మరీ పొద్దున
తలుపు తెరవగానే
గాలి కవిత్వంలా చుట్టుముట్టింది.
ఆకుల మీంచి
ఒక్కొక్క బొట్టే
రాలి పడుతున్నట్టు
మనసులో పదాలు తయారౌతున్నాయి.
ఏదో ప్రాక్తన సంవేదన
దిగంచలాల నుంచి ప్రసారమౌతున్నట్టు.
త్వర పడాలి
వార్తాపత్రిక రాకముందే
ఈ ప్రక్రియ ముగిసి పోవాలి.
రాత్రంతా కలల కల్లాపి చల్లి
శుభ్రపరురచుకున్న మనసు వాకిలి యిది
చెత్త చేరకుండా చూసుకోవాలి.
పడనే పడింది
గుండ్రంగా రెక్కలు ముడిచిన పక్షిలా
గోడను తాకి
తలుపు సందును మరింత వెడల్పు చేస్తూ.
ఆ కుర్రవాడి గురిని మెచ్చుకోవాలి
ఆకలి నేర్పిన ప్రావీణ్యమది.
ఏముంటుంది పేపర్లో!?
రాజకీయ వేటగాళ్లు బయలుదేరుతారు
గుమ్మడి కాయంత శీర్షికలు.
భాష ఇంత మలినం కావటం
మునుపెన్నడూ చూడలేదు.
రాత్రంతా నిద్ర కాచి
పాత్రికేయులు చెక్కిన అశబ్ద శిల్పాలు.
ఇప్పటిదాకా ఎంత ఫ్రెష్‌గా వున్నాను
హఠాత్తుగా చేతులు వొణుకుతున్నాయి
పేపర్ నిండా అకవిత్వం
కొన ఊపిరి మానవత్వం
అబద్ధాలు; అశుద్ధాలు.
పురుడు పోసుకుంటున్న
వాక్యాలు తెగి పడుతున్నాయి.
విషాద మేమిటంటే
ఇవాళ పుట్టకుండానే
ఓ కవిత చచ్చిపోయింది.
Also read: ప్రేమ తత్త్వం
Also read: పరామర్శ
Also read: గ్రంథోపనిషత్
Also read: శీలా వీర్రాజు స్మృతిలో..
Also read: Cataract సర్జరీకి ముందు