలో పీడిస్తున్నారో తెలియజేసారు. ఒక వేళ మీరు సానుకూలంగా స్పందించక పోతే 11వ రోజున సబర్మతీ ఆశ్రమం నుంచి బయలుదేరి ఉప్పు పన్ను చట్టాన్ని అతిక్రమిస్తానని హెచ్చరిక కూడా జారీ చేశారు.
ఏప్రిల్ 6వ తేదీన చూసీచూడనట్టున్న బ్రిటీష్ ప్రభుత్వం అప్రమత్తమై మే 5వ తేదీన గాంధీజీని అరెస్టు చేసింది. దేశ వ్యాప్తంగా ఎంతోమందిని అరెస్టు చెయ్యక తప్పలేదు.
ప్రపంచవ్యాప్త స్ఫూర్తి :
శాంతియుతంగా నిరసన తెలిపే విధానం (సత్యాగ్రహం) ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది. గాంధీజీ దండి సత్యాగ్రహం నడకను చిత్రించిన దృశ్యాలు యూరోపును అమెరికాను విపరీతంగా ఆకర్షించాయి.
ఈ సత్యాగ్రహం జరుగుతున్న సమయంలో ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ప్రతి రోజూ వార్తలు ప్రచురించటమే కాకుండా ఏప్రిల్ 6, 7 తేదీలలో తొలి పేజీ కథనాలను ప్రచురించింది. 1930 సంవత్సరం ‘మేన్ ఆఫ్ ది ఇయర్’ గా గాంధీజీని ‘టైమ్’ మాగజైన్ ఎంపిక చేయడం విశేషం.
ఉప్పు పన్ను సంబంధించి సామాజిక ఆర్థికపరమైన పార్శ్వాలను వివరించే రీతిలో రామమనోహర్ లోహియా దండి ఉద్యమం జరిగిన మూడేళ్ళలో పిహెచ్.డి పట్టాను గడించడం ఇంకో విశేషం.
దండి ఉద్యమం జరిగిన మూడు దశాబ్దాల తరువాత అమెరికాలో నల్లజాతి వారికి వెలుగు చుక్కానిగా మారింది. ఆ ఉద్యమానికి నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఈ అమెరికా ఉద్యమం గురించి మార్టిన్ లూథర్ కింగ్ వివరిస్తూ తొలుత తాను గాంధీజీని సీరియస్ గా పట్టించుకోలేదని, అయితే ఉప్పు సత్యాగ్రహం, ఆయన నిరాహార దీక్షలు, సత్యాగ్రహ భావన తనను ఆకర్షించాయని తరువాత గాంధీజీ సిద్ధాంతాలను లోతుగా అన్వేషించడం మొదలైందని, చివరకు గాంధీజీ పట్ల, ఆయన ఉద్యమంపట్ల ఆరాధనగా మారిందని, అదే తన ఉద్యమాన్ని నడిపించిందని విశ్లేషించడం గమనార్హం!
దండి సత్యాగ్రహానికి 75 ఏళ్ళ పండగ :
1980లో స్వర్ణోత్సవం, 2005లో 75 ఏళ్ళ పండుగ జరిగాయి. ఈ రెండు సందర్భాలలో భారత ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్ళలను విడుదల చేసింది.
మహాత్మాగాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ 2005లో చేసిన ‘రిఎనాక్టిమెంట్’ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా వార్తలకెక్కింది. 9 దేశాల నుంచి 900 మందితో ప్రారంభమైన ఈ తుషార్ గాంధీ బృందం అప్పటి దండి సత్యాగ్రహం దారిలోనే కదిలితే రోజు రోజుకూ కొత్తవారు వచ్చి చేరడంతో ఆ సంఖ్య కొన్ని వేలుగా పెరిగింది. దీనిని న్యాయం, స్వాతంత్ర్యం కోసం చేసిన అంతర్జాతీయ నడక అని నామకరణం చేశారు.
07 ఏప్రిల్ 2005వ తేదీన జరిగిన ముగింపు ఉత్సవంలో అప్పటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ఈ నడకలో పాల్గొన్న వారినందరినీ అభినందించారు.
సబర్మతీ ఆశ్రమం నుంచి దండి దాకా సాగే ఈ దారిని ఇపుడు దండి దారి (దండి పాత్) అని నామకరణం చేశారు.
2019 జనవరి 30వ తేదీన దండిలో నేషనల్ సాల్ట్ సత్యాగ్రహ మెమోరియల్ మ్యూజియంను భారత ప్రభుత్వం ప్రారంభించింది.
సామాన్యులను విశేషంగా ప్రభావితం చేసే విషయం కోసం సామాన్యులందరినీ కలుస్తూ దానికి నడకను సాధనంగా చేసుకున్న మహాఉద్యమ పథికుడు మహాత్మాగాంధీ.
ఇప్పటికీ ఈ విశేషాలు తలుచుకుంటే, తవ్వి పోసుకుంటే ఆశ్చర్యకరం… స్ఫూర్తికరం!
Also read: గ్రామీణ భారతానికి అబ్దుల్ కలాం పరిష్కారం