- కదిలిన తెలంగాణ ప్రభుత్వం
- పండుగ రోజుల్లో జాగరూకత
- ఆందోళన అనవసరం, జాగ్రత్తలు ప్రధానం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా ముసురుకుంటోంది. ముప్పు తప్పించుకుకోవడం ఎక్కువ శాతం మనలోనే ఉంది. కోవిడ్ నియమాలను క్షుణ్ణంగా పాటించడమే ప్రథమ కర్తవ్యం. రెండు డోసుల వ్యాక్సినేషన్ ను పూర్తి చేసుకోవడం ప్రధానమైన బాధ్యత. మాస్క్ వాడడం కీలకం, భౌతిక దూరాన్ని పాటించడం ఎంతో ముఖ్యమని నిపుణులు పదే పదే చెబుతున్నా, ఎక్కువమంది ఖాతరు చేయకపోవడమే ప్రమాదానికి ప్రథమ హేతువు. మాస్క్ వాడడంలో సహేతుకత లోపించడంపై శాస్త్రవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ తరహా మాస్కులు వాడడం ముఖ్యమో నిపుణులు సూచిస్తున్నారు.
Also read: సర్వోన్నత న్యాయపీఠంపై తెలుగు తేజం
సర్జికల్ మాస్కలే క్షేమం
వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఎక్కువగా ఉన్న ఒమిక్రాన్ విషయంలో సింగల్ లేయర్ మాస్కులను వాడకపోవడమే మేలని వారు చెబుతున్నారు. క్లాత్ మాస్కుల కంటే మూడు పొరల సర్జికల్ మాస్కులను వాడడం ఎక్కువ క్షేమదాయకమని తెలుసుకోవాలి. ఎన్ 95, కె 95 మాస్కులు వాడమని నిపుణులు ప్రధానంగా సూచిస్తున్నారు. దానిపైన కావాలంటే క్లోత్ మాస్క్ ను వేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ లో మాస్కులు బాగానే లభ్యమవుతున్నాయి. మాస్కులను ఊరికే వేసుకుంటే సరిపోదు. ముఖానికి పూర్తిగా అమరేలా చూసుకోవాలి. అలంకరణ కోసమో,ఎవరి కోసమో, పోలీసులకు, జరిమానాలకు భయపడి మాస్కులు ధరించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ధరించే విధానం, వాడే విధానంలోనూ వైద్య ప్రమాణాలను పాటించాలి. కొంతమంది నోటిని మాత్రమే మూసుకొని, ముక్కు పైభాగాన్ని వదిలేస్తున్నారు. ముక్కు, నోటిని సరిగ్గా మూయకపోతే ప్రయోజనం శూన్యం. అదే విధంగా ఉచ్వాస నిశ్వాసలు సక్రమంగా జరగాలి. ఇండియాలో ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 400 దాటిపోయింది. ఇది పండుగలు, వేడుకల కాలం. జన సమ్మర్ధం పెరగడం ప్రమాదాన్ని పెంచి పోషిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. న్యాయస్థానాలు సైతం ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఫిబ్రవరి ఆరంభంలోనే కరోనా ఉధృతి గరిష్ఠ స్థాయికి చేరుకొనే అవకాశాలు ఉన్నాయని ఐఐటి కాన్పూర్ కు చెందిన అధ్యయనకర్తలు తాజా నివేదికలను సమర్పించారు. ప్రపంచం కోవిడ్ నాలుగో ఉధృతిని ఎదుర్కొంటోందంటూ కేంద్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. విదేశీయులు, విదేశాల్లో తిరిగి వచ్చిన భారతీయులు ఎక్కువమంది ఒమిక్రాన్ కు గురవుతున్నోట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ దశలో వ్యాక్సినేషన్ ప్రక్రియ 100శాతం పూర్తి చేయడం ప్రభుత్వాల బాధ్యత. బూస్టర్ డోసుల వాడకంపై స్పష్టతను ఇవ్వడం, అది సహేతుకమని భావిస్తే అనుమతిని మంజూరు చేయడం అత్యంత అవసరం.
Also read: కర్ణాటక పీఠం కదులుతోందా?
చిన్నారులకు టీకాలు
చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యేలా చూడడం ఎంతో ముఖ్యం. త్వరలో భారత్ బయోటెక్ నుంచి చిన్నారులకు కూడా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. ఆ దిశగా డీసీజీ నుంచి అనుమతి కూడా వచ్చినట్లు సమాచారం ఆనందకరం. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 2 వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధించారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రి కర్ఫ్యూల దిశగానూ ఆలోచిస్తున్నాయి. హరియాణా, ఉత్తరప్రదేశ్ లో రాత్రివేళల కర్ఫ్యూ ఇప్పటికే ఆరంభమైంది. త్వరలో ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఒమిక్రాన్ ముసురుకుంటున్న వేళ ఎన్నికల నిర్వహణ వాయిదా వెయ్యమని కొందరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరమే కానీ అతిగా ఊహించుకొని భయభ్రాంతులకు గురికావడం సరియైనది కాదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. భారత్ లో ఒమిక్రాన్ కేసులు మరింత పెరిగే అవకాశముందని, పాజిటివిటీ రేటు కూడా అధికంగా ఉంటుందని, అదే సమయంలో వ్యాధి తీవ్రత మాత్రం తక్కువగానే ఉండే అవకాశముందని దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ చైర్ పర్సన్ డాక్టర్ ఏంజిలీనా కాట్జీ అంటున్నారు. మొత్తంగా చూస్తే అప్రమత్తంగా ఉండడం, బాధ్యతగా మెలగడం ఎంతో ముఖ్యమని భావించి, ఆచరించడమే శిరోధార్యం.
Also read: కర్ణాటక పీఠం కదులుతోందా?