భారతరత్న, ఆస్కార్ విజేత, చిత్రకారుడు,స్వరశిల్పి,కథానికా రచయిత. మానవతావాది సత్యజిత్ రే (1921-1992) భారతీయ సమాజపు నలుపు తెలుపుల్ని కళాత్మకంగా ప్రపంచానికి అందించారు. సృజనాత్మకతకు అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నతమైన అవార్డులు అధికంగా అందుకున్న భారతీయుడు ఎవరూ అని ప్రశ్నించుకుంటే, సత్యజిత్ రే ఒక్కరే అని సమాధానమిచ్చుకోవాల్సి ఉంటుంది. జీవితకాలంలో చేసిన నిర్విరామ కృషికి ఆయనకు 1992లో ప్రత్యేక ఆస్కార్ లభించింది. ప్రత్యేక ఆస్కార్ అవార్డు ఇంతవరకూ వేళ్ళమీద లెక్కించగలిగే ఐదారుగురికి మాత్రమే లభించింది. గ్రేటా గార్బో (1995), కారీ గ్రాంట్ (1969), చార్లీ చాప్లిన్ (1972), జేమ్స్ స్టువర్ట్, అకిరా కురసోవా (1989). ఇది మామూలుగా లభించే ఆస్కార్ లాంటిది కాదు. దాని కంటే ఎన్నో రెట్లు విలువైనది.
ఒక రకంగా ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో ఇదొక నోబెల్ బహుమతి లాంటిది. నిజానికి అంతకంటే ఎక్కువ. నోబెల్ బహుమతులు ప్రతిసంవత్సరం ఇస్తారు. ప్రత్యేక ఆస్కార్ అలా ఇవ్వరు. ‘‘అర్హత ఉన్నవారు’’ అని అనిపించినప్పుడే అప్పుడప్పుడు ఇస్తారు. దీనికంటే ఉన్నతమైంది ప్రపంచంలో ఇక లేదు. న్యూయార్క్ అకాడెమీ ఆప్ మోషన్ పిక్చర్స్ నుంచి టెలిగ్రాం అందగానే తనకు ఎప్పుడూ కలగని ఒక విస్మయానందం కలిగిందని రే చెప్పుకున్నారు. అది తను ఊహించని గౌరవమని చెబుతూ అందుకు కారణం కూడా చెప్పుకున్నారు. ఇతర పాశ్చాత్య చలనచిత్ర దర్శకుల సినిమాల వలె తన చిత్రాలు ప్రపంచంలో ప్రాచుర్యం పొందలేదనీ, పైగా బెంగాలీ భాషకు పరిమితమై పోవడం వల్ల తన దేశ ప్రజలకే సరిగా అందలేదనీ ఆయన అసంతృప్తి వ్యక్తపరిచారు. ఆ అసంతృప్తిని తగ్గించుకోవడానికి ఇక తాను ఎక్కువగా హిందీ, ఇంగ్లీషు భాషలలో సినిమాలు తీస్తానని కూడా ప్రకటించారు. ‘‘షత్రంజ్ కి కిలాడి’’ (చదరంగం ఆటగాళ్ళు) అనే హిందీ సినిమా 1977లోనే తీశారు. కానీ, ఆయన జీవిత సినిమా ఆ తర్వాత కొద్ది కాలానికే పరిసమాప్తమైంది.
చివరి దశలో రే తీసిన సినిమాలన్నీ గతి తప్పాయని ఒక తీవ్రమైన విమర్శ ఉంది. దానికి ఆయన చెప్పుకున్న సమాధానం కూడా సబబుగానే ఉంది. 1989కి ముందు గుండెపోటుతో తను తీవ్రమైన అస్వస్థతకు గురైనప్పుడు డాక్టర్లు తనను షూటింగ్ కు అనుమతిచ్చేవారు కాదనీ, అవుట్ డోర్ షూటింగ్ తగ్గించి, తన ఇరోగ్యానికీ, మానసిక సంసిద్దతకు సరిపోయే కథల్ని,తగిన పరిసరాల్ని మాత్రమే ఎన్నుకున్నాననీ, అందువల్ల తన కృషి ఒక పరిధిలో బిగించినట్లయిందనీ ఆయన చెప్పుకున్నారు. ఆయన తొలి చిత్రాలతో పోల్చితే చివరి రోజుల్లో తీసినవి భిన్నంగానే ఉన్నాయి. ఏ కళాకారుడైనా జీవితాంతం ఒకే పద్ధతికి అలవాటు పడి పని చెయ్యాలని కూడా ఎక్కడా లేదు కదా! అయితే అన్ని వేళలా కళాత్మక విలువలు నిలబెట్టడం చాలా అవసరం. ఆ పనిని ఆయన జీవితాంతం కొనసాగిస్తూ వచ్చారు.
‘పథేర్ పాంచాలి’తో మొదలుకొని ‘ఆగంతుక్’ దాకా గల సుదీర్ఘమైన ప్రయాణంలో ఆయన ఎన్నడూ అలసిపోలేదు. ప్రత్యేక ఆస్కార్ అందిన తర్వాత కూడా సినిమాలు తీయడం తనకు అత్యంత ప్రీతిపాత్రమైన విషయమనీ, పైగా అన్ని పనులు తనే చేసుకంటూ ఉండడంలో గొప్ప సంతృప్తి ఉందనీ ఆయన ఆనందంగా ప్రకటించుకున్నారు. జీవిత కాలంలో ఆయన తన చిత్రాలకు తానే స్క్రిప్టు రాసుకున్నారు. సంగీతం సమకూర్చుకున్నారు. కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకున్నారు. సినిమాటోగ్రఫీ… వగైరా వీలైనన్ని ఎక్కువ పనులు ఆయనే చేసుకునేవారు. ఇతరులపై ఆధారపడడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. ప్రతి చిన్న వివరమూ కాగితంపై రాసుకుని, స్కెచ్ గీసుకుని…షూటింగ్ ప్రారంభించే దర్శకులు బహుశా ప్రపంచంలోనే ఒకరిద్దరు ఉన్నారు. ఈ విషయంలో జపాన్ చలనచిత్ర దర్శకుడు అకిరా కురసోవాకు, సత్యజిత్ రేకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి.
సత్యజిత్ రే అనగనే దారిద్ర్యాన్ని భూతద్దంలో చూపించే దర్శకుడని కొందరు అభిప్రాయపడుతుంటారు. భారతీయ సమాజాన్ని కేంద్రకంగా తీసుకున్నప్పుడు అందులోని అన్ని విషయాలు వాటంతట అవే చోటు చేసుకుంటాయి. నిజానికి ‘పథేర్ పాంచాలి’ తర్వాత ఒకటి రెండు తప్ప దారిద్ర్యాన్ని ప్రత్యేకంగా చూపిన సినిమాలు లేవు. అలాగే ఉన్నత కుటుంబాల గూర్చి, వారి సమస్యల గూర్చి తీసిన ‘జల్సాఘర్’ (విలాస గృహం) లాంటి సినిమాలు కూడా ఉన్నాయని మనం మరచిపోగూడదు. సరైన అవగాహన లేని వాళ్ళు ఏదో ఒక అపోహకు గురవుతూ ఉంటారు. క్షుణ్ణంగా అర్థం చేసుకున్నవారికి ఇలాంటి అనుమానాలు రావు.
2 మే 1921న కలకత్తాలో జన్మించిన సత్యజిత్ రే, 23 ఏప్రిల్ 1992న కలకత్తాలోని ఒక నర్సింగ్ హోమ్ లో కన్నుమూశారు. భారత దేశమే కాదు, చలనచిత్ర ప్రపంచం యావత్తు ఒక కళాస్రష్టను కోల్పోయింది. ఒక టాగోర్ లేని లోటు ఎంతటిదో, ఒక సత్యజిత్ రే లేని లోటూ అంతటిదే! పుంఖాను పుంఖంగా వెలువడిన ఆయన సినిమా స్క్రిప్టులూ, కథానికలూ, వ్యాసాలూ ఏవీ తెలుగు పాఠకులకు పెద్దగా అందుబాటులోకి రాలేదు. రావల్సిన అవసరమైతే ఉంది. భారతీయ చలనచిత్ర రంగాన్ని ఒక కుదుపు కుదిపి, కొత్త మలుపు తిప్పిన ‘పథేర్ పాంచాలి’ స్క్రీన్ ప్లే ను – నేను తెలుగు పాఠకులకు అందించగలిగాను. అందుకు నాకెంతోసంతోషంగానూ, గర్వంగానూ ఉంటుంది. సమాంతర సినిమాకు సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ లో ప్రొ. సతీష్ బహదూర్ నాకు ‘పథేర్ పాంచాలి’ ఇంగ్లీషు అనువాదం అందించారు. అందువల్లనే నేను తెలుగులోకి తేగలిగాను. సతీష్ బహదూర్ పుణె ఫిలిం ఇనిస్టిట్యూట్ లో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ప్రొఫెసర్.
తన గురించి తాను: (రే జీవిత చరిత్ర నుంచి):
నేను చిత్రకారుడిగా జీవితం ప్రారంభించాను. కళాశాల చదువు పూర్తి చేసి, పట్టా పుచ్చుకున్న వెంటనే టారూర్ విశ్వవిద్యాయలంలో (శాంతినికేతన్లో)నా పేరు నమోదు చేసుకున్నాను. అయితే, దానికంటే ముందే నాకు సంగీతం మీద ఎనలేని శ్రద్ధ పెరిగింది. ఇటు భారతీయ, అటు పాశ్చాత్య సంగీత ధోరణుల్ని బాగా ఆకళింపు చేసుకున్నాను. మొదట సినిమాలు చూడడం ఇష్టంగా ఉండేది. క్రమంగా వాటి పట్ల ఆలోచన ప్రారంభమైంది. చిత్రలేఖనంలో కొంచెం చెయ్యి తిరిగి నిలదొక్కుకున్నాను. ఒక బ్రిటిష్ కంపెనీలో ఆర్టిస్ట్ డిజైనర్ గా చేరాను. ఉద్యోగరీత్యా తీరిక లేకపోయినా, నాలో సినిమా మాధ్యమం పట్ల శ్రద్ధ పెరగసాగింది. చివరకు ఇక సినిమా తీయకుండా ఉండలేనని అనిపించింది. ‘పథేర్ పాంచాలి’ సినిమా షూటింగ్ జరుగుతున్న దశలో నేనింకా ఉద్యోగంలోనే ఉన్నాను. జీతంలో చాలా భాగం సినిమా షూటింగ్ ల కోసం వెచ్చించేవాణ్ణి. పథేర్ పాంచాలి విడుదలై కొంత ఆలస్యంగానే విజయం సాధించింది. అప్పుడు గాని, నేను ఉద్యోగం వదలలేకపోయాను. అలాగే సినిమా కోసం పూర్తి సమయం కేటాయించలేకపోయాను.
బహుశా ఆ సమయంలోనే నేను రచన కూడా ప్రారంభించాను. నా సినిమాలకు నేనే స్క్రిప్టులు రాసుకునేవాణ్ణి. అడపాదడపా కథలు రాసి ప్రచురించేవాణ్ణి. అలాగే నా చలన చిత్రాలకు నేపథ్య సంగీతం కూడా నేనే కంపోజ్ చేసుకోవడం ప్రారంభించాను. కెమెరాతో నాకు కావల్సిన ఇమేజెస్ వెండితెర మీద చిత్రించుకోవడం ప్రారంభించాను. కళాకారులూ, సంగీతకారులూ ఎంతో మంది నాతో కలసి పని చేస్తుండేవారు. కాని, ప్రతి విషయంలో నా స్వంత ముద్ర ఉండాలని కోరుకునేవాణ్ణి. అన్ని విభాగాలు, అన్ని విషయాలు ఎంత స్వయంగా చూసుకున్నా సహాయకులు లేకుండా పని చేయడం కష్టంగా ఉండేది. కొంతమంది నమ్మదగ్గ మంచి వ్యక్తులు నాకు సినీ జీవితంలో సహకరించారు. నిజానికి కెరామెన్, ఎడిటర్, కండక్టర్ లాంటి వాళ్ళ సహాయం లేకుండా ఒకే వ్యక్తి సినిమా అంతా పూర్తి చేయగలిగితే అది ఎంతో గొప్ప విషయవుతుంది. అప్పుడు అది అతడి ‘స్వంతచిత్రం’ అని ఘంటాపథంగా చెప్పడానికి వీలవుతంది. అందువల్ల, ఇప్పుడొస్తున్న చలనచిత్రాలన్నింటిని దర్శకుడి చిత్రాలనడం కొంతవరకూ అసమజంసమే!
(‘రే’కు వందేళ్ళు)