- లబుషేన్ సెంచరీతో ఆస్ట్రేలియా 5 వికెట్లకు 274
- యువబౌలర్లతో భారత్ పోరాటం
భారత్- ఆస్ట్ర్రేలియాజట్లటెస్ట్ సిరీస్ ఆఖరి పోరాటం…బ్రిస్బేన్ గబ్బాలో నువ్వానేనా అన్నట్లుగా ప్రారంభమయ్యింది. పలువురు సీనియర్ ఆటగాళ్ల గాయాల కారణంగా.. యువబౌలర్లతో పోటీకి దిగిన భారత్ తొలిరోజు ఆటలో స్ఫూర్తిదాయకమైన ఆటతీరు ప్రదర్శించింది. పవర్ ఫుల్ కంగారూ బ్యాటింగ్ లైనప్ కు పగ్గాలు వేసి 5 వికెట్లకు 274 పరుగుల స్కోరుకే కట్టడి చేసింది. వన్ డౌన్ ఆటగాడు లబుషేన్ ఫైటింగ్ సెంచరీ సాధించి తనజట్టు స్కోరులో ప్రధానపాత్ర వహించాడు.
నాలుగుమార్పులతో భారత్…
సిడ్నీటెస్టులో పాల్గొన్న విహారీ,అశ్విన్,బుమ్రా, జడేజా సైతం గాయాలతో జట్టుకు అందుబాటులో లేకపోడంతో…భారతజట్టు నాలుగుమార్పులతో బరిలోకి దిగింది.పేసర్ బుమ్రా స్థానంలో నటరాజన్, స్పిన్ ఆల్ రౌండర్ అశ్విన్ కు బదులుగా వాషింగ్టన్ సుందర్ కు చోటు కల్పించారు. ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్, స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్
మయాంక్ అగర్వాల్ లకు తుదిజట్టులో చోటు కల్పించారు.ఆతిథ్య కంగారూటీమ్ మాత్రం గాయపడిన ఓపెనర్ పుస్కోవిస్కీ స్థానంలో మార్కుస్ హారిస్ కు అవకాశమిచ్చింది.
ఇదీ చదవండి: కంగారూల కోటలో భారత్ పాగా ?
వార్నర్ మరో ఫ్లాప్:
కీలక టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్న ఆస్ట్ర్రేలియాను భారత యువపేసర్లు సిరాజ్, శార్దూల్ ప్రారంభ ఓవర్లలోనే దెబ్బతీశారు. కంగారూ ఎటాకింగ్ ఓపెనర్ వార్నర్ ను మరోసారి…సిరాజ్ పడగొట్టాడు. రోహిత్ శర్మ పట్టిన సూపర్ క్యాచ్ తో వార్నర్ ఒక్క పరుగుకే అవుటయ్యాడు.మరో ఓపెనర్ మార్కుస్ ను శార్దూల్ పెవీలియన్ దారి పట్టించాడు. 5 పరుగులు చేసిన మార్కుస్ …శార్దూల్ బౌలింగ్ లో వాషింగ్టన్ సుందర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అయితే…ఆసీస్ వన్ డౌన్ లబుషేన్, టూ డౌన్ స్టీవ్ స్మిత్ మూడో వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో పరిస్థితి కొంతమేరకు చక్కదిద్దారు. మిస్టర్ డిపెండబుల్ లబుషేన్ తన సూపర్ ఫామ్ ను కొనసాగించి హాఫ్ సెంచరీ పూర్తి చేయగా…మరోవైపు స్మిత్ 36 పరుగుల స్కోరుకు సుందర్ బౌలింగ్ లో రోహిత్ శర్మ పట్టిన క్యాచ్ కు చిక్కాడు.
ఇదీ చదవండి: బ్రిస్బేన్ లో భారత క్రికెటర్ల అష్టకష్టాలు
లబుషేన్ కు నటరాజన్ చెక్….
145 బాల్స్ లో 3 బౌండ్రీలతో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన లబుషేన్ ..ఓ వైపు వికెట్లు పడుతున్నా తన పోరాటాన్ని కొనసాగించాడు. మిడిలార్డర్ ఆటగాడు మాథ్యూ వేడ్ తో కలసి కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. మొత్తం 195 బాల్స్ ఎదుర్కొని 9 బౌండ్రీలతో తన 5వ టెస్ట్ శతకాన్ని లబుషేన్ సాధించాడు.చివరకు 108 పరుగుల స్కోరుకు నటరాజన్ బౌలింగ్ లో కీపర్ పంత్ పట్టిన క్యాచ్ తో లబుషేన్ ఇన్నింగ్స్ కు తెరపడింది. మాధ్యూ వేడ్ ను సైతం నటరాజనే అవుట్ చేశాడు. 45 పరుగుల స్కోరుతో శార్దూల్ ఠాకూర్ కు వేడ్ క్యాచ్ ఇవ్వడంతో కంగారూటీమ్ 5వ వికెట్ నష్టపోయింది.ఆల్ రౌండర్ గ్రీన్- కెప్టెన్ టిమ్ పెయిన్ 6వ వికెట్ కు 61 పరుగుల అజేయభాగస్వామ్యంతో నిలవడంతో తొలిరోజుఆట ముగిసింది. పెయిన్ 38, గ్రీన్ 28 పరుగుల స్కోర్లతో క్రీజులో ఉన్నారు.
ఇదీ చదవండి: అటు కరోనా… ఇటు క్రికెట్ హైరానా!
భారత బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు, సుందర్, సిరాజ్, శార్దూల్ తలో వికెట్ పడగొట్టారు. తమిళనాడుకు చెందిన నటరాజన్, వాషింగ్టన్ సుందర్ తమ అరంగేట్రం టెస్టులోనేవికెట్లు పడగొట్టడం తొలిరోజు ఆటకే హైలైట్ గా మిగిలిపోతుంది.