- కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు
- టెలికాం, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన కిసాన్ పరేడ్ ఆరంభం నుంచీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు అనుమతించిన రూట్ మ్యాప్ ను కాదని రైతులు ఎర్రకోట వైపు దూసుకెళ్లడంతో పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయి. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో రెండు నెలలుగా శాంతియుతంగా సంయమనం పాటిస్తూ చేస్తున్న ఆందోళనలు ఒక్కసారిగా హింసామార్గంవైపు పయనించాయి. పలువురు ఆందోళనకారులు తల్వార్లు ధరించి రావడం పోలీసులపైకి కత్తులు దూయడం వంటి ఘటనలతో కిసాన్ పరేడ్ రణ రంగాన్నే తలపించింది.
ముందు జాగ్రత్తలు:
హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లతో కేంద్రం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. రాత్రి 12 గంటల వరకు టెలికాం ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. శాంతిభద్రతల దృష్ట్యా సింఘు, టిక్రీ, ఘాజీపూర్, ముఖుర్దాచౌక్, నగ్లోయ్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఎర్రకోటలో రైతుల నినాదాలు :
ఎర్రకోటనుముట్టడించిన రైతులు సాగు చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పదుల సంఖ్యలో ఆందోళన కారులు ఎర్రకోట బురుజులు ఎక్కి జెండాలు ఎగురవేశారు. దీంతో రైతులను ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆందోళన కారులను నియంత్రించేందుకు అనుమతించిన మార్గాల్లోనే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇది చదవండి: హింసాత్మకంగా కిసాన్ పరేడ్
మెట్రో స్టేషన్ల మూసివేత:
దేశ రాజధానిలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఢిల్లీ మెట్రో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఐటీవో, జామా మసీద్, దిల్షద్ గార్డెన్, జిల్మిల్, ఇంద్రప్రస్థ స్టేషన్లను మూసివేశారు.
అమిత్ షా ఆరా:
ఢిల్లీలో ఉద్రిక్తంగా మారిన కిసాన్ పరేడ్ పై అమిత్ షా ఉన్నతాధికారులతో చర్చించారు. ఉదయం నుంచి జరిగిన పరిణామాలను అధికారులు హోంమంత్రికి వివరించారు. దీంతో అధికారులను అప్రమత్తంగా ఉండాలని అమిత్ షా సూచించారు.
ఇది చదవండి: మెట్టు దిగిన ప్రభుత్వం, బెట్టువీడని రైతన్నలు