————–
( ‘ON GIVING’. FROM ‘THE PROPHET’ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
——————–
ఒక ధనికుడు ఆల్ ముస్తఫా ను” మాకు దాతృత్వం గురించి చెప్పండి”అని అడిగాడు.
ఆల్ ముస్తఫా చెప్పసాగాడు :
నిన్ను నీవు సమర్పించుకోవడమే నిజమైన దానం!
నీ అధీనంలో ఉన్న వస్తువులు దానం చేస్తే అది ఇచ్చినట్లు కాదు. నీ అధీనంలో ఉన్న వస్తువులు అంటే ఏమిటి?
రేపు అవసరం అవుతాయని భయంతో దాచి, కాపలా కాసేవే కదా!
ఇంకా ‘ రేపు‘ —
పవిత్ర నగరానికి యాత్రికులతో పాటు వెళుతూ,
ఎముకల్ని దారీ తెన్నూ లేని అడవిలో పాతిపెట్టి ఉంచిన , అతి తెలివి గల కుక్క కు
‘ రేపు‘. ఏమి తెస్తుంది?
అవసర భయం అంటే వేరే ఏముంది?
నీ అవసరాలు తప్ప!
నూతి నిండా నీళ్లు ఉంటే,
దాహం అంటే భయం ఎందుకు? —
నీకున్నది తీరని దాహం అయితే తప్ప !
—- కొందరు ,
వారికున్న దాంట్లో
అతి కొద్దిగా మాత్రమే దానం చేస్తారు.
అదీ గుర్తింపు కోసమే!
వారి రహస్య కాంక్షలు వారి దానాన్ని
అసంపూర్ణం చేస్తాయి!
—- ఇంకొందరు,
వారికున్న కొంచెం కూడా దానం చేసేస్తారు!
వారు జీవితంపై, దాని అనుగ్రహం పై
పూర్తి విశ్వాసులు.
వారి ఖజానా ఎప్పటికీ ఖాళీ కాదు!
—— మరికొందరు,
ఆనందంగా దానం చేస్తారు.
ఆ ఆనందమే వారికి ప్రతిఫలం!
—– కొంతమంది,
బాధపడుతూ దానం చేస్తారు
వారి బాధే వారికి పునీత స్నానం!
—- కొందరుంటారు,
వారు ఇవ్వటంలో ఏ బాధా పడరు.
ఏ ఆనందమూ పొందరు.
బుద్ధిపూర్వకంగా, మంచితనంతో
దానం చేద్దామనీ చేయరు!
— ఆవలి లోయలో ,
మిర్టిల్ మొక్క, తన సువాసనలు
పరిసరాల్లోకి వెదజల్లినట్లు–
దానం ఇచ్చేస్తారు!
ఇలాంటి హస్తాలు కలవారి నుండే
దైవం మాట్లాడతాడు!
వారి కన్నుల వెనుక నుండి
అవనిపై దరహాసం చేస్తాడు!
— అడిగినప్పుడు ఇవ్వటం మంచిది!
అడిగించుకోకుండా
అర్థం చేసుకొని ఇచ్చేది ఇంకా మంచిది!
ఔదార్యంతో చేసే
దానం పొందే వారి అన్వేషణ–
దానం ఇవ్వడం కన్నా ఎక్కువ సంతోషకరం!
మీరు నిలుపుకో దలచిన దంతా
ఏదో ఓ రోజు ఇవ్వాల్సిందే!
అందుచేత—
దానం చేయటం మీ వారసులకు వదలకుండా
మీరే ఆ దాన రుతువులను సొంతం చేసుకోండి!
మీరు తరచూ అంటూ ఉంటారు —
” నేను అర్హులకే ఇస్తాను” అని.
మీ పండ్ల తోట లో వృక్షాలు,
మీ పచ్చిక బయళ్ళలో ని సమూహాలు
అలా చెప్పవే?
అవి ఇవ్వటం కోసమే జీవిస్తాయి!
ఇవ్వకపోవడం అంటే నశించడమే!
దివారాత్రాలు పొందే అర్హత ఉన్న మనుషులు
మిగిలినవన్నీ మీ నుండి పొందడానికి అర్హులే!
జీవన సాగరం నుండి త్రాగటానికి
అర్హత ఉన్నవారు
మీ చిన్న ప్రవాహం నుండి తమ పాత్ర నింపుకునే
అర్హత కలిగి ఉంటారు!
స్వీకరించడంలో ఉన్న సాహసం,
ధైర్యం, కన్నా ( దయతో కాకుండా)
మెచ్చుకోదగ్గ చర్య ఏముంటుంది?
పొందేవారు వారి హృదయాలు చీల్చి,
ఆత్మలను బహిర్గత పరిస్తే —
ఆచ్ఛాద రహితమైన వారి అర్హత
నిర్మొహమాట మైన వారి ఆత్మగౌరవం–
ముందు మీరెంత?!
ముందుగా, మీకు మీరుగా
దాతగా లేక దానమిచ్చే సాధనంగానైనా
అర్హత సంపాదించుకోండి!
— నిజానికి,
జీవితమే జీవితాన్ని ప్రసాదిస్తుంది
దాతలు అనుకునే మీరు
దాన చర్యకు కేవలం సాక్షులే!
— దాన స్వీకారం చేసే మనుషులారా!
( మీరందరూ దాన స్వీకర్తలే)
కృతజ్ఞతా భారం మోయ కండి!
దాతలూ, స్వీకర్తలూ
ఒకే కాడి క్రిందకు రండి.
బహుమతుల రెక్కల పై
దాతలతో సహా విహరించండి.
మీ రుణం గురించి ఆలోచించడం అంటే
— నిష్కపటమైన
అవని తల్లిగా
దైవం తండ్రిగా కలిగిన—
దాత ఔదార్యాన్ని శంకించడంమే !
Also read: జాద్ మైదానము
Also read: బోధన
Also read: ఎర్ర మట్టి
Also read: వంతెన నిర్మాతలు