Sunday, December 22, 2024

జ్ఞాని పరమాత్మకు మిక్కిలి ఇష్టుడు

భగవద్గీత – 32

ఆపదమొక్కులవాడా, అనాధరక్షకా! కాపాడవయ్యా, ఎన్నిమెట్లెక్కినా కానరావేమయ్యా. అంటూ ఆర్తితో ఆ ఏడుకొండలవాడిని ప్రార్ధిస్తాం!

ఎందుకు?

అనంతుడు, సర్వశక్తిమంతుడు అయిన ఒకడు ఈ లోకాలను పరిపాలిస్తున్నాడన్న  నమ్మకం ఉండటంచేత! తనను ఈతి బాధలనుండి కాపాడేవాడొకడున్నాడనే విశ్వాసంతో ఆ ఒక్కడిని ప్రార్ధించేవాడొకడు! వాడు ‘‘ఆర్తుడు’’!

Also read: జీవరూప పరాప్రకృతి

అసలు, ఈ ఏడుకొండలవాడెవ్వడు? వాని రంగేమి? వాని రూపమేమి? వాని గుణమేమి!

నల్లగా ఎందుకున్నాడు?

ప్రజల పాపాలు పరిహరించటం వల్ల రోజు రోజుకీ నల్లగా మారి పోతున్నాడా! అనంతమయిన ఆకాశం నలుపు. అనంతమైన సముద్రము నలుపు. ఈయన అనంతుడు కాబట్టి నల్లగా ఉన్నాడా!

ఇంత వైభవంగా వైష్ణవాలయాలు ఎందుకు ఉంటాయి?

జీవితం వైభవంగా గడపాలిరా నాయనా అని తెలియచెబుతున్నాయా! Life is a celebration, living is a festival అని మనకు తెలియచేస్తున్నాయా?

Also read: యోగి ఉత్తమోత్తముడు

మరి శివాలయాలు ఒక వైరాగ్యభావన మదిలో కలిగేటట్లు ఎందుకు ఉంటాయి?

శ్మశానంలో వైరాగ్యం కాక మరేముంటుంది? శివుడుండే చోటు శ్మశానం కదా! అంటే శివాలయం రుద్రభూమి ఒకటేనా? ఎట్లా జీవితం గడిపినా చివరి మజిలీ ఇదే అని చెప్పటానికేనా!

ఆయన విష్ణువు! మహావైభవమూర్తి.  positive infinity అనుకుందాం! ఈయన శివుడు. మహావైరాజ్ఞమూర్తి. negative infinity అనుకుందాం!

మరి ఈ ఇద్దరూ ఒకటేనా!

ఒక సరళ రేఖకు కుడివైపున విష్ణువు ఉన్నాడనుకోండి ఎక్కడో అనంత దూరంలో! ఈయనను వెతుక్కుంటూ ఒకడు బయలు దేరతాడు! అదే సరళ రేఖకు ఎడమవైపున శివుడు ఉన్నాడనుకుందాం! ఈయనను వెతుక్కుంటూ ఇంకొకడు బయలుదేరాడు! అనంత కాలంలో ఇద్దరూ ఒకేచోటికి చేరతారు!

Also read: సంకల్పాలు పెంచుకోవాలా, తుంచుకోవాలా?

ఎందుకు? విశ్వం వంపు తిరిగి ఉన్నది అని కదా Science చెపుతున్నది! ఒక గుండ్రని వస్తువు మీద ఒకే point వద్దనుండి చెరొకవైపుకు ఇద్దరూ తిన్నగా బయలు దేరితే! చివరకు ఇద్దరూ ఒకే చోటికి చేరుకుంటారు!

శివకేశవులకు అభేదము అని ఇలా ఒక జీవితకాలంలో తెలుసుకోగలమా?

అయితే ఈ విధమయిన భావనతో అనంతుడిని కనుక్కోవచ్చునా? ఆయన భావాతీతుడుకదా! ఇలాగ భగవంతుడి గురించి వెతికేవాడు! నీవెక్కడ ఉన్నావో చెప్పవయ్యా అని ప్రార్ధించేవాడు… ‘‘జిజ్ఞాసువు’’

మనకు డబ్బు అవసరం.ఎవడినో అడిగేదేమిటి? ఆ లక్ష్మీ దేవి పెనిమిటిని అడిగితే పోలా? ఆయనే ఇస్తాడు! ఆయన ఇచ్చినదాంట్లో ఆయనకే కమిషన్‌ ఇద్దాం అని ఆయన గురించే ఆలోచించేవాడు. ‘‘అర్ధార్ధి’’

ఇక ప్రపంచమంతా తిరిగి తిరిగి ఆయన ఎక్కడో లేడు నా హృదయం లోనే ఉన్నాడు అని తెలుసుకొని… ‘‘నివ్వారశూక వత్తన్వీ పీతా భాస్వత్యణూపమా! తస్యశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః’’. వడ్లగింజ కున్న ముల్లంత సూక్ష్మరూపంలో మన హృదయం అడుగునే పసుపురంగులో వెలుగుతూ మన గుండెల్లోనే కొలువున్నాడు ఆ పరమాత్మ అని తెలుసుకుని ప్రపంచమంతా భగవత్స్వరూపమే అని ప్రార్ధించేవాడు… ‘‘జ్ఞాని’’

ఈ విధంగా ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధార్దులు, జ్జానులు అని ఆయన భక్తులు నాలుగు రకాలట!

చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున

ఆర్తో జిజ్ఞాసురర్ధార్ధీ జ్ఞానీ చ భరతర్షభ!

వాస్తవంగా ఆయన ఎవ్వరో తెలుసుకొన్న జ్ఞాని అత్యుత్తముడు. అతడు నాకు మిక్కిలి ఇష్టుడు అని పరమాత్మ చెపుతున్నాడు!

Also read: ఆహారవ్యవహారాదులలో సంయమనం

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles