Tuesday, January 21, 2025

ఒక్కడు విశ్వనాథ

రచన: శ్రీ రమణ

ఒక్కడు విశ్వనాథ

అది ఒక విశ్వవిద్యాలయం. మన సాంప్రదాయాలు కట్టుబాట్లు చెదరరాదని గస్తీ తిరిగిన యుద్ధనౌక! గాఢ ప్రతిభాశాలి. ధిషణాహంకారి. ఆంధ్ర సాహిత్య క్షేత్రంలో విశ్వనాథ సత్యనారాయణ చేయని సేద్యం లేదు, పండించని పంట లేదు. తెలుగుజాతి పట్ల విశ్వనాథకు అలవిమాలిన ఆపేక్ష. ఉత్తరాదిన పుట్టి పెరిగిన రాముడు, విశ్వనాథ ప్రాపకంలో తెలుగురాముడు అయినాడు. నా రాముడని తనివితీరా కలవరించి పలవరించారు. విశ్వనాథకున్న అనుచర వర్గం, శిష్య వర్గం మరొకరికి లేదు. ఇష్టులు, అయిష్టులు కలిసి విశ్వనాథను నాడు నేడు కూడా సజీవంగా ఉంచుతూ వస్తున్నారు.  సెప్టెంబర్10  (ఈరోజే) ఆయన జయంతి. ఈ సందర్భంగా ఈ ‘వివరం’.

 యుద్ధనౌక

సాహిత్యం, సంస్కృతి అవిభాజ్యమని, వాటి ఉద్ధరణ కూడా ఏకబిగిని జరగాలని విశ్వనాథ విశ్వాసం. మన దేశ రాజకీయ రంగంలో పండిత మదన్ మోహన మాలవ్యా గారెలాంటివారో, సాహిత్య రంగంలో సత్యనారాయణ అలాంటివారు. ఎన్ని ఎదురుదాడులు తగిలినా, తాను నమ్మిన సిద్ధాంతాలను వీడలేదు. తన మతం మార్చుకోలేదు. అందుకే ఆయనొక యుద్ధనౌక. ఒక మహాశిల్పి గొప్ప ఆలయాన్ని నిర్మించ సంకల్పించాడు. ఏడు ప్రాకారాలు, గాలి గోపురం, ముఖ మండపాలు, సింహద్వారాలు, మహాగోపురం, కోవెల కొలను, చుట్టూ మెట్లు… యింకా ఎన్నో కలిస్తే ఆలయం అవుతుంది. ఆ బృహత్కార్యాన్ని చేస్తూ మధ్య మధ్య ఆ శిల్పి కొన్ని చెక్కుళ్లను రూపొందిస్తాడు. విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షం మహాలయం. సమాంతరంగా వారు వెలువరించిన ఖండకావ్యాలు, లఘు కావ్యాలు, నవలలు, నాటకాలు, గీతాలు, ప్రసంగ వాక్యాలు కల్పవృక్షంతో పాటు పెరిగిన పొగడలు, పొన్నలు, పున్నాగలు. వి॥బాగానే రాస్తారు గానీ ఒక పట్టాన అర్థం కాదనేవారున్నారు. ‘పాషాణపాక ప్రభూ’ అని సంబోధించినవారున్నారు. అయినా కల్పవృక్ష మహా నిర్మాణాన్ని ఆయన ఆపలేదు. రామాయణంలో ముఖ్య ఘట్టమైన సీతా స్వయంవరాన్ని సీస పద్యంలో వర్ణించి, తర్వాత తేటగీతిలో:

 అతని దృష్టికి జానకి యాగలేదు

 అతని కృష్టికి శివధనుస్సాగలేదు

 సీత పూజడ వెన్నుగా శిరసు వంచె

 చెరుకు గడవోలె నడిమికి విరిగె ధనువు.

 సీతను చూపిన తీరు ఇది. కవి సమ్రాట్‌కి సందర్భ శుద్ధి ఉంది. ఒక్కొక్క సందర్భానికి తగినట్టు పూర్వకవిని ఆవాహన చేసుకుని ఆ మార్గంలో కథ నడిపించారు. ఆదికవి నన్నయ్య నుంచి నాచన సోమన్నదాకా కల్పవృక్షంలో సాక్షాత్కరిస్తారు. మీ కల్పవృక్షం చాలామందిని కదిలించింది. దాని ప్రేరణలో విషవృక్షం కూడా మొలిచిందండీ అంటే ‘‘ఔనౌను, ఎవరి మార్గం వారిది. నేను వెర్రివాడిని. నాకు ఏడు జన్మలకు గాని ముక్తి లేదు. వారిది వైరిమార్గం. జయ విజయులు చూపిన దారి. మూడు జన్మలకే ముక్తి!’’ అనేవారు, అలవాటుగా ఉండే థూ… థూల మధ్య.

వేయిపడగలు

తెలుగునాట చాలా ప్రాచుర్యం పొందిన విశ్వనాథ నవల వేయి పడగలు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన నవలల పోటీ కోసం రాశారు. వెయ్యి పేజీల నవల. ఆ పోటీలో కడదాకా నిలచిన నవలలు మూడు. వేయి పడగలు, అడివి బాపిరాజు నారాయణరావు నవల, చలం మైదానం. మైదానం పేజీల నియమావళికి నిలవలేదు. ఇక నిలిచినవి రెండు. విశ్వవిద్యాలయం ప్రకటించిన వెయ్యి రూపాయల బహుమతిని చెరి సగం చేశారు. బాపిరాజుకి అయిదు వందల యాభై, విశ్వనాథకి అయిదు వందలు ఇచ్చారు. అందులో కథానాయకుడు నారాయణరావు బాపిరాజే.

ధర్మరావు విశ్వనాథే

వేయి పడగల కథానాయకుడు ధర్మారావు విశ్వనాథే. వందేళ్ల తెలుగు జీవితాన్ని అద్భుతంగా చిత్రించి, వేయి పడగలు నవల తెలుగుజాతి స్వీయకథ అనిపించారు. నైతిక సూత్రాల పట్ల, సాంప్రదాయ జీవన మార్గం పట్ల విశ్వనాథకు ప్రగాఢ గౌరవం, తిరుగులేని విశ్వాసం ఉన్నాయి. ఆయన వేయి పడగలు నవలలో ప్రతిపాదించిన అంశాలు, వారి తర్వాతి నవలలకు విస్తరించి కనిపిస్తాయి. విశ్వనాథ ఏకవీర నవల తెలుగు కాల్పనిక సాహిత్యంలో విలక్షణమైనది. నాలుగు పాత్రలను నాలుగు స్తంభాలుగా మలచి మహామండపాన్ని నిర్మించారు.

మరో కడలి తరంగం చెలియలికట్ట

మధురై దగ్గరి వైగై నది చుట్టూ ఈ కథ తిరిగి, చివరకు వైగై నదిలోనే ముగుస్తుంది. ప్రేమ, ప్రణయం ఎంతటి గొప్ప ఉద్వేగపూరితమైనవి అయినా, శృంగార భావాలు మధురమైన కోరికలు ఎంతటి విశృంఖలమైనవి అయినా, హద్దు మీరకుండా నిగ్రహించుకోవడమే భారతీయ సంప్రదాయమని ఏకవీర తీర్మానిస్తుంది. విశ్వనాథ చెలియలికట్ట నవల మరో కడలి తరంగం. అప్పట్లో ‘ఫ్రీ లవ్ సొసైటీ’ పేరుతో ఒక సమాజం తెరమీదకు వచ్చింది. ఆ వెర్రితలని దృష్టిలో పెట్టుకుని చెలియలికట్ట రచించారు. ఇది కేవలం సాంఘిక నవల మాత్రమే కాదు, మానసిక పరిణామ దశలను విశ్లేషించిన ఒక సూత్ర గ్రంథం. సిగ్మండ్ ఫ్రాయిడ్ నుంచి భారతీయ మనో విశ్లేషణలన్నింటినీ పుక్కిలిపట్టిన విశ్వనాథ చెలియలికట్ట నవలలో రత్నావళిని విశిష్టంగా రూపొందించారు. చివరకు ఆమెనొక కర్మయోగినిగా మలచారు. చెలియలికట్ట చలం మైదానం నవలకి కౌంటర్‌గా రాశారని కొందరంటారు.

కాని అది కాదు. బరి తెగించిపోతున్న నైతిక సూత్రాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చెలియలి కట్ట. నవలల్లో యదార్థ జీవన చిత్రణ చేసే సంప్రదాయాన్ని అంటే డాక్యుమెంటరీలను విరివిగా విశ్వనాథ రాశారు. వేయి పడగలు నవలలో చాలా పాత్రలకు మాతృకలు ఉన్నాయి. తెరచిరాజు నవల ముంజులూరి కృష్ణారావు జీవితం. ఆయన గొప్ప నటుడు. విశ్వనాథ కొంతకాలం కరీంనగరం కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. అక్కడ లాయర్ వృత్తిలో ఉంటూ సంగీతాన్ని ఉపాసించే గాయక సార్వభౌముడు నారాయణరావు ఉన్నారు. కరీంనగర్ పరిసరాలలోనే మ్రోయు తుమ్మెద అనే వాగు ఉంది. నిరంతరం లయాత్మకంగా ధ్వనిస్తూ ప్రవహించే ఆ వాగు పేరుతో ఆ సంగీత సార్వభౌముని జీవితాన్ని సాక్షాత్కరింపజేశారు. విశ్వనాథ నవలలన్నింటినీ ఒక లక్ష్యంతో ఒక ప్రయోజనంతో రాశారు. వాటిని చాలామంది ఆ విధంగా అర్థం చేసుకోలేదని విశ్వనాథ ఆవేదన పడేవారు. విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, దమయంతి స్వయంవరం వీటిలో విశ్వనాథ వ్యంగ్య వైభవపు అంచులు చూడచ్చు. బద్దన్న సేనాని, వీరవల్లడు వీటిదొక తీరు. మా బాబు, జేబుదొంగలు మరొక తీరు. తర్వాత్తర్వాత ఎమెస్కో పాకెట్ బుక్స్‌గా రాసిన కాశ్మీర పట్టమహిషి, చిట్లీ చిట్లని గాజులు, దిండు కింద పోకచెక్క, దంతపు దువ్వెన లాంటి కాశ్మీర కథల పరంపర వేరొక తీరు.

కండపుష్టిగల రచనలు

విశ్వనాథ ఖండ కావ్యాలు రాసినా, వచనం రాసినా, లఘు కావ్యాలు రాసినా కండ పుష్టి గల రచనలే చేశారు. తన ప్రతిభను గ్రంథాలలోకి దించి, జాతికి అందించగలిగిన మహానుభావుడు విశ్వనాథ. సనాతన భారతీయ తత్వాన్ని త్రికరణశుద్ధిగా నమ్మిన జ్ఞాని. విశ్వనాథ రచనలలో ‘జీవుడి వేదన’ అనే మాట తరచూ వినిపిస్తుంది. ఇది ఆయన స్వేచ్ఛాచింతనకు ఒక ఉదాహరణ.

ప్రతి మనిషికీ కొన్ని తనవైన ఆలోచనలు ఉంటాయి. సొంత ఘోష ఒకటి ఉంటుంది. అదే ఆయన ప్రతిపాదించిన జీవుడి వేదన.

దీనిని విశ్లేషించి, సమగ్రంగా పరిశోధిస్తే ఒక వినూత్న తాత్విక సిద్ధాంతం ఆవిష్కృతమవుతుంది. విశ్వనాథ నాటకాలలో వేనరాజు, నర్తనశాల, అనార్కలి ప్రసిద్ధమైనవి. ప్రాచీన కవుల రచనలపై విశ్వనాథ విశ్లేషణ వ్యాసాలు నేటి విమర్శకులకు పాఠ్య గ్రంథాలు. ఏ కవిని ఎక్కడ ఎలా దర్శించాలో ఆయనకు తెలుసు.

‘మెంతి మజ్జిగ రుచి మెంతి మజ్జిగదే. పరవాన్నం రుచి పరవాన్నందే. బాగుండడమంటే వాటి జీవలక్షణాలను బట్టి తేల్చాలి’… ఇలాంటి కొలత బద్దలతో విశ్వనాథ విమర్శ సాగుతుంది. సాహిత్యంలో ఉన్న శాఖలన్నీ విశ్వనాథకు ఆటపట్లు. కోకిలమ్మ పెండ్లి, కిన్నెరసాని పాటలు, ఉయ్యాల తాళ్లు లాంటి గేయ కావ్యాలు, విశ్వనాథ మధ్యాక్కరలు వేటికవే ప్రత్యేకం.

బెజవాడే కార్యక్షేత్రం

1895 సెప్టెంబర్ 10న కృష్ణా జిల్లా నందమూరులో జన్మించిన విశ్వనాథ కార్యక్షేత్రాన్ని కడదాకా బెజవాడనే చేసుకున్నారు. విశ్వనాథకు సాహిత్యంలోనే కాదు, జీవితంలోనూ ముందుచూపు ఉంది. తన పుస్తకాలు కనుమరుగు కాకుండా కొత్తతరాల వారికి లభిస్తూ ఉండాలంటే, స్వయంగా తనే ఒక ప్రచురణ సంస్థని స్థాపించి ముద్రించాలని అనుకున్నారు. ‘విశ్వనాథ సత్యనారాయణ అండ్ కో’ని ప్రారంభించారు. ఆయన రచనలన్నీ అప్పటికీ ఇప్పటికీ ఆ సంస్థ పేరు మీదే వెలువడుతున్నాయి. విశ్వనాథ సహస్ర మాసోప జీవి. పొందతగిన అన్ని గౌరవాలూ పొందారు.

 తీసుకోవలసిన అన్ని బిరుదులూ తీసుకున్నారు. ఆనాటి ప్రముఖులు పి.వి.నరసింహారావు, తెన్నేటి విశ్వనాథం, టంగుటూరి ప్రకాశం, బెజవాడ గోపాలరెడ్డి, కళా వెంకటరావు, మండలి కృష్ణారావు ఆయన శిష్యవర్గంలోని వారు. విశ్వనాథ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగా, శాసన మండలి సభ్యులుగా తమ సేవలు అందించారు. జాతీయోద్యమం నేపథ్యంలో తన మొదటి నవల ‘అంతరాత్మ’ని ప్రారంభించారు గాని, అది అసంపూర్ణంగానే మిగిలింది. ప్రచురితమైన తొలి నవల ఏకవీర.

భోజన ప్రియుడు

విశ్వనాథ మంచి భోజనప్రియులు. ఆయన రుచులు వింతగా ఉండేవి. తీవ్రస్థాయిలో ఆవకాయ కలుపుకుని, ఆ ముద్ద తింటూ పచ్చిమిరపకాయ కొరుక్కునేవారు. అదీ ఆంధ్ర పౌరుషం! విశ్వనాథ సమకాలికులెవరూ సామాన్యులు కారు. చెళ్లపిళ్లవారు విద్య నేర్పిన గురువులు. అప్పుడప్పుడే రకరకాల ఇజాలు రెక్క విప్పుతున్న రోజుల్లో, విశ్వనాథ ఒంటరిపోరుకి తలపడ్డారు. తలపడి నిలిచారు. నిలిచి గెలిచారు. శతాధిక గ్రంథకర్త. ప్రతి గంథం ఒక ప్రత్యేకతను సంతరించుకుని బతికి బట్టకట్టింది.

విశ్వవేదన

జీవితాన్ని సంపూర్ణంగా తరచి చూసినవాడు, అర్థం చేసుకున్నవాడు విశ్వనాథ. హాలాహలం ఎలాంటిదో తెలుసు, అమృతమేమిటో తెలుసు. ‘‘బాల్యంలో తల్లిని, యవ్వనంలో భార్యని, వృద్ధాప్యంలో కొడుకుని పోగొట్టుకున్నవాణ్ని. వేదనకి అర్థం నాకు తెలిసినంతగా మరెవరికి తెలుస్తుంది’’ అన్నారొక చోట. విన్నవారికి కనులు చెమర్చాయి. నూత్న యవ్వనంలో అంటే ఇరవై రెండేళ్ల వయసులో విశ్వనాథ రాసిన పద్యాలలోంచి – అతి సామాన్యమైన, సార్వజనీనమైన విషయాన్ని చెప్పి, కనిపించని దేవుణ్ని ప్రశ్నార్థకం చేశారు. ఇది ఎన్నిసార్లు చదివినా మనసు ఆర్ద్రమవుతుంది. ఒక దిగులు, ఒక అశక్తత ఆవరిస్తాయి. విశ్వనాథ సామాన్యుడు. ఆయన ఆలోచనలు అసామాన్యాలు.

ఈ పద్యపాదాలు శరణాగతికి పరాకాష్ట

నా కనుల యెట్టయెదుటన నా జనకుని

 నా జనని కుత్తుకలను కోసి నన్నెడిగెన

 తండు ‘‘నే దయాంబుధిని కాదా’’ యటంచు

 ఓ ప్రభూ! యగునంటి నే నొదిగి యుండి

 నా కనుల యెట్టయెదుటన నా లతాంగి

 ప్రాణములు నిల్వునందీసి యడిగెనను న

 తండు ‘‘నే దయాంబుధిని కాదా’’ యటంచు

 ఓ ప్రభూ! యగునంటి నేనొదిగి  యొదిగి

 తనుజు కుత్తుక నులిమి తానను నడిగెన

 తండు ‘‘నే దయాంబుధిని కాదా’’

 యటంచు

 ఓ ప్రభూ! యగునంటి నేనొదిగి పోయి.

ఉపమా విశ్వనాథస్య

విశ్వనాథ ఉపమానాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇంతకుముందు ఎక్కడా మనకు కనిపించవు. తర్వాత కనిపించడం లేదు. కారణమేమంటే విశ్వనాథ చూపు వేరు.

  • ఆమె మంచముపై పరున్న గోధుమవన్నె త్రాచువలెనున్నది.
  • ఒంటినిండ మసి పూసికొనిన దొంగవలె సంజ చీకటి తొంగి చూచినది.
  • జొన్న చేనిలో మంచెయే గాని సౌధము.
  • ఆమె వదనము పావురాయి పొట్టవలె మృదువుగా తళతళలాడుచున్నది.
  • ఆమె కంకె విడిచి మురువు వొలుకు పంటచేను.
  • ఆ సువాసనల చేత దీపం ఆరిపోవునేమోనని భయపడితిని.
  • ఇంద్ర ధనుసు ముక్క పులి తోకలా ఆకాశంలో కనిపిస్తోంది.
  • శరదృతువులో కొంగలబారు ఎగురుతుంటే, ఆకాశమనే పాముల చిన్నదాని మెడలోని నత్తగుల్లల పేరులా వుంది.
  • గుమ్మడి పువ్వులో కులికే మంచు బిందువు, తట్టలో కూర్చుండబెట్టిన నవవధువులా తోచింది.
  • గుండెలపై బోర్లించి పెట్టిన పుస్తకము వలె పసివాడు పడుకున్నాడు.

గడ్డం అచ్చిరాని విశ్వనాథ

(డాక్టర్ భార్గవి తెలుగు చేసిన గీతాంజలి పుస్తక ఆవిష్కరణ వేళ – విశ్వనాథ పరంగా శ్రీరమణ చెప్పిన పేరడీ మాటలివి)

‘‘పసిబిడ్డ బాలాది యాతని చిత్తరువుని చూడగనే టాగూర్‌యని గుర్తింతురు. ఘనమైన గుబురు గడ్డము ఆయనకు దేశాంతర గుర్తింపు తెచ్చినది. పైగా రవీంద్రనాథుడు కవి కూడా యగుట గడ్డమునకు వన్నె పెరిగినది. గుర్తింపునకై యారాటపడుట మానవ నైజము. ఆరాటములనేక విధములు. బెల్లముకొండ సుబ్బరావని ఒకడున్నాడు. ఆతడు చక్కని గాత్రము గలవాడు. స్ఫురద్రూపి. కృష్ణ పాత్రను ధరించుటలో కొంత సాధన చేసి యున్నాడు. అప్పటికే కృష్ణ పాత్రలో పేరుగాంచినవారెందరో యున్నారు. అయినచో తనకెట్లు పేరు రావలెను? మీసములు పెంచినాడు. మీసాల కృష్ణునిగా వాసికెక్కినాడు. కృష్ణునికి మీసములుండెడివా, లుండనివాయని బెద్ద చర్చయే నడిచినది. అదియెల్ల మీసాల కృష్ణునికి బ్రాచుర్యము పెంచినవి. భావ కవులకేమి బెంచవలనో తెలియక జులపాలు పెంచుటకుద్యమించినారు. వారి కదియే నొక గుర్తింపు అయినది.

ఇది యొక వైచిత్రి!

‘‘నేను బందరులో నుండగా గడ్డము పెంచుటకు పూనుకొంటిని. దాని పర్యవసానమేమి? కొందరు సుస్తీ చేసినదా యనియు, మరికొందరు తిరుపతి మొక్కాయని, ఇంకొందరు చనువుగా మరల అక్కయ్యగారు నీళ్లోసుకున్నారా యనియు నడుగ నారంభించిరి. ఇది నాకు అచ్చిరాలేదని గ్రహించి, ఆదిలోనే యా జ్ఞాన వూడలను తొలగించుకుని తేటపడితిని.

‘‘అయినచో, గీతాంజలికిది యనువాదము. ఎన్ని అనువాదములు రాలేదు కనుక. అయిననూ ఎవని ఘోష వానిది. గీతాంజలి కావ్యములో మనకు పలుచోట్ల జీవుడి వేదన కానుపించును. డాక్టర్ భార్గవికిని నాకును యొక బాదరాయణ సంబంధమున్నది. నాది కృష్ణామండలము, ఆమెది పామర్రు, నదియును కృష్ణామండలము. ఆమె డాక్టరు. నేను కాను. అయినచో నేమైనది. ఈమెది ప్రసూతి వైద్యము. గ్రంథ రచనల విషయముననేమో గాని వైద్యమున మాత్రము హస్తవాసి మంచిదని వినియుంటిని. పురుళ్ల ఆసుపత్రిలోనొక వైచిత్రి యున్నది. ఒక్కరు వచ్చి ఇద్దరు వెళ్లెదరు. మిగిలిన చోట్ల నట్లు కాదు. ఒక్కరు వచ్చి యొక్కరు వెళ్లుటే గగనము. ప్రతి తల్లి జాతిని మరో తరమునకు నడిపించును. పచ్చి బాలింతలో ఆ గర్వము యా ఆనందము తొణికిసలాడుచుండును. అయినచో ఆనాటి నడికట్లు లేవు. పథ్యములు లేవు. పోషణలు లేవు. కన్నబిడ్డకు పాలిచ్చుట తల్లికవమానము. ఇంతకూనిది తెలుగు అనువాదము.’’

నార్లతో భేదాభిప్రాయాలా?

 సమకాలికులు విశ్వనాథని ఒక మెట్టుపైనే కూచోపెట్టి గౌరవించారు. కొందరాయన మార్గాన్ని అనుసరించలేక, కొందరాయన అభిప్రాయాలతో ఏకీభవించలేక దూరంగా జరిగారు. అభిప్రాయాల గురించి మాట్లాడితే, ఆయనకు చిరాకు. ఒకసారి ప్రసిద్ధ సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు, ‘‘వారికీ మాకూ అభిప్రాయ భేదాలున్నప్పటికీ…’’ అనేసరికి, వి॥స॥నా రెచ్చిపోయారు.

 ‘‘ఏడ్చి, సొంత అభిప్రాయాలున్నవారికి భేదాలు గాని, నీకూ నాకూ ఎందుకు? మీరు మార్క్స్‌ని భుజాన వేసుకుని, నేను శంకరాచార్యుని పట్టుకుని వేలాడుతున్నాం. మనకెందుకు అభిప్రాయ భేదాలు…’’ అని వాదన పూర్తిచేశారు. సినిమా లాంటి శక్తివంతమైన మాధ్యమాలతో సంబంధం లేకున్నా, తెలుగునాట ఆబాల వృద్ధులకు విశ్వనాథ పేరు యెరుకే. అంతగా తెలుగువారిని చదివించినవారు లేరు. అంతగా అర్థం కానివారూ లేరు. విశ్వనాథతో పోల్చదగినవారు విశ్వనాథ మాత్రమే! అందుకే ఒకడు విశ్వనాథ. కాదంటే ఒకే ఒక్కడు విశ్వనాథ.

(సెప్టెంబర్ 10, విశ్వనాథవారి జయంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles