- పోలింగ్ కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రత
- కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు వేస్తున్న ఓటర్లు
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 13 జిల్లాల్లోని 160 మండలాల్లో 26851 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మూడో దశ ఎన్నికల్లో 3221 పంచాయతీల్లో 579 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ దఫా ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, నక్సల్ ప్రభావిత పోలింగ్ కేంద్రాలుగా వర్గీకరించిన ఎన్నికల సంఘం అందుకనుగుణంగా పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది. ఎఈసీ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ పద్దతి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల తీరుపై పర్యవేక్షణ చేస్తున్నారు. ఎస్ఈసీ, డీజీపీ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగనుంది. ఏజెన్సీ ప్రాంతాలలో 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. కరోనా నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.