- విపక్షాల ఆందోళనతో దద్దరిల్లిన పార్లమెంటు
- రేపటికి వాయిదా పడ్డ రాజ్యసభ
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న చమురు, గ్యాస్ ధరలపై పార్లమెంటు దద్దరిల్లింది. పెట్రోధరలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో రాజ్యసభ రేపటికి వాయిదాపడింది. విపక్షాల ఆందోళన నేపథ్యంలో రెండు సార్లు వాయిదాపడి సభ ప్రారంభమైనా విపక్షాలు మాత్రం పట్టిన పట్టు వీడకపోవడంతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను రేపటికి వాయిదా వేశారు.నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. పెట్రోధరల పెంపుపై అధికార బీజేపీని నిలదీశాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన రాజ్యసభ కాసేపు సజావుగానే సాగింది. మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు మహిళలు వారు సాధిస్తున్న విజయాలను ప్రశంసించారు. అనంతరం అజెండాలోని అంశాలను పక్కనపెట్టి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై చర్చించాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నోటీసు ఇచ్చారు. సభాధ్యక్షులు వెంకయ్య నాయుడు పెట్రో ధరలపై తర్వాత చర్చిద్దామన్నారు.
Also Read: తృణమూల్ కాంగ్రెస్ లో ఆగని వలసలు
షెడ్యూల్ ప్రకారం క్వశ్చన్ అవర్‌ను కొనసాగించాలని నిర్ణయించారు. ఛైర్మన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు వెల్‌లోకి వెళ్లి ఆందోళనకు దిగాయి. తక్షణమే పెట్రో ధరల పెంపుపై చర్చ జరపాలని ప్రతిపక్ష సభ్యులు తమ తమ స్థానాలలో ఉండి పట్టుబట్టారు. సభ్యులు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తొలిరోజే సభ్యులను సస్పెండ్ చేయాలనుకోవడం లేదని వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా హెచ్చరించారు. అయినా ప్రతిపక్ష నేతలు ఆందోళన కొనసాగించడంతో గత్యంతరం లేక సభనువాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైనా ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలు విరమించలేదు. దీంతో డిప్యూటీ ఛైర్మన్ హిరివంశ్ నారాయణ్ సభను మరోసారి వాయిదా వేశారు.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను ఎన్నికలయ్యాక నిర్వహించాలని తృణమూల్ కాంగ్రెస్ నేతలు కోరారు. ఈ మేరకు ఉభయసభల్లోని తృణమూల్ కాంగ్రెస్ నేతలు సుధీప్ బందోపాధ్యాయ, డెరెక్ ఒబ్రెయిన్ లోకసభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి లేఖలు రాశారు.
ఇదీ చదవండి: వ్యయ `వ్యూహం`లో ఉక్కిరిబిక్కిరి