ముంబైలో బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశానికి రంగం సిద్ధమౌతోంది. ఈ విషయాన్ని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. త్వరలోనే ఈ సమావేశం జరుగుతుందని ఆయన ఆదివారంనాడు మీడియాకు చెప్పారు. దేశంలో ప్రస్తుత రాజకీయ స్థితి గురించి చర్చించి.. కార్యాచరణ రూపొందించేందుకు బీజేపీయేతర ముఖ్యమంత్రులు, నేతలు భేటీ కావాల్సిన అవసరం ముందని పశ్చిమ బెంగాళ్ సీఎం మమతా బెనర్జి బీజేపీయేతర పక్షాలకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖలోని అంశాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే చర్చించినట్లు సంజయ్ రౌత్ వెల్లడించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, దేశంలో మతపరమైన అశాంతి కల్గించేందుకు జరుగుతున్న యత్నాలు… తదితర అంశాలపై నాన్ బీజేపీ సీఎంల భేటీలో చర్చిస్తారని సంజయ్ రౌత్ తెలిపారు. శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి సందర్భంగా శోభా యాత్రలు నిర్వహించడంపై ఆయన వ్యాఖ్యానిస్తూ… ఇవన్నీ రాజకీయ పార్టీల ప్రోత్సాహంతో జరిగిన యాత్రలనీ, హిందూ ఓట్లు పొందేందుకు జరుగుతున్న యత్నమనీ అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లోనే ఈ యాత్రలు జరగడాన్ని ఆయన ప్రస్తావించారు.