- రైతుబజార్లలో అందని సబ్సిడీ ఉల్లిపాయలు
- అధికారుల నిర్లక్ష్యంతో రెచ్చిపోతున్న దళారులు
- ఆకాశన్నంటుతున్న ఉల్లి ధరలు
ఉల్లి లొల్లి మళ్లీ మొదలైంది. కోయకుండానే కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లిపాయ లేనిదే గృహిణులు వంటింటి నుంచి బయటకు రాలేరు. అలాంటిది ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. రైతు బజార్లలో కూడా సబ్సిడీ ఉల్లిపాయలు అందుబాటులో లేవు. అధికారుల అలసత్వంతో దళారులు యథేచ్ఛగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
అందుబాటులో లేని ధరలు
తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు రోజురోజుకు మండిపోతున్నాయి. సామాన్యులకు ఉల్లి కోయకుండానే కన్నీరు తెప్పిస్తోంది. రిటైల్ మార్కెట్లో కిలో వంద రూపాయలు అమ్మిన వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఉల్లి పేరు వింటేనే భయపడుతున్నారు. గత నెలలో కిలో ఉల్లిపాయలు 20 నుంచి 25 రూపాయలు ఉండేది. గతంలో 2000 పలికిన క్వింటా ఉల్లి ఇప్పుడు ఏకంగా 6 వేలకు పెరిగింది. దీంతో మార్కెట్లో ఉల్లి కిలో 80 రూపాయలకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కూరగాయల పంటలు నీట మునిగాయి. ఉల్లికి తీవ్ర కొరత ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు.
అధికారుల అలసత్వం
అధికారుల ఉదాసీన వైఖరి కూడా సామాన్యుల పాలిట శాపంగా పరిణమించింది. ప్రభుత్వ ఆధీనంలో నడిచే రైతు బజార్లలోనూ ఉల్లి ధర సామాన్యుడికి అందుబాటులో లేదని వాపోతున్నారు. ముందుగానే పరిస్థితిని అంచనా వేసిన వ్యాపారులు … భారీ వర్షాలకు కొత్త స్టాక్ మార్కెట్‌కు వచ్చే అవకాశం లేదంటున్నారు. రైతుబజార్లలో సబ్సిడీపై విక్రయించాల్సిన ఉల్లిపాయలను నల్లబజారుకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉల్లి చోరీలకు పాల్పడుతున్న ఆగంతకులు
దేశంలోని పలు ప్రాంతాల్లో కిలో ఉల్లి 80 రూపాయలు చేరుకుంది. దీంతో ప్రతినిత్యం ఉల్లిని తప్పనిసరిగా వినియోగించే వారంతా… ఉల్లిని తరగకుండానే కన్నీరు పెట్టుకుంటున్నారు. ధరలు అమాంతం పెరిగిన నేపధ్యంలో ఉల్లి బస్తాల దొంగతనాలు పెరిగిపోతున్నాయి. పూణెలోని ఓ గోదాములో నిల్వ ఉంచిన 550 కిలోల ఉల్లి చోరీ చేసేందుకు యత్నించారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు గోదాములోని 38 బస్తాల ఉల్లిని చోరీ చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు. దీనిని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని ఒక దొంగను పట్టుకోగా, మరొక దొంగ బైక్ పై పరారయ్యాడు.
వినియోగం పెరిగితే పరిస్థితి ఏంటి.?
కరోనాకు ముందు సాధారణ పరిస్థితుల్లో ఉన్న వినియోగం కన్నా ప్రస్తుతం హోటళ్లు, హాస్టళ్లలో వినియోగం గణనీయంగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో గృహ అవసరాలకే కొనుగోలు జరుగుతోంది. అయినా ఉల్లి కొరత ఏర్పడటంతో అక్రమంగా నిల్వచేసిన దళారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.