‘‘మూర్తిగారూ, మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు?’’. ఈ ప్రశ్న ఇకమీదట నాకు వినపడదు. ఫోన్ చేసిన ప్రతిసారీ ఈ ప్రశ్న అడిగే చెన్నమనేని రాజేశ్వరరావు సోమవారం రాత్రి పదిన్నర ప్రాంతంలో శాశ్వతంగా కన్నుమూశారు. రాజేశ్వరరావు మరణంతో తెలంగాణ సమాజం ఒక అరుదైన మేధావినీ, ఒక నిరంతర అధ్యయనశీలినీ, ఒక వరిష్ఠ పాత్రికేయుణ్ణీ కోల్పోయింది.
వారానికి ఒకసారైనా ఫోన్ చేయకుండా ఉండేవారు కాదు. ఫోన్ చేసిన తర్వాత తక్షణ విషయం ప్రస్తావించి, ‘ఇప్పుడేం చదువుతున్నారు?’’ అని అడిగేవారు. రామచంద్రగుహా రచించిన ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’ తాజా ఎడిషన్ చదువుతున్నాను అని చెబితే ఆ పుస్తకం తాను కూడా కొన్నాననీ, కొన్ని పేజీలు చదివాననీ చెప్పడంతో పాటు ఆయన ఇటీవల చదివిన పుస్తకాలలో ఏవి బాగా నచ్చాయో, నేను తప్పనిసరిగా చదవవలసిన పుస్తకాలు ఏమిటో చెప్పేవారు. పుస్తకాల పురుగుకు పర్యాయపదం రాజేశ్వరరావు. మార్కెట్ లోకి వచ్చిన ప్రతి మంచి పుస్తకం ఆయన దగ్గర ఉండాల్సిందే. ప్రస్తుతం చదువుతున్న పుస్తకం గురించి మాట్లాడుతూ అదే రచయిత లోగడ రచించిన గ్రంథాల గురించీ, అదే అంశంపైన ఇతర రచయితలు రాసిన పుస్తకాల గురించి సాధికారికంగా మాట్లాడేవారు. ప్రత్యక్షంగా కలిసినా, టెలిఫోన్ లో సుదీర్ఘంగా మాట్లాడినా ఆయనతో మాట్లాడటం ఒక ‘ఎడ్యుకేషన్.’
నాలుగేళ్ళ కిందట ఈ లోకం విడిచివెళ్ళిన విశాలాంధ్ర సంపాదకుడు, అద్భుతమైన మేధావి, తెలుగు, ఇంగ్లీషు, సంస్కృత భాషలపైన అధికారం కలిగిన చక్రవర్తుల రాఘవాచారికి రాజేశ్వరరావు ప్రియమిత్రుడు, వియ్యంకుడు. అంజలి ఘటించడానికి వచ్చిన వెల్చేరు కొండలరావు అన్నట్టు రాఘవాచారి పోయిన తర్వాత రాజేశ్వరరావులో జోష్ తగ్గింది. ఇదివరకటి కళ, ఉత్సాహం, ఉరవడి లేవు. రోజులు వెళ్ళదీస్తున్నారు. హెచ్ఎంటీవీ వెళ్ళిరావడం పనిగా పెట్టుకొని పుస్తకాలతో, స్నేహితులతో కాలక్షేపం చేస్తున్నారు. ఇటీవల కాళ్ళకి పెడిక్యూర్ చేయించుకోవడంతో మొదలైన సమస్య ప్రాణం తీసేదాకా వదిలిపెట్టలేదు. ఆ మసాజ్ వల్ల కాళ్ళు వాచాయి. రక్తప్రసరణలో అంతరాయం వచ్చింది. ఆస్పత్రికి వెళ్ళి వైద్యం చేయించుకొని, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ సమస్య వచ్చింది. ఎక్కువకాలం తాను కష్టపడకుండా, తనవారిని కష్టపెట్టకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ధన్యజీవి.
హైదరాబాద్ పంజగుట్టలో తొలి జర్నలిస్టు కాలనీలో రాఘవాచారి, రాజేశ్వరరావు ఇరుగుపొరుగున ఉండేవారు. వారిద్దరి మధ్యా అనుబంధం పెనవేసుకుంది. పరస్పరం అభిమానించుకున్నారు. గౌరవించుకున్నారు. రాఘవాచారి భార్య జ్యోత్స్నకూ, రాజేశ్వరరావు అర్ధాంగి అంజలికీ మధ్య, రెండు కుటుంబాల మధ్య గాఢమైన స్నేహం కుదిరింది. రాజేశ్వరరావుకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. రాఘవాచారికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె విజయవాడలో ఉండగా స్కూటర్ ప్రమాదంలో మరణించింది. పెద్ద కుమార్తి అనుపమ వైద్యురాలు. రాజేశ్వరరావు రెండో కొడుకు సంజయ్ డాక్టర్ అనుపమను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. జ్యోత్స్న ద్వారానే రాజేశ్వరరావు మరణవార్త నాకు తెలిసింది. చాలామంది ప్రముఖులు రాజేశ్వరరావుకు వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం అంత్యక్రియిలు జరిగాయి.
ఎనభై మూడేళ్ళ కిందట 1939లో మాధవరావు, చిలకమ్మ దంపతులకు కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ కు 15 కిలోమీటర్ల దూరంలో వెదిర గ్రామంలో పుట్టిన రాజేశ్వరరావు ముగ్గురు అన్నదమ్ములలో మధ్యముడు. కరీంనగర్ లో శ్రీరాజరాజేశ్వరీ కళాశాలలో బీఏ చదువుకున్నారు. అప్పుడు ఆ కాలేజీకి ప్రఖ్యాత కవి విశ్వనాథ సత్యనారాయణ ప్రిన్సిపల్ గా, ప్రముఖ విద్యావేత్త వెలిచాల కొండలరావు వైస్ ప్రిన్సిపల్ గా, సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు అధ్యాపకుడుగా ఉండేవారు. మితభాషిగా కనిపించే రాజేశ్వరరావు విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైనారు. ఆ రోజుల్లో చాలా క్రియాశీలకంగా ఉండేవారని మాజీ ఎంఎల్ సీ కమలాకరరావు అన్నారు.
పట్టభద్రులైన తర్వాత రాజేశ్వరరావు మాజీమంత్రి, కాంగ్రెస్ నాయకుడు వీ.బీ. రాజు ఆధ్వర్యంలో నడిచే ఆంగ్లదిన పత్రిక డెయిలీన్యూస్ లో విలేఖరిగా 1963లో చేరి జర్నలిజం ప్రస్థానం ఆరంభించారు (ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు అక్కడ సహోద్యోగి). అదే సంవత్సరం మేనమామ కుమార్తె అంజలిని ప్రేమించి నిరాడంబరంగా గుడిలో పెళ్ళి చేసుకున్నారు. తర్వాత ఆంధ్రపత్రిక దిల్లీ విలేఖరిగా 1965 నుండి 1982 వరకూ పని చేశారు. అంతవరకూ తెలుగు పత్రికలకు దిల్లీలో ప్రత్యేకంగా విలేఖరులు ఉండేవారు కాదు. పీటీఐ, యూఎన్ఐ వార్తాసంస్థలు పంపిన వార్తలే శరణ్యం. ఇంగ్లీషు పత్రికలకు పని చేసే విలేఖరులే అడపాతడపా వార్తలూ,వ్యాఖ్యలూ రాసి తెలుగు పత్రికలకు పంపేవారు. ఒక తెలుగు పత్రికకు వార్తలు రాయడంకోసం ప్రత్యేకంగా దిల్లీలో నియుక్తుడైన తొలి పాత్రికేయుడు రాజేశ్వరరావు. ఆ తర్వాత రామకృష్ణ (ఆంధ్రజ్యోతి), ఆదిరాజు వెంకటేశ్వరరావు (ఉదయం) వంటి పాత్రికేయులు దిల్లీ కేంద్రంగా పని చేశారు. అనంతరం తెలుగు పత్రికలకు దిల్లీలో బ్యూరోలే వెలిశాయి. రాఘవాచారి కూడా విశాలాంధ్ర సంపాదకుడుగా చేరడానికి ముందు దిల్లీలో వామపక్ష భావాలు కలిగిన ఇంగ్లీషు పత్రిక ‘పేట్రియట్ ’కు విలేఖరిగా పనిచేశారు. దిల్లీ నుంచి వచ్చిన తర్వాత రాజేశ్వరరావు రాష్ట్ర విద్యున్మండలి (ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ – ఏపీఎస్ఇబీ)లో అధికారిగా 1982 నుంచి 83 వరకూ పని చేశారు. ‘ఉదయం’లో ప్రత్యేక ప్రతినిధిగా 1984 నుంచి 90 వరకూ పని చేశారు. అనంతరం నేదురుమల్లి జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ప్రభుత్వంలో పౌరసంబంధాల అధికారిగా చేరారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో కూడా అదే పదవిలో కొనసాగారు. ‘ఆంధ్రజ్యోతి’లో కొంత కాలం పని చేశారు. ‘వార్త‘లో ప్రత్యేక ప్రతినిధిగా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ జరల్నిస్టుల హౌసింగ్ సొసైటీ వ్యవస్థాపక కోశాధికారిగా పని చేశారు. ఇటీవల ‘మనతెలంగాణ’ పత్రికలోనూ, ఆ తర్వాత ‘హెచ్ఎంటీవీ’లోనూ సలహాదారుగా పని చేశారు. హెచ్ఎంటీవీలో ఉద్యోగం చేస్తూనే తనువు చాలించారు. చేతిలో పుస్తకంపట్టుకుని చదువుతూ ఆఖరి శ్వాస విడవాలని ఆయన కోరిక. చివరిదాకా పుస్తకాలు చదువుతూ, వాటి గురించి మిత్రులతో చర్చిస్తూనే వెళ్ళిపోయారు.
జర్నలిస్టుగా ముక్కుకు సూటిగా వ్యవహరించేవారు. సత్యనిష్ఠ పాటించేవారు. రాజీపడే మనిషి కాదు. ఆ క్రమంలో యాజమాన్యానికి ఇబ్బంది కలిగిందని భావించిన పక్షంలో రాజీనామా సమర్పించేవారు. ఎన్ టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన తనను తాను సన్యాసిగా అభివర్ణించుకునేవారు. ఆయన సన్యాసి కారనీ, ఫలానా. ఫలానా ఆస్తులు ఆయన పేరుమీద ఉన్నారనీ, ఆస్తులంటే మమకారం ఉన్నదనీ నిరూపిస్తూ ఒక పరిశోధన వ్యాసం రాశారు. ఆ పత్రిక యాజమాన్యానికి ఈ ధోరణి నచ్చక రాజేశ్వరరావును విజయవాడకు బదిలీ చేసింది. బదిలీ వేటు వేయడం అన్యాయమని ప్రకటించి రాజీనామా చేశారు. కాసు బ్రహ్మనందరెడ్డి ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా 1965లో యువజర్నలిస్టు రాజేశ్వరరావు ఒక సమీక్షా వ్యాసం రాశారు. ముఖ్యమంత్రిగా కొన్ని నిర్ణయాలు తీసుకున్న తీరును విమర్శించారు. తనను పొగుడుతూ వచ్చిన పత్రికలన్నింటినీ పక్కన పెట్టి బ్రహ్మానందరెడ్డి ఏకాగ్రచిత్తంతో రెండు విడతల రాజేశ్వరరావు వ్యాసాన్ని చదివారు. బ్రహ్మానందరెడ్డికీ, అప్పటి ఆంధ్రపత్రిక యజమాని శివలెంక శంభుప్రసాద్ కీ మంచి స్నేహసంబంధాలు ఉండేవి. సంపాదకుడు తనను కలవాలని కబురు పెట్టినప్పుడు తన ఉద్యోగం పోయినట్టేనని భావించి రాజీనామా లేఖను టైప్ చేసి జేబులో పెట్టుకొని వెళ్ళారు. ‘నా రాతల వల్ల యజమానికీ, ముఖ్యమంత్రికీ మధ్య స్నేహసంబంధాలకు నష్టం కలిగితే తాను విలేఖరిగా కొనసాగడం భావ్యం కాదనీ, అందువల్ల రాజీనామా చేస్తున్నాననీ’ చెప్పి రాజీనామా లేఖను సంపాదకుడికి అందజేశారు. లేఖ చదివిన శంభుప్రసాద్ ఫక్కున నవ్వి, ‘‘నాకు ముఖ్యమంత్రితో ఉన్న స్నేహానికీ మీరు రాసే వార్తలకూ సంబంధం లేదు. ముఖ్యమంత్రి నాకు మంచి మిత్రుడే. కానీ మీరు రాసిన వ్యాసం అద్భుతంగా ఉంది. సిసలైన పాత్రికేయుడు యజమానికంటే, సంపాదకుడి కంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న సూత్రాన్ని మీరు ఆచరించి చూపించారు’’ అని ప్రశంసించారు. ఆ రోజుల్లో జర్నలిజం అట్లా ఉండేది. సంపాదకులు ఆ విధంగా ఉండేవారు. ముఖ్యమంత్రులు కూడా నిర్మాణాత్మకమైన విమర్శలను సహృదయంతో స్వీకరించేవారు.
ఎనభై ఏళ్ళు దాటిన తర్వాత కూడా బోయినపల్లి నివాసంలోనూ, జూబిలీహిల్స్ లోని హెచ్ఎంటీవీ కార్యాలయంలోనూ చుట్టూ పుస్తకాలు పెట్టుకొని చదువుతూ కనిపించేవారు. తాజా పరిణామాలపైన వ్యాఖ్యానించేవారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని గుండెల నిండా నింపుకున్న రాజేశ్వరరావు మంచి స్నేహశీలి. జర్నలిస్టుకు ఉండవలసిన తెగువ కలిగిన వ్యక్తి. ప్రశ్నించే మనస్తత్వానికి ప్రతీక. సీనియర్ జర్నలిస్టులతో, ఐఏఎస్ అధికారులతో, రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. తన సంబంధాలను పనులు చేయించుకోవడానికి వినియోగించే అల్పుడు కాదు ఆయన. సమాజం గురించీ, మనుషుల ప్రవర్తన గురించీ, విలువల గురించే ఆయన తాపత్రయం. సమాజం నుంచి ఏమీ ఆశించకుండా సదా దాని హితవు కోరిన అసలైన మేధావి. అనేక పదునైన వ్యాసాలు రచించి, వివిధ పత్రికలలో ప్రచురించిన రాజేశ్వరరావు లేని లోటు తీరనిది. ఇద్దరు మిత్రులు రాఘవాచారి, రాజేశ్వరరావులు నాలుగేళ్ళ వ్యవధిలో ఈ లోకం విడిచిపెట్టి పోవడం విషాదం.
కొండుభట్ల రామచంద్రమూర్తి