- ధరణి పోర్టల్ వల్ల భూ సమస్యను మరింత జటిలం చేసిందన్న అఖిలపక్ష నేతలు
- ధరణి పోర్టర్ వెనుక పెద్ద కుట్ర ఉంది
- ధరణి పోర్టల్ పై అనేక అనుమానాలు ఉన్నాయి. న్యాయస్థానలకు వెళ్ళబోతున్నాం – మాజీ డిప్యూటి సిఎం దమోదర రాజనర్సింహ
- ధరణి వచ్చాక అన్నదమ్ములు కోట్లాడుకోవాల్సి వచ్చింది – సీతక్క
తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యర్యంలో “ధరణి పోర్టల్ – భూ సమస్య పరిష్కార డిమాండ్”తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ మినహా కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, వివిధ రైతు సంఘల నాయకులు పాల్గొన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాదిక్, అఖిల పక్ష నేతలు.. ధరణి భూ సమస్యల బాధితులు.. రైతులు తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభం అయినప్పటి నుంచే అనుమానాలు వస్తున్నాయి : దామోదర రాజనర్సింహ
ధరణి పోర్టల్ ప్రారంభం అయినప్పటి నుంచే అనుమానాలు వస్తున్నాయని కాంగ్రెస్ నేత మాజీ డిప్యూసి సిఎం మోదర రాజనర్సింహ అరోపించారు. తెలంగాణ అంటేనే భూపోరాటల చరిత్ర అని అన్నారు. అలాంటి పోరాటాల ద్వార సాధించుకున్నా భూమిని అనుభదారుని కాలం తీసివేయ్యడం కేసీఆర్ పెద్ద కుట్రకు పాల్పడ్డారని అగ్రహం వ్యక్తం చేశారు. 72 ఏళ్లుగా భూ పోరాటాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వాలు అసైన్ మెంట్ కమిటీల ద్వారా భూసమస్యలకు పరిష్కారం చూపేవని ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి అసైన్డ్ కమిటీని రద్దు చేసిందన్నారు.
2014లో తెలంగాణ వచ్చాక భూసమగ్ర సర్వే చేయకుండా.. ధరణి పోర్టల్ తెచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాలు భూసమగ్ర సర్వేలు చేసుకున్నాయని, రాచకొండ భూ సమస్యలపై పిటీషన్, ఎక్స్ సర్విస్ మెన్ భూసమస్యలపై హైకోర్టులో పిటీషన్లు వేస్తూన్నామని తెలిపారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏ పాలసీ తెచ్చినా అందులో ఏదో ఒక కుట్ర దాగి ఉంటుందని గుర్తుచేశారు. ‘‘కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు.. సబ్సిడీ లు ఆపేసిండని.ఎన్నికలప్పుడే బంధులు ఇస్తాడు తర్వాత అన్ని మరిచిపోతారన్నారు. జిల్లా స్థాయిలో చర్చా వేదికలు.. సభలు.. సమావేశం పెట్టి.. పోరాటం రూపొందించి.. న్యాయం కోసం ఉద్యమం చేయాలన్నారు. ధరణిపై కోర్టులో రిట్ ఫైల్ చేస్తాం’’ అని రాజనరసింహ అన్నారు.
శ్రీ పేరుతో ఎన్ని వేల ఎకరాలు ఉంటుంది, ఆ శ్రీ ఎవరు: డీకే అరుణ, బీజేపీ
రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాల అసైన్డ్ భూమి ఉంటే ధరణిలో సగం కూడా ఎక్కలేదన్నారు బిజెపి జాతీయ ఉపాద్యక్షురాలు డికే అరుణ. అదంతా అధికార నేతలు తమ ఖాతాల్లో వేసుకునేందుకే ధరణిలోని సమస్యలకు పరిష్కారం చూపడం లేదన్నారు. కలెక్టర్ మినహా మిగతా రెవెన్యూ అధికారులను జీరో చేసిన ప్రభుత్వం ఉందంటే అది కేసీఆర్ ప్రభుత్వమే అని అరోపించారు. ధరణి పోర్టల్ ప్రారంభం పైనే చాలా అభ్యంతరాలు వచ్చాయి. ఇది ఎందుకు తెచ్చారు? పాసుబుక్ లు ఇచ్చినా వాటిలో భూములు ఎక్కలేదు. ఎన్నో తప్పులు ఉన్నాయి. అధికారులకు చెబితే మా చేతుల్లో ఏం లేదంటున్నారు. పేదలు ఆఫీసుల చుట్టూ ఏండ్లుగా తిరుగుతున్నారని అరోపించారు. ధరణి సమస్యలు ఎందుకు పరిష్కారించడం లేదన్నారు. ఐటీ శాఖ సీఎం కొడుకు వద్దనే ఉంది. శ్రీ పేరుపై లక్షల ఎకరాలు పెట్టారు. ఆ శ్రీ ఎవరో ప్రభుత్వం చేప్పాలన్నారు. అధికార ప్రజాప్రతినిధులు.. నేతలు భూదందా చేస్తున్నారని అరోపించారు. చిన్న జిల్లాలు అయినా కూడా కలెక్టర్లు భూ సమస్యలు పరిష్కరించలేకపోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. వివాదాలు.. సమస్య లు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. భూ సేకరణ లో పది ఎకరాలు ఉంటే.. వందల ఎకరాలను సమస్యల్లో పెట్టారని తెలిపారు. చిత్తశుద్ధితో ధరణి సమస్యలను పరిష్కరించాలనీ, బాధితులకు మద్దతుగా బీజేపీ పోరాడుతుందనీ తెలిపారు.
ఎవరికి చెప్పుకోవాలో తెలియదు : సీతక్క, కాంగ్రెస్ ఎమ్మోల్యే
ప్రతి రోజు ధరణి సమస్యలు తన దృష్టి కి వస్తున్నాయనీ, ఆ సమస్యలు ఎవరికి చేప్పుకోవాలో అర్దం కావడం లేదనీ అన్నారు ఎమ్మోల్యే సీతక్కా. రాజకీయ నేతలు భూమి ఎక్కువ చూపించి కూడా రైతుబంధు తీసుకుంటున్నారని అరోపించారు. దళితులకు వందల ఎకరాలు ఇచ్చి.. వేల ఎకరాలు గుంజుకుంటున్న ప్రభుత్వం కేసీఆర్ సర్కారేనని అన్నారు. కౌలు.. పోడు.. పట్టాలు లేని రైతులకు రైతుబంధు ఇయ్యట్లేదన్నారు. కేసీఆర్ ఫాంహౌస్ కింద ఎన్ని ఎకరాలు ఉందో తెలియదన్నారు. పేదల భూములకే ధరణిలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయనీ, పెద్దల భూములు రహస్యంగా ధరణి లో ఎక్కించుకుంటున్నారనీ మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డి నాకు 600 ఎకరాలకు రైతుబంధు తీసుకుండని చెప్పిండు అంటే అయన లాంటి వారికే ధరణి ఉపయోగపడుతుందన్నారు. ధరణితో పేద రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. భూ పట్టా కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని వేల గొంతుకలు వస్తేనే కేసీఆర్ ను గద్దెదించగలమని సీతక్క స్పష్టం చేశారు.
డిజిటలైజేషన్ ఎందుకు నిలిపివేశారు : రావుల చంద్రశేఖరరెడ్డి, టీడీపీ
యూపీఏ హయాంతో భూ డిజిటలైజేషన్ తెచ్చి రాష్ట్రంలో నిజామాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిందని దాన్ని ఎందుకు విస్మరించారని టిడిపీ అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. భూ సమస్యలు చిన్న, సన్నకారు రైతులకే వస్తున్నాయన్నారు. మాన్యువల్ గా కూడా భూ రికార్డులు అప్ డేట్ చేయాలని సూచించారు. 22 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారనీ, టెక్నాలజీ పెరిగినా కూడా భూ సమస్యలు పరిష్కారం కావడం లేదనీ విమర్శించారు. వ్యవసాయ భూమి తగ్గిపోతుందనీ, భూమి పై భద్రత.. భరోసా పోయి భూమి ఉంటుందో పోతుందో అని భయంగా మారిందనీ అన్నారు. సెక్షన్ 22ఏ ను సవరించాలని డిమాండ్ చేశారు.
సలహాలు స్వీకరించని సీఎం : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
సీఎం కేసీఆర్ కు మంచి ఐడియాలు ఉన్నాయనీ, అందరికీ సలహాలు ఇస్తారనీ, తాను మాత్రం ఎవ్వరి సలహా స్వీకరించరనీ, అన్నీ ఆయనే చేస్తాడనీ.. అన్ని రంగాలపై ఆయనే చెబుతాడనీ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ధరణి వెనక ప్రభుత్వం పెద్ద కుట్ర ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు గుంజుకుంనేందుకు ధరణి తెచ్చిందన్నారు. తండ్రి కొడుకుల టీఆర్ఎస్ పార్టీ వారి సొంతానికే ఉందని చేప్పారు. తమకు ఎకరం భూమి ఉంటే.. 7 ఎకరాలు ధరణిలో చూపిస్తున్నారనీ, ఇందులో సగం సగం భూమి నాలాకు కన్వర్టు అయిందనీ అన్నారు. ధరణి సాఫ్ట్ వేర్ డేటా బేస్ కు లాక్ ఉండాలి. ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉండదన్నారు. అధికార నేతల పనులు త్వరగా భూ సర్వేలు చేసుకుని.. ప్రజల పనులకు సర్వ ర్ డౌన్ అని చెబుతున్నారని అరోపించారు.
గిరిజనుల పోరాటాన్ని పట్టించుకోవడం లేదు : పశ్య పద్మ, సీపీఐ నేత
హద్దులు నిర్దేశించలేకుండా ధరణి లో చేర్చడం సరికాదన్నారు సిపిఐ నేత ప్రశ్య పద్మ. పెద్దల చేతుల్లో భూములు ఉన్నాయని, మఠంపల్లి లో గిరిజన రైతుల పోరాటం చేస్తూన్నారని, లక్షల ఎకరాలు నిషేధ జాబితాల్లో పెట్టారని అవేదన వ్యక్తం చేశారు. వీటిపై వెంటనే సర్కార్ నిర్ణయం తీసుకోవాలన్నారు. ట్రిబ్యునల్స్ అధికారులను పెంచి భూ సమస్యలను సత్వరం పరిష్కారించాలని తెలిపారు. అఖిల పక్షం ఏర్పాటు చేసి ధరణీ సమస్యలను పరిష్కరించాలన్నారు.
ధరణి సర్కార్ కు ఉరితాడు : నర్సింహా రెడ్డి రైతు
‘‘మూడు నెలలుగా నాలుగు వేల మంది ధరణి భూ సమస్యల బాధితులతో మాట్లాడామనీ, ధరణి వచ్చాకా సర్వే నెంబర్లు బ్లాక్ చేయడంతో 20 లక్షల ఎకరాలపై నిషేధిం విధించారు. ఇందులో పట్టాభూములు కూడా ఉన్నాయి. ఏండ్లుగా పాస్ బుక్ ల కోసం తీరుగుతున్నాం. ధరణి లో తప్పులను సరిచేయకుంటే.. సర్కార్ కు ఉరితాడుగా మారుతుంది. ధరణిలో సెక్షన్ 22ఏ అతిపెద్ద సమస్యగా మరింది’’ అని నర్సింహారెడ్డి అనే రైతు వ్యాఖ్యానించారు.
హైకోర్టుకు వెళ్ళడమే పరిష్కారం : కరుణాకర్
‘‘భూ సమస్యలపై న్యాయనిపుణుల కమిటీ వేయకుండానే ధరణి తెచ్చారు. భూ సమగ్ర సర్వే ను అటకెక్కించింది ప్రభుత్వం. కేసీఆర్ కు చెప్పినా పట్టించుకోడు. దున్న పోతు మీద నీళ్లు చల్లినట్లే ఆయన తీరు ఉంది.. హై కోర్టుకు వెళితేనే పరిష్కారం’’ అని తెలంగాణ సోషల్ మీడియా ఫోరం కన్వీనర్ కరుణాకర్ వ్యాఖ్యానించారు.