• మొదటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
• ఎస్ఈసీ వద్ద పార్టీల డిమాండ్
• రాజకీయ పార్టీలతో రమేష్ కుమార్ సమావేశం
• వైసీపీ గైర్ హాజర్
• సుప్రీం ఆదేశాలను అమలు చేయలేదని విమర్శ
అమరావతి : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 11 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేశారు. అయితే అధికార వైసీపీ సమా ఆరు పార్టీలు సమావేశానికి హాజరుకాలేదని ఎస్ఈసీ రమేష్ కుమార్ కుమార్ తెలిపారు. ఒక్కో పార్టీ ప్రతినిధితో విడి విడిగా భేటీ అయి అభిప్రాయాలు సేకరించామని ఎస్ ఈ సీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో గంటపాటు సమావేశం నిర్వహించామన్నారు. వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో చర్చలు జరిపామని ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. కొవిడ్ పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరిపామని… ఈ ప్రక్రియను గొప్ప అంశంగా ఎన్నికల సంఘం భావిస్తోందని అన్నారు.
ఎస్ఈసీతో సీఎస్ భేటీ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ అభిప్రాయం తెలపాలని ఎస్ఈసీ కోరిన నేపథ్యంలో సీఎస్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికలకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను పూర్తిగా రద్దు చేసి తాజా నోటిఫికేషన్ విడుదల చేయాలని సీపీఐ కోరినట్లు సమాచారం. గతంలో అధికార వైసీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకగ్రీవాలు చేసుకుందని…అవన్నీ రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎన్నికల కమిషనర్ ను కోరారు. కరోనా దృష్ట్యా ప్రజల్లో మరింత అవగాహన తీసుకురావాలని, కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని పలు పార్టీలు ఎస్ఈసీని కోరినట్లు సమాచారం.
ఎస్ఈసీ కింకర్తవ్యం?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా.. మార్చి 22 నుంచి దేశంలో లాక్ డౌన్ అమలు కావడంతో ఎన్నికల నిర్వహణ వాయిదా పడింది. కంటైన్ మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో జనజీవనం దాదాపుగా సాధారణ స్థితికి చేరుకుంది. దీంతో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఏపీలోని రాజకీయ పక్షాలతో పాటు, సీఎస్ తో కూడా సంప్రదింపుల ప్రక్రియ పూర్తి కావడంతో ఎస్ ఈసీ ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది.