————————-
(‘ GOD AND MANY GODS’ FROM ‘THE WANDERER’ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం:డా. సి.బి. చంద్ర మోహన్
35. సంచారి తత్త్వాలు
———————- ———— —————————-
ఒకప్పుడు కిలాఫిస్ నగరంలో ఒక ఆధ్యాత్మిక గురువు గుడి మెట్ల మీద నిలబడి, బహు ఈశ్వరారాధన గురించి బోధించాడు. ప్రజలు వారి మనసుల్లో ఇలా అనుకున్నారు ” ఇదంతా మనకు తెలిసిందే. వారు మనతో జీవిస్తూ, మనం వెళ్లిన చోటకల్లా వస్తారు కదా!”
కొద్ది కాలం లోనే, ఇంకో మనిషి బజారులో నిలబడి ప్రజలతో ఇలా చెప్పాడు.” దైవం అనే వారు ఎవరూ లేరు. “
ఇతను చెప్పింది విన్న చాలా మంది సంతోషించారు. ఎందుకంటే వారికి దేవుళ్లంటే భయం.
ఇంకో రోజు, మంచి వాక్చాతుర్యం ఉన్న ఒక మనిషి వచ్చి ఇలా చెప్పాడు .” ఒకే దేవుడు ఉన్నాడు.” జనాలు మనసుల్లో దిగులు చెందారు. చాలా మంది దేవుళ్ళ కన్నా ఒకే దేవుని తీర్పు ఎలా ఉంటుందో అని వారి దిగులు.
ఆ కాలంలోనే ఇంకో వ్యక్తి వచ్చాడు. ఆయన ప్రజలతో ఇట్లా అన్నాడు.” ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. వారు గాలిలో ఒకరిగా కలిసి ఉంటారు. వారికి ఒక దయ గల, అందమైన, పెద్దదైన అమ్మ కూడా ఉంది. ఆవిడ వారికి సహచరి, స్నేహితురాలు మరియు చెల్లెలు కూడాను!”
అప్పుడు ప్రతి ఒక్కరూ వారి హృదయాల్లో సంతృప్తి చెందారు. “ఒకరుగా కలిసి ఉన్న ముగ్గురు దేవుళ్ళు– ఇది బాగుంది. పైగా మన లాంటి పేదలు, దుర్బలులకు దయామయి ఐన ఆ దేవుళ్ళ మాత అండగా ఉంటుంది.”
కానీ, ఈ రోజు వరకూ కిలాఫిస్ నగరంలో –అనేక దేవతలు , ఏకేశ్వరుడు, దేవుడు లేక పోవడం, ముగ్గురు దేవుళ్ళు ఒకరిగా కలిసి ఉండడం మరియు దయామయి అయిన దైవ మాతల గురించి — వివాద పడేవారు, తర్కించుకునేవారు ఉంటూనే ఉన్నారు.
Also read: ఆవాసాలు
Also read: దానిమ్మ పళ్ళు
Also read: శాపం
Also read: ఆనందము — దుఃఖము
Also read: హింస నచణ —- ( ఒక) ధ్వంస రచన