అలసిన కనుపాపలపై గానలహరి తానై
అతడు రాత్రిలో అంతటా వ్యాపించి గలడు!
జాజ్వల్యమాన నక్షత్ర శిఖి
అతడి కళ్ళల్లో పాలపుంత కరుణ!!
జీవుల నిద్రాప్రపంచపు రేఖలని స్పృశించి
వారి స్వప్న సింధువులని తరించి
అతడు మాత్రం –
సరంగులా రేయెల్లా మేల్కొంటాడు
పరుశవేది విద్య నేర్చిన బైరాగి
రసాయనాన్ని బంగారంగా మార్చినట్టు
అతడెన్నో దుర్గంధ బతుకుల
గంధక కందకాల లోకి చొరబడి
పాత్రల ఆకృతులకి కాంచనపు సొగసు కూర్చగలడు!
అతడు ఫాల నేత్రుడు!
కపాల గాత్రుడు!!
సృష్టి సూత్రాలలోని వర్ణ వక్రతని
చిచ్చరకంట నిర్మూలించి
తిరిగీ సమదర్శనాన్ని చల్లగా ప్రసాదించగల చంద్రమౌళి!
ప్రాచీముఖ శిఖరాగ్రాన ఉదయించిన అర్కుడై
ప్రపంచాన్ని —
అక్షరపుంజంతో పలకరించగలవాడు!
తన ఊహల విపంచి మీద
కొనవేళ్ళతో సుతారంగా
వేల విద్యున్మాలికలని రాగాలుగా పలికించి
సందర్భోచింతంగా
కర్కశ శర్కరాయుతంగా
హృదయాలని మేల్కొలిపే కిన్నరుడు!
నిరంకుశ పాలకులపై తిరగబడిన
క్రోధోద్ధత రూపక శిల్పి!
రేపటి కలల కడిమి చెట్టు!
బడుగు జీవుల బాధల రాకాశి గాధలకి
చెవిపంకించే కర్ణుడు!
మనోభూమిని కలంతో పెళ్ళగించి
కన్నీటితో తడిపి
రచనల ముక్కారు పంటలనిచ్చే సైరికుడు!
భావస్ఫోరక భ్రాంతులలో
పలవరించే పసివాడు!
అందుకే —
శిశువుల చిరునవ్వుల కోసం
శాంతియుత లోకం కోసం
శిరస్సుతో ఉరికొయ్యనలంకరించిన సాహసి!
సాహిత్యాకాశాన
అతడు
నిత్య నూతన శశి!!
[ నైజీరియన్ కవీ … నాటక రచయితా … కెన్ సారోవివా త్యాగానికి — ఎంతో గౌరవంతో … ]
నోట్ : ఈ కవిత నా కవిత్వ పుస్తకం ” ద పబ్ ఆఫ్ వైజాగపట్నం ” లోది. పేజీలు 12- 13. రచన 4-11-1999 సమయం లక్షింవారం రాత్రి ఒంటిగంట.
Also read: రాట్నం తిప్పడం – నూలు వడకడం!
Also read: అంతా అంతే!
Also read: అమ్మా, నీకు వందనమే!
జయప్రభ
21-08-2018.