On marriage by Khalil Gibran
తెలుగుసేత : సి.బి. చంద్రమోహన్
—————-
కలిసి జన్మించారు
ఎల్ల కాలం కలిసే ఉంటారు
తెల్ల రెక్కల మృత్యు దేవత
మీ జీవనాన్ని ఛిన్నాభిన్నం చేసినాగాని
మీరు కలిసే ఉంటారు!
ఔను, దేవుని నిశ్శబ్ద జ్ఞాపకంలో కూడా
మీ బంధం పదిలమే!
కానీ,
మీ కలయికలో కొంత ఎడం
ఉండనివ్వండి
స్వర్గ సమీరాలను మీ మధ్య
నాట్యమాడనివ్వండి!
ఒకరి నొకరు ప్రేమించుకోండి
కానీ, ప్రేమ – బంధం కానివ్వకండి!
మీ ప్రేమ, మీ ఆత్మల మధ్య
కదిలే సాగరంలా ఉండనివ్వండి
ఒకరి పాత్ర ఒకరు నింపుకోండి
కానీ,
ఒకే పాత్రలో తాగవద్దు!
ఒకరికొకరు వడ్డించుకోండి
కానీ, ఒకే కంచంలో తినవద్దు!
కలసి ఆడండి
పాడుకోండి
ఆనందించండి
కానీ, ఎవరికి వారుగానే ఉండండి!
వీణాతంత్రులు వేరు వేరైనా
కలిసి ఒకే లయబద్ధ సంగీతాన్ని అందిస్తాయి కాదా!
హృదయాలు పంచుకోండి
కానీ గుండె మార్పిడులు అనవసరం!
ఎవరి హృదయం వారికే!!
జీవనరేఖ మీ హృదయాలను
కలిపే ఉంచుతుందిగా!
ఎడంగా ఉంటూ కూడా
ఆలయ స్తంభాలు గుడిని మోసినట్లు,
మీ వ్యక్తిత్వాలు నిలబెట్టుకుంటూ
కలిసి ఉండండి!
మర్రి, రావి చెట్లు
ఒకదాని నీడలో మరొకటి పెరగదు కదా!
Also read: స్నేహం
Also read: భయం
Also read: అంకురాలు
Also read: మెల్లగా … మృత్యు ముఖంలోకి
Also read: ఓ…..మనిషీ!!
Also read: బంధన ఛేదిత – ఊర్వశి