భగవద్గీత – 79
అల్లంతదూరాన ఆజానుబాహువులు ఇద్దరు. వారి మూపున పెద్ద కొండచిలువలలాంటి పెద్దపెద్ద ధనస్సులు. అంతే!
వారిని చూడగానే గుండెజారిగల్లంతయ్యింది. కాళ్ళలో వణుకుపుట్టి ఆ కొండమీదనుండి ఈ కొండమీదకు, ఆ చెట్టుమీదనుండి ఈ చెట్టుమీదకు అనుచరులతో కలిసి దూకిదూకి అలసిసొలసిన వాడిని చూసి ఆయనతో అప్పటి దాకా దూకిన ఒక మహాబుద్ధిమంతుడు సలహా ఇచ్చాడు. “ఏమయ్యా, ఈ పిరికితనమేమిటి? ఈ భయమేమిటి? ఎందుకు ఇన్ని అనుమానాలు. భయగ్రస్త హృదయానికి శంకలు ఎక్కువ. ఆగాగు!! వాళ్ళెవరో నేను కనుక్కొని వస్తాను’’ అని వెళ్ళాడు. అలా వెళ్ళి వాళ్ళతో సమయోచిత సంభాషణ నెరపి, ఆ మహావీరులతో తన రాజుకు స్నేహాన్ని కుదిర్చినవాడు, బుద్ధిమతాం వరిష్ఠం అని మనచే పూజలందుకుంటున్న అంజనానందనుడు హనుమస్వామి.
Also read: ఫలితంపైన ఆసక్తి అనర్థదాయకం
అట్లా దూకినవాడు ఎవడు? మహాబలశాలి సుగ్రీవుడు. ఆయన సామాన్యుడా? తదనంతరకాలంలో రావణాసురుడి ఎదురురొమ్ముమీద ఒక్క తన్ను తన్ని వాడిని పడగొట్టగలిగినవాడు.
మనిషేమిటి, వాడి మనసేమిటి? అది ఏ దారిలో వెళుతుంది? ఈ సంగతి తెలిసినవాడు మన ప్రక్కన ఉంటే… లేదా అలాంటి మేధావిని వెతికి మనమే ఆయన పక్కన చేరితే ఎంత బాగుంటుంది?
జీవితంలో ప్రతిసమస్య మనస్సుకు సంబంధించినదే. పిల్లకు పెళ్ళి ఎప్పుడు చేయాలి? ఏ సంబంధం చూడాలి? ఈ వరుడు సరి అయినవాడా కాదా? పిల్లవాడికి ఏ చదువు చెప్పించాలి? ఇంజనీరింగా? ఆర్ట్సా? మెడిసినా? ఏదయితే వీడు వృద్ధిలోకి వస్తాడు? ఫలానా వ్యక్తితో నాకు ఎలా ఉంటుంది? మా బాసుకు నా మీద కోపం వచ్చింది. ఏం చేస్తాడో ఏమో?
ఎన్నో అనుమానాలు. బ్రతుకు భయాలు. భయం ఎంత పెరిగితే అంత ఆలోచనాశక్తి, విశ్లేషణా సామర్ధ్యము మనలో తగ్గిపోతాయి.
Also read: హృదయదౌర్బల్యం విసర్జించాలి
‘‘బావా పిరికితనం ఆవహించి నా సహజస్వభావాన్ని కోల్పోయి ధర్మమేదో అధర్మమేదో తెలియక కొట్టుమిట్టాడుతున్నాను నీ శిష్యుడనయ్యా, దారిచూపవయ్యా. నాకు శ్రేయస్కరమైనదేదో తెలుపవయ్యా’’ అని వేడుకున్నాడు కదా! ఇలా అడిగినవాడు ఎవడు? తక్కువవాడా? ముక్కంటిని మెప్పించి పాశుపతం సాధించినవాడు, ఒంటిచేత్తో క్రూరరాక్షసులైన నివాతకవచులను నిర్జించినవాడు, ద్రోణాచార్యుని ప్రియశిష్యుడు, మేటివిలుకాడు అర్జునుడు! పార్ధుడు! కిరీటి! విజయుడు!
కార్పణ్యదోషోపహతస్వభావాః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః!
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తే హం శాధి మాం త్వాం ప్రసన్నమ్! !
పిరికితనం సహజస్వభావాన్ని నాశనం చేస్తుంది. భయము ఆవరిస్తే ఎవడయినా అంతే. వాడు సుగ్రీవుడైనా, సుక్షత్రియుడైన అర్జునుడైనా. మనిషి స్వేచ్ఛగా బ్రతుకు భయంలేకుండా ముందుకు సాగాలి. అందుకే వివేకానందస్వామి ‘‘అభీ’’ ‘‘అభీ’’ అని పిలుపునిచ్చింది. సందేహాలు చుట్టుముట్టినప్పుడు ఏది సరి అయినదో ఏదికాదో అని తెలుపగల విజ్ఞుల సలహాలు తీసుకోవాలి.
Also read: ప్రాధాన్యక్రమం నిర్ణయించుకోవడం ప్రధానం
SEEK THE EXPERT ADVICE.