(కీ.శే.బాంబు ప్రథమ వర్ధంతి స్మారక జ్ఞాపిక)
కీ. శే. మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) ప్రథమ వర్ధంతి సందర్భంగా సత్యనారాయణ శాస్త్రి స్మారక వేదిక, పిఠాపురం ముద్రించిన ఏకవ్యక్తి సైన్యం సత్యనారాయణశాస్త్రి గ్రంథం విభిన్న రంగాలకు చెందిన విజ్ఞుల అభిప్రాయాలు, బాంబు సామాజికమాధ్యమాల రచనలు, ఆయన రాసిన ఉద్యమ కరపత్రాలు, ఆయన చేసిన అనితర సాధ్యమైన ఉద్యమాల వార్తాపత్రికలు, దాదాపు వంద వరకూ అరుదైన కుటుంబ చిత్రాలతో ఆయనతో ఏమాత్రం సంబంధం కలిగి ఉన్న వ్యక్తులూ, అలాగే పిఠాపురం భావోద్యమాలతో బాంధవ్యం గల ఆలోచనాపరులూ భధ్రపర్చుకుని తీరాల్సిన విలువైన జ్ఞాపికగా రూపొందింది!
Also read: ఆయన మార్గం మానవతావాదం
బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల ఫొటోలు మాత్రమే కాక రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అంతమంది అభిప్రాయాల్ని సేకరించడం, వాటన్నింట్నీ సరైన పద్ధతిలో విభజించి పొందుపర్చడం, ఎన్నడో రాసిన బాంబు రచనల నుండి మొదలెడితే ఆయన కుటుంబ సమేతంగా చేసుకున్న కార్యక్రమాలు, ప్రజాహిత నిరాహార దీక్షలు, చేసిన పోరాటాలు అన్నింటికీ ఒక సుస్థిరమైన స్థానం కల్పించడమే లక్ష్యంగా ఈ సంకలనం, ఒక ఆశ్చర్యకరమైన గ్రంథంగా రూపొందింది. ఎవరొప్పుకున్నా లేకపోయినా చరిత్ర నమోదు చేసిన రికార్డిది!
అంతటి మహత్కార్యంలో మాతోపాటు మీరు కూడా భాగస్వాములైనందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. కీ. శే. మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) స్మారక వేదిక సగర్వంగా, నభూతో నభవిష్యతి అన్న రీతిలో జిల్లాలో సంగతలా ఉంచి అసలు తెలుగు లోనే ఇప్పటి వరకు రాని విధంగా ఒక తండ్రిగా, పాత్రికేయుడి గా, తిరుగుబాటుదారుగా, ప్రజా కార్యకర్తగా, సత్యాన్వేషిగా కృషి చేసిన బాంబు అంతరాత్మని అక్షరాల్లో ఆవిష్కరించడం జరిగిందనీ, స్మారక సంకలనం చదివిన ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి పదేపదే అభినందించడం ఎంతో ప్రోత్సాహకరం!
ఎన్నో ప్రజాహిత స్రవంతుల్లో ప్రవహించిన తొంభై సంవత్సరాల పెద్దాయన, మానవ వాహిణి స్థాపకులు గరిమెళ్ళ నారాయణగారు ముంబాయి నుండి, విజ్ఞాన వేదిక నాయకులు డా. చెలికాని స్టాలిన్ రామచం ద్రాపురం, సామాజిక కార్యశీలి జయరావు గారు గుంటూరు జిల్లా భట్టిప్రోలు నుండీ, కందాళ సుబ్రహ్మణ్య తిలక్ ఫౌండేషన్, విజయ నగరం నుండి వచ్చిన పెద్దసాయి, విజయ తదితరులు, విశాఖపట్నం నుండి ప్రత్యేకంగా కార్యక్రమం కోసమే విచ్చేసి తన కోల్ కతా ప్రయాణాన్ని సాయంత్రానికి వాయిదా వేసిన శంకర్, ఇంకా తిరుపతి నుండి కుటుంబ సమేతంగా విచ్చేసిన దిలీప్, శరణ్య, రిషీకేశ్, రాయపూర్ నుండి వచ్చిన పది మంది బంధుమిత్రులు, ఇంకా చుట్టు ప్రక్కల విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర ప్రాంతాలవారు, స్థానిక శ్రేయోభిలాషుల సారధ్యంలో జరిగిన ఈ నివాళి కార్యక్రమం నిజంగా ఒక అపురూపం !
అందుకే ,మిత్రులు శ్రేయోభిలాషుల అభిలాష మేరకు అమూల్యమైన ఈ గ్రంథం సాఫ్ట్ కాపీ అత్యంత సన్నిహితులకు, ఆత్మబంధువులకు ఇలా పంపుతున్నాము. ఒక వ్యక్తి గతించిన ఏడాది కాలంలో ఆయన స్మారక చిహ్నంగా పది విశిష్ట ప్రచురణలు తీసుకు రావడం, అలాగే ఆయన జీవితానికి సంబంధించిన అనేక విషయాల్ని సంగ్రహించి విలువలతో కూడిన జీవన గమనానికి ప్రతీకగా అద్భుతమైన వ్యాస సంకలనం ప్రచురించడం నిజంగానే అరుదైన సంఘటనగా హితులు పేర్కొన్నారు, సంతోషం!
అందులో భాగంగా ఒక ఉన్నతమైన పౌర సమాజం కోసం, ఉత్తమమైన మానవీయ ప్రస్థానం కోసం తనకున్న పరిమితుల్లోనే అనునిత్యం అనితరసాధ్యమైన కృషిచేసి, మరణానంతరం కూడా తన కళ్ళనీ, దేహాన్నీ ఇతరుల కోసమే ఇచ్చేసిన ఆయన నిఖార్సైన ఆచరణవాది. ఆయన స్పూర్తితో రూపొందిన ఈ చిన్న గ్రంథాన్ని చదివాక మీ అంగీకారాల్ని, భిన్నాభిప్రాయాల్ని తప్పనిసరిగా తెలియజేస్తే భవిష్యత్తులో మా ఇతరేతర సమాజహిత కార్యక్రమాల రూపకల్పనకి నిర్మాణాత్మక చేయూత ఇచ్చిన వారౌతారని మనవి. కాన, చదివి మీ అభిప్రాయాలతో స్పందించాల్సిందిగా కోరుతూ, విమర్శలకి ఆహ్వానం!
ఇట్లు
సత్యనారాయణ శాస్త్రి స్మారక వేదిక
పిఠాపురం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్
Also read: ఏకవ్యక్తి సైన్యం, మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు)