- క్రియాశీలక కేసులు పెరుగుతున్నాయ్
- కోవిడ్ నిబంధనలను గాలికి వదిలేశారు
- పాజిటివిటీ పెరుగుతోంది, ప్రమాదం పొంచి ఉంది
గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దిల్లీలో సగటున రోజుకు 1000 కేసులు నమోదవుతున్నాయి. దేశంలో పాజిటివిటీ రేట్ 0.56 శాతానికి చేరింది. క్రియాశీలక కేసులు పెరుగుతూ వుండడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ నిబంధనలను ఎక్కువమంది పాటించడం లేదు. మామూలు రద్దీతో పాటు వివాహ వేడుకలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోనూ ఎక్కువమంది విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. మాస్క్ లు పెట్టుకోవడం లేదు, భౌతికదూరం ఊసే లేదు. కరోనా వ్యాప్తి తగ్గిపోయిందని అనుకోవడం, వ్యాక్సిన్లు వేయించుకున్నాం కాబట్టి మనకేమీ అవదనే అతివిశ్వాసం పెరగడం క్రమశిక్షణా రాహిత్యానికి ప్రధానమైన కారణాలుగా చెప్పవచ్చు. కోవిడ్ ఇన్ఫెక్షన్ పెరుగుదలను ఆర్ వ్యాల్యూ ద్వారా అంచనా వేస్తారు.
Also read: మెరుగవుతున్న భారత్-బ్రిటన్ సంబంధాలు
పునరుత్పత్తి ప్రమాదం
ఆర్ వ్యాల్యూ అంటే రీ ప్రొడక్షన్ (పునరుత్పత్తి) నంబర్. దీని విలువ 1 ఉంటే, ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. అంతకంటే ఎక్కువ ఉంటే, ఎక్కువమందికి వ్యాపిస్తుందని అర్ధం చేసుకోవాలి. ఐఐటీ -మద్రాస్ బృందం చేసిన విశ్లేషణ ప్రకారం చూస్తే,ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆర్ వ్యాల్యూ 1.3 ఉంది. అంటే.. ప్రమాద ఘంటికలు మోగడం ప్రారంభమైంది. దిల్లీలో అది 2.1 దాటింది. ఇది ప్రమాదకరమైన పరిణామం. నాలుగో వేవ్ మొదలైందని అధికారికంగా ఎవ్వరూ చెప్పడం లేదు. ప్రజల్లో రోగనిరోధకశక్తి స్థాయిలు ఏ మేరకు ఉన్నాయి, గతంలో కరోనా వచ్చినవారికి మళ్ళీ సోకే ప్రమాదం ఉందా మొదలైన విషయాలపై స్పష్టత రావాల్సివుంది. ముంబయి, కోల్ కతా, చెన్నై మొదలైన మెట్రో నగరాల్లో కేసులు తక్కువగా ఉండడం కాస్త ఊపిరినిస్తోంది. అమెరికాలో తాజా విజృంభణకు కారణమని చెప్పుకుంటున్న వేరియంట్లు – భారత్ లో ప్రబలుతున్న వేరియంట్లు ఒకటేనని చెబుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశం. హైదరాబాద్ వంటి నగరాల్లో మాస్క్ ధారణపై ప్రభుత్వాలు అప్రమత్తం చేస్తున్నాయి. దిల్లీ ప్రభుత్వం కూడా మాస్క్ ధారణపై గట్టిగా ఆదేశాలు ఇచ్చింది. పాటించనివారికి జరిమానాలు తప్పవని హెచ్చరించింది. పిల్లలు, విద్యార్థుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించకపోతే చాలా పెద్దతప్పు చేసినవాళ్ళమవుతాం.
Also read: సంప్రదాయవైద్యం దేశానికి ఆయువుపట్టు
క్రమశిక్షణతో నిబంధనలు పాటించాలి
ధర్మల్ స్కానింగ్స్, భౌతికదూరం, ఆహారపదార్ధాలు, స్టేషనరీలు మొదలైనవాటిని ఇచ్చిపుచ్చుకోవడాన్ని పూర్తిగా నిషేధించాలి. కరోనా వ్యాప్తి వేగవంతంగా సాగుతున్న దిల్లీలో దానిని ఒమిక్రాన్ ‘బీఏ 2.12’ వేరియంట్ గా గుర్తించినట్లు తెలుస్తోంది. రెండోది బీఏ 2.10గా తేలింది. దీని ప్రభావం 11 శాతం ఉన్నట్లు వెల్లడైంది. ఈ రెండు వేరియంట్లు కలిసి 60 శాతం ప్రభావాన్ని చూపిస్తున్నాయని సమాచారం. గతంలో వచ్చిన ఒమిక్రాన్ కంటే ఈ వేరియంట్లలో వ్యాపించే లక్షణం ఎక్కువని అంటున్నారు. హరియాణా,ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర,మిజోరాం మొదలైన రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆర్ వ్యాల్యూ (పునరుత్పత్తి) గణనీయంగా పెరగడమే, కరోనా వ్యాప్తిని తిరగదోడింది. బూస్టర్ / ప్రీకాషస్ వ్యాక్సిన్లను అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో,వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా అమలవ్వాలి. ముఖ్యంగా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతుల పరిశుభ్రత మొదలైనవాటిని స్వయం క్రమశిక్షణతో పాటిస్తే, కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో ఆశించిన స్థాయిలో విజయం సాధించగలం. దుష్ప్రభావాల నుంచి స్వీయ రక్షణ పొందగలం. జీవితకాలం ( లైఫ్ టైమ్ )పనిచేసే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేంత వరకూ జాగ్రత్తగా ఉందాం.
Also read: కొత్త రాష్ట్రపతిపై ఊహాగానాలు