- ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకం పెంచిన ప్రభుత్వం
- గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్న జనసేన
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికలు ఏకగ్రీవం అయితే ఇచ్చే ప్రోత్సాహకాలను ప్రభుత్వం భారీగా పెంచింది. జనాభా ప్రాతిపదికన ఆయా పంచాయతీలకు 20 లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. ఈమేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 5 లక్షల రూపాయలు, 2 వేల నుంచి 5 వేల జనాభా ఉన్న పంచాయతీలకు 10 లక్షల రూపాయలు, 5 వేల నుంచి 10వేల జనాభా ఉన్న పంచాయతీలకు 15 లక్షలు, 10 వేల జనాభా దాటిన పంచాయతీలకు 20 లక్షల రూపాయలు ప్రోత్సాహకంగా అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది చదవండి: పంచాయతీ ఎన్నికలు జరపాల్సిందే
ఏకగ్రీవాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్న జనసేన :
మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఏక గ్రీవ పంచాయతీలపై ప్రభుత్వం ప్రోత్సహాకాలు పెంచుతూ జీవో జారీ చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులను ఆయన హెచ్చరించారు. ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఏకగ్రీవం పేరుతో ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాదెండ్ల ప్రభుత్వానికి సూచించారు. పోటీ నుంచి అభ్యర్థులను విరమించుకునేలా ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేసే అవకాశం ఉందని నాదెండ్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది చదవండి: సుప్రీం తీర్పుతో ఏపీలో వేగంగా మార్పులు
ఏకగ్రీవాలపై చంద్రబాబు:
బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ధైర్యంగా నామినేషన్లు వేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే అధికార పార్టీ ఖచ్చితంగా ఓటమి పాలవుతుందని చంద్రబాబు జోస్యం చెప్పారు.
ఇది చదవండి: గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన ఎస్ఈసీ